ఇది ఎలెక్షన్​టైమ్ మీకు గుర్తుందా?

ఇది ఎలెక్షన్​టైమ్ మీకు గుర్తుందా?
  • 44 మంది ఎమ్మెల్యే అభ్యర్థులపై కేసీఆర్ ఫైర్!
  • నివేదికలు దగ్గర పెట్టుకుని ఫోన్​లో వివరాల సేకరణ
  • సమాధానం చెప్పలేక నీళ్లు నమిలిన ఎమ్మెల్యేలు
  • టికెట్ రాని నేతలకు హైదరాబాద్​లో ఏంపని?
  • వెంటనే జిల్లాలకు వెళ్లాలంటూ హుకూం
  • ప్రగతి భవన్ నుంచి సమీక్షించిన సీఎం  


ముద్ర, తెలంగాణ బ్యూరో : ఎన్నికల ప్రచారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అభ్యర్థులపై సీఎం కేసీఆర్ సీరియస్​అయ్యారు. అన్ని పార్టీల కంటే ముందుగానే అభ్యర్థుల పేర్లను ప్రకటించినప్పటికీ ప్రచారంలో ఎందుకు దూసుకపోలేకపోతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపో మాపో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నా కొందరు అభ్యర్థుల్లో ఇంకా నిద్రమత్తుపోవడం లేదని మండిపడ్డారు. ఇది ఎన్నికల కాలమన్న సోయి ఉండాలి కదా? అని సుమారు 44 మంది అభ్యర్థులపై కేసీఆర్ కన్నెర్ర జేశారు. జాబితాలో చోటు దక్కిన అభ్యర్థులంతా తమ నియోజకవర్గాల్లో ఉండకుండా హైదరాబాద్​లో ఎందుకుంటున్నారు?  ఇక్కడ మీకేం పని..? అంటూ అభ్యర్థులపై సీఎం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

ఫోన్​లో​మందలింపులు..

కొద్ది రోజులుగా అనారోగ్యంతో ప్రగతి భవన్ కే పరిమితమైన కేసీఆర్.. ప్రస్తుతం ఆరోగ్యం కాస్త కుదుటపడిన నేపథ్యంలో అభ్యర్థులు సాగిస్తున్న  ఎన్నికల ప్రచారంపై నిఘా వర్గాల నుంచి పూర్తి సమాచారాన్ని సేకరించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా కొందరు క్యాండిడేట్లపై తీవ్ర అసంతృప్తి, అసహనం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. గ్రౌండ్ వర్క్​సక్రమంగా లేని అభ్యర్థులకు కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి మందలించినట్లుగా సమాచారం. ఇలా అయితే కదురదని నిర్మొహమాటంగా చెబుతూ.. పరిస్థితి ఇలాగే ఉంటే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించినట్లు తెలుస్తోంది. కాగా ఇందులో హైదరాబాద్ నగరంలోనే ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు. అలాగే ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు చెందిన అభ్యర్థులపై కేసీఆర్ ఫోన్ లో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రధానంగా అభ్యర్థుల జాబితాను ప్రకటించిన తరువాత ఎన్నిసార్లు నియోజకవర్గాల్లో పర్యటించారు, ప్రజల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది, ప్రత్యర్థి పార్టీలపట్ల ప్రజలు ఏమనుకుంటున్నారు? తదితర అంశాలపై కేసీఆర్ ఆరా తీశారని తెలుస్తోంది. ఈ అంశాలపై నివేదిక తెప్పించుకుని అభ్యర్థులు చెబుతున్న సమాచారాన్ని ఆయన సరిపోల్చుకున్నారు. అయితే తనకు వచ్చిన నివేదిక ఒక విధంగా ఉండగా.. అభ్యర్థుల నుంచి వచ్చిన సమాచారం మరో రకంగా ఉండడంతో కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై మీది మాటలు చెబితే సహించనని, వెంటనే అభ్యర్థులంతా తమ నియోజకవర్గాల్లోనే ఉండాలంటూ హుకూం జారీ చేసినట్లు తెలిసింది. 

టికెట్ల కోసం హైదరాబాద్​లో ఉంటున్న నేతలకు క్లాస్..

టికెట్లు రాని అభ్యర్థులు టికెట్ల కోసం హైదరాబాద్ లోనే ఉంటున్నారని కేసీఆర్​తీవ్రంగా మందలించారని సమాచారం. అభ్యర్థుల ఎంపికపై పార్టీ అధిష్ఠానం ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకుందని, దానికి అందరూ కట్టుబడి పనిచేయాల్సిందేనని కేసీఆర్ స్పష్టం చేశారు. ‘మీరు నగరంలో తిరిగింత మాత్రాన్ని మళ్లీ టికెట్లు వచ్చే అవకాశమే లేదు. అభ్యర్థుల ఎంపికపై ఒకసారి నిర్ణయం తీసుకున్న తరువాత మళ్లీ వెనకడుగు వేస్తే.. అది ప్రజల్లో నెగెటివ్ సంకేతాలు తీసుకెళ్లే ప్రమాదం ఉంది. అందువల్ల నగరంలో ఉండి సమయాన్ని వృథా చేయకుండా నియోజకవర్గాలకు పోయి అభ్యర్థుల విజయం కోసం పనిచేయాలి. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత సదరు నేతలందరికీ పదవుల పంపకాల్లో తగు ప్రాధాన్యత కల్పిస్తాం.’ అని ఆశావహ అభ్యర్థులకు కేసీఆర్ ఖరాఖండిగా చెప్పారని సమాచారం. ఈ నేపథ్యంలో టికెట్ల గురించి ఇక ప్రయత్నం చేయడం మానుకోవాలని కేసీఆర్ సూచించారు. వెంటనే హైదరాబాద్ నుంచి వెళ్లిపోయి అభ్యర్థులను గెలుపించుకుని తన వద్దకు రావాలని కేసీఆర్ పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. అలాకాకుండా ఇక్కడే ఉంటే మాత్రం క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించినట్లు తెలిసింది.