చిల్లేపల్లి సహకార సంఘం చైర్మన్  రమణారెడ్డి

చిల్లేపల్లి సహకార సంఘం చైర్మన్  రమణారెడ్డి
  • నూతనంగా ఎన్నికైన చైర్మన్ రమణారెడ్డిని సన్మానిస్తున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు 
  • చిల్లేపల్లి పిఎసిఎస్ చైర్మన్ గా మలిగిరెడ్డి రమణారెడ్డి ఎన్నిక ఏకగ్రీవం 
  • కాంగ్రెస్ శ్రేణుల్లో హర్షాతిరేకాలు 

ముద్ర న్యూస్ నేరేడుచర్ల:-చిల్లేపల్లి ప్రాథమిక సహకార సంఘం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. సోమవారం ఏకపక్షంగా జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మలిగిరెడ్డి రమణారెడ్డి చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఇటీవల బిఆర్ఎస్ పార్టీకి చెందిన సహకార సంఘం చైర్మన్ అనంత్ శ్రీనివాస్ గౌడ్ పై అవిశ్వాస తీర్మానం పెట్టి పదవి నుండి దింపి వేయడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది.ఈ నేపథ్యంలో జిల్లా సహకార సంఘం చైర్మన్ ఎన్నికకై ఈనెల 7న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఎన్నికల అధికారి ఇందిర ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సహకార సంఘంలో మొత్తం 13 మంది డైరెక్టర్లు ఉండగా చిల్లేపల్లి కి చెందిన డైరెక్టర్ కొండ పిచ్చయ్య ఇటీవల మృతి చెందారు. వైస్ చైర్మన్ గంగ రంగారెడ్డి, డైరెక్టర్లు మలిగిరెడ్డి హేమలత, మలిగిరెడ్డి రమణారెడ్డి, పెద్దపంగ ముత్తమ్మ, మాలోతు గోవిందు పేర్వాల రంగారెడ్డి, బొజ్జ సైదమ్మ, పల్లా వెంకటయ్య తో కలుపుకొని 8 మంది డైరెక్టర్లు హాజరయ్యారు. ఎన్నికల అధికారి ఇందిర నామినేషన్ ప్రక్రియ ప్రారంభించగా మొదట దాచారం గ్రామానికి చెందిన డైరెక్టర్ పేర్వాల రంగారెడ్డి చింతకుంట్ల గ్రామానికి చెందిన డైరెక్టర్ మలిగిరెడ్డి రమణారెడ్డిని చైర్మన్ అభ్యర్థిగా  ప్రతిపాదించగా కల్లూరు గ్రామానికి చెందిన బొజ్జ సైదమ్మ  బలపరిచారు. నిర్దేశిత సమయంలో ఒకే ఒక్క నామినేషన్ రావడంతో మలిగిరెడ్డి రమణారెడ్డి చైర్మన్ గా ఎన్నిక  ఏకగ్రీవమైనట్లు ప్రకటించారు. అనంతరం నియామక పత్రాన్ని అందజేసి ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం సీఈఓ నాగరాజు ఉన్నారు.

కాంగ్రెస్ పార్టీ హర్షాతిరేకాలు

చిల్లేపల్లి సహకార సంఘం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడంతో కాంగ్రెస్ పార్టీ లో హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి. ఎన్నిక పూర్తయిన వెంటనే సహకార సంఘం కార్యాలయం ఎదుట బాణాసంచా కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొణతం చిన వెంకటరెడ్డి, జడ్పిటిసి నరసయ్య ల ఆధ్వర్యంలో చైర్మన్ గా ఎంపికైన మలిగిరెడ్డి రమణారెడ్డిని పూల మాలలతో, పట్టు శాలువాలలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చలసాని శ్రీనివాసరావు కట్టా రామారావు, కొంజేటి జ్యోతి బాబు, చిత్తమళ్ళ సైదులు పారేపల్లి సత్యనారాయణ, వల్లపరెడ్డి వెంకన్న ,మామిడి వెంకన్న, కొడిద మనోజ్ , ఎక్కలూరి వెంకటరెడ్డి , ఇరుగు నాగరాజు,  బొరీగల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.