భైంసా డిపోలో నిలిచిన ప్రైవేటు బస్సులు

భైంసా డిపోలో నిలిచిన ప్రైవేటు బస్సులు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా భైంసా ఆర్టీసి డిపోలో ప్రైవేటు బస్సులు బుధవారం నిలిచిపోయాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల  ప్రవేశపెట్టిన  హిట్ అండ్ రన్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ భైంసా బస్సు డిపో పరిధిలోని అద్దె బస్సు డ్రైవర్లు బుధవారం ఆందోళనలకు దిగారు. సంబంధిత చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సమ్మె బాట పట్టారు. తెల్లవారు జాము నుంచి అద్దె బస్సు డ్రైవర్లు మెరుపు సమ్మెకు దిగారు. విధులు బహిష్కరించి డిపో ముందు నిరసనకు దిగారు.

దీంతో భైంసా డిపో పరిధిలోని 49 అద్దె బస్సులు నిలిచిపోయాయి. సమ్మెలో భాగంగా అద్దె బస్సు డ్రైవర్లు, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టి ప్రదర్శనలు నిర్వహించారు. డ్రైవర్ల పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని హిట్ అండ్ రన్ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రదర్శనలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం హిట్ అండ్ రన్ చట్టాన్ని ఉపసంహరించేంత వరకు సమ్మె, ఆందోళనలు కొనసాగుతాయని అద్దె బస్సు డ్రైవర్లు వెల్లడించారు. భైంసా డిపో పరిధిలో 73 బస్సులు ఉండగా ఇందులో 49 అద్దె బస్సులు ఉన్నాయి. అద్దె బస్సులు నిలిచిపోవడంతో వివిధ రూట్లలో రాకపోకలు నిర్వహించే ప్రయాణీకులు తీవ్ర రాకపోకల సమస్యలు ఎదుర్కొంటున్నారు.