అక్రమ ఆస్తులను కాపాడుకోవడానికి పార్టీలు మార్చేందుకు ప్రయత్నం చేయడం సిగ్గుచేటు..

అక్రమ ఆస్తులను కాపాడుకోవడానికి పార్టీలు మార్చేందుకు ప్రయత్నం చేయడం సిగ్గుచేటు..
  • మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కాంగ్రెస్ లో చేర్చుకోవద్దంటూ నిర్మల్ లో నిరసన.

ముద్ర ప్రతినిధి, నిర్మల్: మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ లో చేర్చుకోవద్దంటూ కాంగ్రెస్ శ్రేణులు డీ సీ సీ అధ్యక్షులు శ్రీహరి రావు నివాసం ఎదుట శుక్రవారం నిరసనలు నిర్వహించారు. గత ప్రభుత్వంలో పదేళ్లు మంత్రిగా ఉండి అధికార దాహంతో అక్రమంగా సంపాదించుకున్న అక్రమ ఆస్తులను కాపాడుకోవడానికి మాజీమంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో వచ్చేందుకు ప్రయత్నాలు చేయడం సిగ్గుచేటని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. అనంతరం డిసిసి అధ్యక్షుడికి వినతిపత్రం అందజేశారు.  మాజీమంత్రి అతని కుటుంబీకులు అక్రమంగా ఆక్రమించుకున్న చెరువులు కందకాలు, డీ1 పట్టాలను కాపాడుకోడానికి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే ప్రయత్నాలు చేయడం సిగ్గుచేటని అన్నారు.

గత రాజకీయ చరిత్ర అంతా ఊసరవెల్లి లాగా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ జెండా పట్టుకునే నైజం ఆయనదని ఆరోపించారు. గత 30 సంవత్సరాల రాజకీయంలో విలువలు, సిద్ధాంతాలు లేని వ్యక్తి మాజీ మంత్రి అల్లోల అని విమర్శించారు. గత పది సంవత్సరాలుగా మంత్రిగా ఉండి కనిపించిన చెరువును, గుడిని, గుడిలో ఉన్న లింగాన్ని భూములను, మున్సిపల్ ఉద్యోగాల్లో అవినీతికి పాల్పడి ఇప్పుడు కాంగ్రెస్ వైపు ఎందుకు చూస్తున్నారని ప్రశ్నించారు. మాజీ మంత్రి కుటుంబ అధికార దాహాన్ని భరించలేకనే ప్రజలు గత అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారన్నారు.సిగ్గు లేకుండా అధికార పార్టీలోకి వస్తా అంటున్నారని మండిపడ్డారు. 74 సంవత్సరాలు వచ్చినా ఇంకా అధికార దాహం తీరలేదా ?అని ప్రశ్నించారు. ఇలాంటి నాయకున్ని పార్టీలో చేర్చుకోవద్దంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విన్నవించాలని కోరారు. కబ్జాల మంత్రి పార్టీలోకి వస్తే కాంగ్రెస్ కు తీవ్ర నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు.