మత విద్వేషం వ్యక్తిత్వ వికాసానికి అవరోధం

మత విద్వేషం వ్యక్తిత్వ వికాసానికి అవరోధం
  • యువత చెడు అలవాట్లకు బానిసలు కావద్దు
  • ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కే శ్రీరామ్

ముద్ర,పానుగల్:-బిజెపి మత విద్వేషానికి భిన్నంగా లౌకిక శక్తులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు యువతకు మత సామరస్యం అవసరాన్ని విడమర్చి చెప్పాలని సిపిఐ అనుబంధ ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కే శ్రీరామ్ అన్నారు. పాన్గల్ మండలం తెల్లరాళ్లపల్లిలో సిపిఐ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తమ స్వార్థ రాజకీయ ప్రయోజనం కోసం బిజెపి గ్రామీణ యువతలో దేశభక్తి, హిందూ మతం, ధర్మం పేరుతో పరమత విద్వేషాన్ని నింపుతోందని, భారతదేశ లౌకిక రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. యువత తాగుడు, జూదం, గంజాయి, మహిళల వేధింపు తదితర చెడు ఆలవాట్లకు బానిసలు కాకుండా తల్లిదండ్రులు వారి కదలికలపై నిఘా ఉంచాలని విజ్ఞప్తి చేశారు. మత విద్వేషం ద్వారా  శాంతి, అభివృద్ధి, వ్యక్తిత్వ వికాసానికి అవరోధం అవుతుందన్నారు.

సేవా భావం ద్వారా యువతను ఆకర్షించాలని  చెడు మార్గాల వల్ల కాదన్నారు.గతంలో గ్రామాల్లో యువజన సంఘాల ద్వారా అభివృద్ధి పనులకు శ్రమదానం , తాగుడు, జూదం, వరకట్నం, మహిళల వేధింపు, అవినీతికి వ్యతిరేకంగా పోరాడే వారని, క్రీడా పోటీలతో స్ఫూర్తిని నింపేవారని, ఇప్పుడా స్ఫూర్తి కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది సమాజానికి ఎంతో నష్టం చేస్తుందన్నారు. సిపిఐ, ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ యువతలో లౌకిక భావాలు, సమాజం పట్ల బాధ్యత, మానవత్వ విలువలను పెంచేందుకు కృషి చేస్తోందన్నారు. డిసెంబర్ 26న సిపిఐ 98వ ఆవిర్భావ దినోత్సవం పార్టీ ఉన్న అన్ని గ్రామాల్లో నిర్వహించాలని కోరారు. జిల్లా కౌన్సిల్ సభ్యులు ఉపసర్పంచ్ కాకం బాలస్వామి, సిపిఐ గ్రామ శాఖ కార్యదర్శి సహదేవుడు, నాయకులు లింగయ్య, పరంధాములు, కాకం నరసింహ, కాకం రాముడు, హరీష్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.