తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా దర్బార్

తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా దర్బార్
  • ప్రజా సమస్యలతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమస్యల పరిష్కారానికి కృషి
  • నాలుగు దశాబ్దాలకు పైగా తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో అనుబంధం
  • కార్యకర్తలకు కష్టం కలిగిస్తే సహించేది లేదు
  • ఇకనుండి తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగ ఉంటా
  • రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా దర్బార్ నిర్వహణ
  • తుంగతుర్తి నియోజకవర్గం అభివృద్ధి జరిగిందంటే అది తన హయాంలోనే
  • శ్రీరామ్ సాగర్ కాల్వ కోసం అనేక ఉద్యమాలు చేసి గోదావరి జలాలు తుంగతుర్తికి రప్పించా
  • మాజీ మంత్రి సీనియర్ కాంగ్రెస్ నాయకులు రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి
     

తుంగతుర్తి ముద్ర:-తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇబ్బందులకు గురవుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని త్వరలో తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి ప్రజా సమస్యలతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామని మాజీ మంత్రి సీనియర్ కాంగ్రెస్ నాయకులు రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి అన్నారు .బుధవారం తుంగతుర్తి మండలం బండ రామారం గ్రామంలో  ఎంపీటీసీ మడ్డి నాగలక్ష్మి కృష్ణమూర్తి తమ పదవీకాలం ముగుస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలసమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

ఈ సందర్భంగా దామోదర్ రెడ్డి మాట్లాడుతూ 1985లో తాను తుంగతుర్తి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మొదటిసారి బరిలో నిలిచానని నాడు తాను పోటీ చేసిన ప్రత్యర్థి అభ్యర్థి తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు ప్రముఖ కమ్యూనిస్టు నాయకురాలు మల్లు స్వరాజ్యం పై పోటీ చేశానని నాడు ప్రజలు తనను అభిమానించి ఆదరించి 12 వేలకు పైగా మెజారిటీతో గెలిపించాలని అన్నారు .అనంతరం 1989లో రెండవసారి మల్లు స్వరాజ్యం పై పోటీ చేసి విజయం సాధించానని అన్నారు. నాడు తనకు ఆరోగ్యం బాగా లేకున్నా తాను చావు బతుకుల మధ్య పోరాటం చేస్తూ ఉన్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే తనకు అండగా నిలిచి విజయం చేకూర్చాలని అన్నారు.

నియోజకవర్గంలో ఆనాడు అభివృద్ధి ఏమీ లేదని తాను ఎమ్మెల్యేగా గెలిచాక గ్రామాలకు, తండాలకు రవాణా సౌకర్యం విద్యుత్ సౌకర్యం కల్పించానని ,తాగునీటి సౌకర్యం కల్పించానని ,అన్నారు. 1994లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనకు టికెట్ ఇవ్వకపోవడంతో తాను పోటీలో ఉండకూడదని నిర్ణయించుకున్నానని కానీ వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు తరలివచ్చి తాను వేసిన నామినేషన్ విత్ డ్రా చేసుకోకుండా ఒత్తిడి తెచ్చి తనను గెలిపించారని అన్నారు .మూడుసార్లు తాను గెలిచిన గెలుపు ప్రజా ఆశీర్వాదమేనని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విజయమేనని అని అన్నారు .

1999 లో తన కుటుంబ సమస్యల వల్ల నియోజకవర్గంలో పర్యటించలేకపోయానని కార్యకర్తలు తన గెలుపు కోసం కృషి చేశారని అయినా తాను స్వల్ప మెజారిటీతో ఓటమిపాలయ్యారని అన్నారు. అనంతరం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల జడ్పిటిసి ,ఎంపీపీలను కైవసం చేసుకున్నామని మెజార్టీ సర్పంచ్లను గెలిపించుకున్నామని అన్నారు .అనంతరం 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తనను మంచి మెజారిటీతో గెలిపించారని అన్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పటిష్టత కొరకు అనేక పోరాటాలు చేశానని కార్యకర్తల రక్షణ కోసం అహర్నిశలు కృషి చేశానని అన్నారు .కార్యకర్తలు నాయకులు కూడా పార్టీ కోసం ఎనలేని కృషి చేశారని అన్నారు.

తన హయాంలో ఎస్సీలకు బీసీలకు తగిన న్యాయం చేశానని సామాన్య కార్యకర్తగా ఉన్న చెవిటి వెంకన్న యాదవ్ లాంటి వారికి ఉన్నత పదవులు కల్పించామని నేడు సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారని అన్నారు .గుడిపాటి నరసయ్యను ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిపామనీ దురదృష్టవశాత్తు ఓటమి పాలయ్యాడని అన్నారు. నియోజకవర్గంలో విద్యుత్తు రవాణా తాగునీరు సాగునీరు కోసం  కృషి చేశామని అన్నారు. నాడు శ్రీరాంసాగర్ రెండవ దశ పూర్తి కొరకు అనేక ఉద్యమాలు చేశామని ప్రగతి నగర్ శిలాఫలకం వద్ద 30 వేల మందితో రక్తతర్పణం చేశామని అన్నారు. తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం తుంగతుర్తి ప్రాంత సమస్యల పరిష్కారం కోసం సూర్యాపేటలో సుమారు 6 లక్షల మందితో నాడు తెలంగాణ పరిరక్షణ బహిరంగ సభ నిర్వహించామని అన్నారు.

శ్రీరాంసాగర్ కాల్వ కోసం ప్రగతి నగర్ వద్ద వేలాది మంది రైతులతో కలిసి నిరసన శిలాఫలకం వేసామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక టైం బాండ్ తో శ్రీరాంసాగర్ కాల్వ పూర్తి చేసి గోదావరి జిల్లాలు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే తుంగతుర్తి రప్పించామని అన్నారు .తనకు రాజకీయ బిక్ష పెట్టిన తుంగతుర్తి నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోలేనని అన్నారు .తాను తుంగతుర్తి నియోజకవర్గ ప్రజానీకానికి ఎంతో రుణపడి ఉన్నానని వారి కష్టనష్టాల్లో ఎల్లప్పుడూ పాలుపంచుకుంటానని అన్నారు .తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా తాను క్షణాల్లో వారి ముందు ఉంటానని వారి కష్టాలను పరిష్కరిస్తానని అన్నారు .రానున్న కాలంలో తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలకు అనునిత్యం అందుబాటులో తన కుమారుడు సర్వోత్తమ్ రెడ్డి ఉంటాడని త్వరలో ప్రజా దర్బార్ కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రజా విన్నపాలను స్వీకరించి పరిష్కారం చేస్తామని అన్నారు. కార్యకర్తలకు అన్యాయం జరిగితే తాను సహించనని దామోదర్ రెడ్డి అన్నారు.

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ వ్యాప్తంగా అఖండ మెజార్టీ సాధిస్తుందని ఆ దిశగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు దామోదర్ రెడ్డి పిలుపునిచ్చారు .ఈ సందర్భంగా దామోదర్ రెడ్డిని ఆయన కుమారుడు సర్వోత్తమ్ రెడ్డిని డిసిసి అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ను కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు శాలువాలతో ఘనంగా సన్మానించారు .ఈ కార్యక్రమంలో పిసిసి మెంబర్ గుడిపాటి నరసయ్య ,జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తిరుమల ప్రగడ అనురాధ కిషన్ రావు, నాగారం మండల పార్టీ అధ్యక్షుడు లింగయ్య ,మద్దిరాల మండల పార్టీ అధ్యక్షుడు ముక్కాల అవిలమల్లు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ వైస్ ఎంపీపీ సంకినేని గోవర్ధన్ రావులతోపాటు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.