ప్రజల సంక్షేమానికి ప్రజాపాలన సమావేశాలు

ప్రజల సంక్షేమానికి ప్రజాపాలన సమావేశాలు
  • ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నోడల్ అధికారి ఎం ప్రశాంతి

ముద్ర ప్రతినిధి, నిర్మల్:అభయ హస్తం పథకంలో భాగంగా ప్రజావసరాలను తీర్చేందుకు ప్రజాపాలన సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నోడల్ అధికారి ఎం ప్రశాంతి వివరించారు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా నిర్మల్ పట్టణంలోని బాగులవాడ, దిలావర్ పూర్ మండలం సిర్గాపూర్ ల్లో జరిగిన కార్యక్రమాల్లో ఆమె శుక్రవారం పాల్గొన్నారు.ఈ సందర్భంగా  మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభయహస్తం కార్యక్రమంలో భాగంగా ఆరు గ్యారంటీలను అమలుపరచడానికి అర్హులైన ప్రజల నుండి ప్రజా పాలన కార్యక్రమం ద్వారా దరఖాస్తుల స్వీకరణ జనవరి 6వరకు అన్ని పని దినాలలో తీసుకుంటారని అన్నారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం గ్రామాలలో, వార్డులలో ప్రజాపాలన కార్యక్రమాలు నిర్వహించి ఆరు గ్యారంటీలకు సంబందించి ప్రజల నుంచి వివిధ పథకాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కోరారు.  

చివరి వరుసలో ఉన్న పేదవారికి కూడా సంక్షేమ పథకాలు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం స్వయంగా ప్రజల ముంగిట్లోకి వచ్చిందన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని, ఇందు కోసం  కుటుంబం నుంచి ఒకరు వచ్చి దరఖాస్తు చేస్తే సరిపోతుందని వివరించారు.అన్ని పథకాలకు సంబంధించి ఒకే దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. వివిధ కారణాల వల్ల  గ్రామ సభలో దరఖాస్తు చేసుకొలేనివారు తిరిగి గ్రామ కార్యదర్శికి దరఖాస్తు సమర్పించుకోవచ్చని తెలిపారు.  దరఖాస్తు దారులకు తప్పనిసరిగా రశీదు అందించాలని సంబంధిత అధికారులను  సూచించారు. తాను ఆదిలాబాద్ కలెక్టర్ గా పనిచేసిన సమయానికి, ఇప్పటికి మండలాల్లో పారిశుద్ధ్యం మెరుగు పడిందని, ఇందుకు కృషి చేసిన అధికారులను అభినందించారు. ప్రజా పాలన గ్రామ సభ కార్య క్రమ సభ ప్రారంభానికి ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి సందేశాన్ని చదివి వినిపించారు.