దిలావర్ పూర్ డబుల్ ఇళ్ల వ్యవహారంలో నిరసనలు

దిలావర్ పూర్ డబుల్ ఇళ్ల వ్యవహారంలో నిరసనలు
  • మంజూరు కాకున్నా నివాసం ఉంటున్న వారిని ఖాళీ చేయించిన అధికారులు
  • నివాసం ఉన్నవారు నిరసనలు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ లో డబుల్  బెడ్ రూం ఇళ్ల వ్యవహారంలో మంగళవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామంలో అర్హులైన లబ్ధిదారుల కోసం నిర్మించిన 32 ఇందిరమ్మ ఇళ్ళను కొందరు  ఎలాంటి అధికారిక ఆదేశాలు లేకుండానే ఆక్రమించుకుని నివాసం ఉంటున్నారు. ఈ మేరకు కొందరు వ్యక్తులు జిల్లా కలెక్టర్ కు, స్థానిక ఎంఆర్ఓ కు, సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఇళ్ళల్లో ఉంటున్నవారిని వెంటనే ఖాళీ చేయించాలని కలెక్టర్ ఆదేశించారు. దీంతో మంగళవారం స్థానిక ఎంఆర్ఓ పోలీస్ బలగాలతో డబుల్ ఇళ్ల వద్దకు చేరుకొని అక్రమంగా ఇళ్లను ఆక్రమించుకొని ఉంటున్నవారు వెంటనే ఖాళీ చేయాలని సూచించారు. వారు పట్టించుకోకుండా అధికారులతో ఘర్షణలకు దిగారు.

అధికారులు బాధితుల మధ్య సుమారు గంటన్నర పాటు వాదోపవాదాలు జరిగాయి. అనంతరం పోలీస్ బలగాలతో ఎంఆర్ఓ ఇండ్ల నుండి ఖాళీ చేయించేందుకు యత్నించటంతో నిరసనకు దిగారు. గత ప్రభుత్వ హయాంలో గ్రామంలో 32 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలకు పునాదులు వేశారు. నిర్మాణ పనులు పూర్తయ్యే దశలో ఉన్నాయి. పూర్తయిన 32 ఇళ్ల పంపిణీ కోసం లబ్ధిదారుల ఎంపిక తరుణంలోనే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో  ఇళ్ల పంపిణీ కార్యక్రమం వాయిదా పడింది. దిలావర్ పూర్ మండల కేంద్రంలో ఇళ్లు లేని 75కు పైగా కుటుంబాలు ఉన్నాయి. ఐతే కేవలం 32 ఇండ్ల నిర్మాణాలు చేపట్టడంతో ఇండ్ల పంపిణీ స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధులకు తలనెప్పిగా మారింది.