ప్రజా ప్రయోజనం మీడియా బాధ్యత...

ప్రజా ప్రయోజనం మీడియా బాధ్యత...
  • ఫోర్త్ ఎస్టేట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న మీడియా..
  • తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి
  • మీడియా ప్రతినిధుల ఆత్మీయ సమ్మేళనంలో చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి కి ఘన సన్మానం 

చౌటుప్పల్, ముద్ర న్యూస్: సంచలనాల కోసం కాకుండా, ప్రజా ప్రయోజనాలకు దోహదపడే కథనాలతో మీడియా తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కలిమెకొలను శ్రీనివాస్ రెడ్డి సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణం వలిగొండ రోడ్డులోని ఎస్ ఎం రెడ్డి గార్డెన్ లో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా ఉపాధ్యక్షుడు దోనూరు రాంరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన చౌటుప్పల్ మండల ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ శ్రీనివాస్ రెడ్డిని పూలమాలలు, శాలువాలు, బొకేలతో ఘనంగా సన్మానించారు.

అనంతరం మాట్లాడుతూ ప్రజల పక్షపాతిగా వ్యవహరిస్తూ, మీడియా స్వేచ్ఛగా తన బాధ్యతల్ని నిర్వర్తించేందుకే  ఫోర్త్ ఎస్టేట్ గా పిలువ బడుతోందని ఆయన స్పష్టం చేశారు. అయితే సమాజ శ్రేయస్సు కోసం గతంలో మీడియా పోషించిన పాత్రకు, ప్రస్తుతం పోషిస్తున్న పాత్రకు ఎంతో తేడా ఉందన్నారు. వ్యాపార కోణంలో మీడియాను కొనసాగిస్తే ప్రజల ఆకాంక్షాలకు అనుగుణంగా సమాజానికి మేలు చేయలేరని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. భావ వ్యక్తీకరణకు సోషల్ మీడియా పురుడు పోసుకోవడం శుభ పరిణామమే అయినప్పటికీ, ఆ స్వేచ్ఛను వ్యక్తిగత ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయడం సహించరానిదన్నారు. రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం మీడియా అకాడమీ తన వంతు కృషి చేస్తుందన్నారు. జర్నలిస్టుల ప్రధాన సమస్యలైన ఆరోగ్య పథకం, ఇంటి స్థలాలు, ఇండ్లు అందించే దిశలో కృషి చేస్తున్నట్లు శ్రీనివాస్ రెడ్డి భరోసా ఇచ్చారు.

తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షులు కె విరాహత్ అలీ మాట్లాడుతూ నాడు ఉమ్మడి రాష్ట్రంలో, నేడు తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల గొంతుకగా పనిచేస్తున్న ఏకైక సంఘం తమదేనన్నారు. వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమంలో యాభై యేండ్ల నుండి క్రియాశీలక పాత్ర పోషిస్తూ, జాతీయ స్థాయిలో జర్నలిస్టుల గొంతుకగా నిలిచిన శ్రీనివాస్ రెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్ గా కొనసాగడం మీడియా రంగానికి శుభపరిణామమని ఆయన కొనియాడారు. రాష్ట్రంలో జర్నలిస్టుల ప్రధాన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి నిరంతరం తమ సంఘం కృషి చేస్తున్నట్లు విరాహత్ స్పష్టం చేశారు. స్థానిక మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టులకు చౌటుప్పల్ లో ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు, ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో తన వంతు కృషి చేస్తానని తెలిపారు.

పాత్రికేయులు ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తేవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో యూనియన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎంబ నరసింహులు, పోతంశెట్టి  కరుణాకర్, యూనియన్ జాతీయ కౌన్సిల్ సభ్యులు ఎలిమినేటి ఇంద్రారెడ్డి, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు మల్లేశం, జర్నలిస్టుల ఆరోగ్య కమిటీ సభ్యులు జహంగీర్, జిల్లా ఉపాధ్యక్షులు దోనూరు రాంరెడ్డి, సీనియర్ రిపోర్టర్లు సుర్కంటి మహేందర్ రెడ్డి, పందుల నరసింహ, చిదుగుళ్ల జంగయ్య గౌడ్, దొడ్డి రాములు, ఉబ్బు లింగస్వామి, దోనూరు జగన్ రెడ్డి, పోలోజు శ్రీనివాసచారి, బొమ్మ మల్లేష్, ఊదరి శ్యామ్ సుందర్, కొత్తోజు కుమారస్వామి, బుల్లోజు సందీప్, బొడిగె ప్రభాకర్, బోదుల నరేష్, సురివి కిరణ్, ఊదరి  స్వామినాథం, లింగానాయక్, ఎండి రఫీ, చిలివేరు సంజీవ, కలకొండ సంజీవ తదితరులు పాల్గొన్నారు.