యువశక్తితోనే అభివృద్ధి

యువశక్తితోనే అభివృద్ధి
  • విద్య, నైపుణ్యాలతోనే నూతనావకాశాలు
  • యువతను సిద్ధం చేస్తోన్న భారత్​
  • కౌశల్​ దీక్షాత్​ సమారోహ్​లో ప్రధాని మోడీ

న్యూఢిల్లీ​: విద్య, నైపుణ్యాల ద్వారా నూతనావకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు భారత్​ యువతను సిద్ధం చేస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. గురువారం కౌశల్ దీక్షాత్ సమారోహ్‌ వర్చువల్​గా జాతినుద్దేశించి ప్రసంగించారు. యువశక్తి ఎప్పుడు బలంగా ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని మోడీ అన్నారు. భారతదేశంలో నైపుణ్యాభివృద్ధి పరిధి నిరంతరం వృద్ధి చెందుతుందన్నారు. నాలుగు దశాబ్దాల తర్వాత కొత్త జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చామన్నారు. దేశ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో కొత్త వైద్య కళాశాలలు, ఐఐటీలు, ఐఐఎంలు, ఐటీఐల వంటి నైపుణ్యాభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేస్తోందని ప్రధాని అన్నారు. ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన కింద కోట్లాది మంది యువత శిక్షణ పొందారని ప్రధాని పేర్కొన్నారు. ఉద్యోగాలు కల్పించే సంప్రదాయ రంగాలను కూడా బలోపేతం చేస్తున్నామన్నారు. ఈ శ‌తాబ్ది భార‌త‌దేశానిదే అన్నారు. ప్రపంచం కూడా దీన్ని విశ్వసిస్తోందని పేర్కొన్నారు.  నైపుణ్యం కలిగిన యువత కోసం ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోందన్నారు. గ్లోబల్ స్కిల్ మ్యాపింగ్‌కు సంబంధించి భారతదేశం ప్రతిపాదన ఇటీవల జీ–20 సమ్మిట్‌లో ఆమోదించబడిందని, ఇది రాబోయే కాలంలో యువతకు మంచి అవకాశాలను కల్పించడంలో సహాయపడుతుందన్నారు. భారతదేశం మునుపెన్నడూ లేనంతగా యువత నైపుణ్యాలపై ఎక్కువ పెట్టుబడి పెడుతోందని ఆయన నొక్కి చెప్పారు. సర్వే ప్రకారం, భారత్​లో నిరుద్యోగిత రేటు ఆరేళ్ల కనిష్టానికి చేరిందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం ద్వారా 10 లక్షల 60 వేల మంది యువతకు సర్టిఫికెట్లు అందజేశామన్నారు.

రూ.4200 కోట్లతో అభివృద్ధి పనుల ప్రారంభం

అనంతరం ప్రధాని మోడీ ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్ పర్యటన చేపట్టారు. పార్వతికుండ్​, ఆల్మోరాలో జగేశ్వర్​ధామ్​ను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.  గుంజి గ్రామంలో స్థానికులు ఏర్పాటు చేసిన చేతి ఉత్పత్తుల (క్రాఫ్ట్​ ఎగ్జిబిషన్​)ను సందర్శించారు. పితోర్​గడ్​లో మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్యం, విద్యుత్​, తాగునీరు, క్రీడలు, పర్యాటకం, విపత్తుల నివారణ, ఉద్యానవనాల పెంపు రూ. 4200 కోట్లతో చేపట్టే తదితర 23 అభివృద్ధి పనులకు ప్రధాని మోడీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.