అచ్యుతాపురం సెజ్‌లో రియాక్టర్ పేలి పదనాలుగు మంది మృతి

అచ్యుతాపురం సెజ్‌లో రియాక్టర్ పేలి పదనాలుగు మంది మృతి
  • ఫార్మా సెజ్‌‌లోని ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్స్‌లో పేలుడు
  • మధ్యాహ్నం లంచ్ సమయంలో పేలిన రియాక్టర్
  • ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. రాంబిల్లి మండలం అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లో ఈరోజు మధ్యాహ్నం రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఏడుగురు మృతి చెందారు. యాభై మంది వరకు గాయపడ్డారు. ఫార్మా సెజ్‌లోని ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌‌లో వందలాది మంది పని చేస్తున్నారు.

మధ్యాహ్నం లంచ్ సమయంలో ఒకటిన్నర గంటలకు భారీ పేలుడు సంభవించింది. మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా దట్టంగా పొగ అలుముకుంది. దీంతో కార్మికులు భయంతో పరుగులు పెట్టారు. భారీ శబ్దం రావడంతో ఏం జరిగిందో తెలియక సమీప గ్రామాల ప్రజలు ఉలిక్కిపడ్డారు. పేలుడు ధాటికి పరిశ్రమలోని మొదటి అంతస్తు శ్లాబ్ కూలిపోయింది.

ఫార్మా సెజ్‌లోని అగ్నిమాపక యంత్రంతో పాటు మరో పదకొండు ఫైర్ ఇంజిన్లు వచ్చి మంటలను అదుపు చేశాయి. మూడో అంతస్తులోని కార్మికులను క్రేన్ సాయంతో బయటకు తీసుకువచ్చారు. ఈ ఘటనలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ఈ పరిశ్రమలో 300 మంది కార్మికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. శిథిలాల కింద కొందరు చిక్కుకున్నట్లుగా భావిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

చంద్రబాబు దిగ్భ్రాంతి

అచ్యుతాపురం సెజ్ ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కలెక్టర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని, సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు.