ఐదు దశాబ్దాలుగా తుంగతుర్తి లో పేద ప్రజలకు వైద్య సేవలు అందించిన ఆర్ఎంపి వైద్యుడు ఉపేంద్రం గుండెపోటుతో మృతి

ఐదు దశాబ్దాలుగా తుంగతుర్తి లో పేద ప్రజలకు వైద్య సేవలు అందించిన ఆర్ఎంపి వైద్యుడు ఉపేంద్రం గుండెపోటుతో మృతి
  • ఉపేంద్రం  మృతికి సంతాపం తెలిపిన మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి
  • ఆర్ఎంపి వైద్యుడు ఉపేంద్రం భౌతికకాయంపై పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామేల్
  • ఆర్ఎంపి వైద్యుడు  ఉపేంద్రం మృతితో తుంగతుర్తిలో విషాదఛాయలు


తుంగతుర్తి ముద్ర:- సుదీర్ఘకాలం పేద ప్రజానీకానికి వైద్య సేవలు అందించి తుంగతుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేకతను నిలుపుకున్న ఆర్ఎంపీ వైద్యుడు పి ఉపేంద్రం శుక్రవారం అర్ధరాత్రి గుండెపోటుతో మృతి చెందిన సంఘటన తుంగతుర్తి మండల కేంద్రంలో చోటుచేసుకుంది . ఆర్ఎంపి వైద్యుడు ఉపేంద్ర మృతి చెందిన సంఘటన నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రజానీకాన్ని ఆవేదనకు గురిచేసింది. గత ఐదు దశాబ్దాలుగా తుంగతుర్తి మండల కేంద్రంలో పేద ప్రజానీకానికి వైద్య సేవలు అందిస్తూ సామాజిక కార్యక్రమాల్లో తనకు తోచిన విధంగా సమాజ సేవ చేస్తూ విశేషంగా ప్రజల మన్ననలు అందుకున్నారు.

తన దగ్గరికి వచ్చే రోగులకు వైద్య సేవలు అందించి వారు ఎంత ఇచ్చిన కాదనకుండా తీసుకుని వైద్య సేవలు అందించే వారిని ప్రజలు చెబుతున్నారు .సుదీర్ఘకాలం ఆర్ఎంపీగా కొనసాగిన ఉపేంద్రం వేలాది మందికి వైద్య సేవలు అందించడమే కాక తన వద్ద వైద్యం నేర్చుకోవడానికి వచ్చిన ఎంతోమందికి ప్రాథమిక వైద్యం నేర్పి ఆర్ఎంపీలుగా తీర్చిదిద్దిన ఘనత కూడా ఉపేంద్రానికి ఉందని పలువురు చెబుతున్నారు. ఆర్ఎంపి వైద్యుడు ఉపేంద్ర మరణ వార్త తెలుసుకున్న ప్రజలు వందలాదిగా ఆయన భౌతికకాయాన్ని చివరిసారి చూడడానికి తుంగతుర్తి కి వస్తున్నారు. మాజీ మంత్రి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్, డిసిసి అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు తిరుమల ప్రగడ అనురాధ కిషన్ రావు, పిసిసి మెంబర్ గుడిపాటి నరసయ్యలతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు వ్యాపారవేత్తలు విశేషంగా ప్రజానీకం ఉపేంద్రం భౌతిక కాయం పై పుష్పగుచ్చాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. వైద్యుడు ఉపేంద్ర మృతి చెందడంతో తుంగతుర్తి పట్టణం లో ఏ మూల చూసినా విషాదఛాయలు అలుముకున్నాయి సుదీర్ఘకాలం వైద్య సేవలు అందించిన ఉపేంద్రం ఇక లేరని వార్తను ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు.