పర్యాటక ప్రాంతంగా "పట్నం" పెద్ద చెరువు

పర్యాటక ప్రాంతంగా "పట్నం" పెద్ద చెరువు
  • ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి
  • నీటి పారుదల, హెచ్ఎండీఏ అధికారులతో చెరువు సందర్శన
  • రూ. 18.90 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడి

ఇబ్రహీంపట్నం, ముద్ర: నాలుగు వందల ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఇబ్రహీంపట్నం పెద్ద చెరువును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయనున్నట్లు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఇబ్రహీంపట్నం పెద్దచెరువును పర్యాటక ప్రదేశంగా మార్చేందుకు నిధులు మంజూరు కాగా సోమవారం నీటిపారుదల శాఖ అధికారులు ఎస్ఈ హైదర్ ఖాన్, ఈఈ బన్సీలాల్, డిప్యూటీ ఈఈ ఉషా రాణి, ఏఈ రాజ్యలక్ష్మి, హెచ్ఎండీఏ ఈఈ పద్మ, మున్సిపల్ కమిషనర్ రవీందర్ సాగర్, డిప్యూటీ ఈఈ యాదయ్యలతో కలిసి చెరువును సందర్శించి చెరువు అభివృద్ధిపై దిశానిర్దేశం చేశారు.

ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ల చొరవతో రూ. 18.90 కోట్ల నిధులు మంజూరు అయ్యాయని చెప్పారు. మిషన్‌ కాకతీయ కింద ఇప్పటికే ఫిరంగినాలా, పెద్ద కాలువలకు మరమ్మతులు చేయడంతో రెండేళ్లుగా నీరు చేరుతూ చెరువు నిండిందని అన్నారు. 46ఏళ్ల తర్వాత నిండి జలకళతో తొణికిసలాడుతున్న పెద్ద చెరువు కట్టను మూడు కిలో మీటర్ల మేర సుందరీకరించి, పార్క్‌లు, బోటింగ్‌ వంటి సదుపాయాలతో పర్యాటకంగా అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. ఎక్కువ పొడవున్న ఈ చెరువు కట్టకు సుందరీకరణ పనుల్లో భాగంగా మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చి పర్యాటకంగా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని తెలిపారు. త్వరలోనే పనులు ప్రారంభించి పర్యాటక ప్రాంతాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు.