డీఎస్సీ నోటిఫికేషన్  విడుదల

డీఎస్సీ నోటిఫికేషన్  విడుదల

ముద్ర, తెలంగాణ బ్యూరో :తెలంగాణలో టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తెలంగాణ ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ నోటీఫికేషన్ (డీఎస్సీ –2023) విడుదలైంది. మొత్తం 5089 పోస్టుల భర్తీకి డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యూకేషన్ ఈ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ లో 1,739 స్కూల్ అసిస్టెంట్లు,  2,575 సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్ జీటీ)లు, 611 భాషా పండితులు, 164 వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు ఈనెల 20వ తేదీ నుంచి అక్టోబర్  21వరకు దరఖాస్తు చేసుకోవాలి. నియామక ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈసారి డీఎస్సీని కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీఆర్ టీ) ఆధారంగా నిర్వహిస్తామని తెలిపారు. పరీక్షను నవంబర్ 20 నుంచి 30వ తేదీ వరకు నిర్వహిస్తామని అధికారులు పేర్కొన్నారు. డీఎస్సీకి దరఖాస్తు చేసుకునేందుకు బీఈడీ, డీఈడీ, బీపీఈడీ ఉత్తీర్ణతతోపాటు టెట్ లోనూ అర్హత సాధించిన అభ్యర్థులు అర్హులని నోటిఫికేషన్ లో  పేర్కొన్నారు. వయోపరిమితి 18 నుంచి 44 ఏళ్లు అని, ఆసక్తిగల అభ్యర్థులు రూ.1000 ఫీజు చెల్లించి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. కాగా ఈ నెల 6నే నోటిఫికేషన్ విడుదల చేసినా.. అధికారులు తాజాగా నేడు బయటపెట్టడం గమనార్హం. అయితే నియామక ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని, ఆన్ లైన్ లో పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.