నిర్మల్ జిల్లాలో పోలీసు మార్క్ పెత్తనం

నిర్మల్ జిల్లాలో పోలీసు మార్క్ పెత్తనం
  • ఎబివిపి పాఠశాలల బంద్ విఫలం చేసేందుకు బెదిరింపులు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లాలో పోలీసు మార్క్ పెత్తనం కొనసాగుతోంది. బాసర ఘటనకు నిరసనగా ఎబివిపి పాఠశాలల బందుకు పిలుపునిచ్చింది. ఈ పిలుపును విఫలం చేసేందుకు పోలీసు అధికారులు ప్రైవేటు విద్యా సంస్థల సంఘానికి కాల్ చేసి బలవంతంగా స్కూళ్లు తెరిపించారు. వివరాలిలా ఉన్నాయి. బాసర లో ట్రిపుల్ ఐటీ విద్యార్థిని స్వాతి ప్రియ రెండు రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడింది ఈ ఘటనపై ఏబీవీపీ కార్యకర్తలు సంస్థ ఎదుట నిరసనలు వ్యక్తం చేస్తుండగా బాసర ట్రిపుల్ ఐటీ సెక్యూరిటీ, పోలీసులు ఏబీవీపీ కార్యకర్తలపై లాఠీలు ఝలిపించారు.

ఈ ఘటనలో ఒక కార్యకర్త తలపగిలి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. ఈ చర్యకు నిరసనగా ఎబివిపీ విద్యార్థి సంఘం అభ్యర్థన నేపథ్యంలో ప్రైవేటు పాఠశాలలు మూసి ఉంచారు. దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసు యంత్రాంగం ప్రైవేటు పాఠశాలల సంఘం ట్రస్మా నాయకులకు ఫోన్ చేసి పాఠశాలలు తెరిపించాలని ఒత్తిడి తెచ్చారు. పాఠశాలలు అన్నీ తెరచి ఉండేలా చూడాలని మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. దీంతో అప్పటికప్పుడు పాఠశాలల యాజమాన్యాలు ఉపాధ్యాయులకు, విద్యార్థులకు చరవాణిలో సందేశాలు పంపి తెరిపించారు. పోలీసుల తీరు పట్ల  సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.