గ్రూప్–1 నిర్వహణపై తీర్పు రిజర్వ్

గ్రూప్–1 నిర్వహణపై తీర్పు రిజర్వ్
  • వాద, ప్రతివాదనలు విన్న హైకోర్టు
  • పోలీస్ రిక్రూట్ మెంట్​ఫలితాలపై విచారణ వాయిదా
  • ఉద్యోగ నియామకాలు, ఉపాధ్యాయ బదిలీలపై టెన్షన్​


ముద్ర, తెలంగాణ బ్యూరో : ఉద్యోగ నియామకాలు, ఉపాధ్యాయ బదిలీల వ్యవహారంలో ప్రభుత్వం అనుసరించిన విధానాలు నిరుద్యోగులు, ఉపాధ్యాయుల్లో తీవ్ర అసంతృప్తికి కారణమవుతున్నాయి. ఏళ్ల నుంచి సాగుతోన్న ప్రక్రియను కాదని.. నూతన నిబంధనలతో ఉద్యోగ భర్తీలు, బదిలీలకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. చివరకు హైకోర్టు ముందు దోషిగా నిలబడింది. ఫలితంగా ఇప్పటికే గ్రూప్–‌1 పరీక్ష నిర్వహణలో తీవ్ర ఆరోపణలు మూటగట్టుకున్న ప్రభుత్వం.. వేల మంది నిరుద్యోగుల భవిష్యత్​ను అంధకారంలోకి నెట్టింది. ఏడాది క్రితమే టీఎస్పీఎస్సీ ద్వారా 503 గ్రూప్–‌1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం పరీక్ష నిర్వహణలో విఫలమైంది. పరీక్ష పత్రం లీకేజీ కారణంగా మరోసారి పరీక్ష నిర్వహించినా బయోమెట్రిక్ వివరాలు నమోదు చేయలేదు. దీంతో పరీక్ష రద్దు చేయాలంటూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఇప్పటికే కోర్టులో విచారణ సాగింది. వాద, ప్రతివాదనలు విన్న న్యాయస్థానం గురువారం తీర్పును రిజర్వ్ చేసింది. దీంతో కోర్టు తీర్పు ఎలా వస్తుందోనని నిరుద్యోగులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

పోలీస్ రిక్రూట్ మెంట్ ​విచారణ వాయిదా..

తెలంగాణ పోలీస్ రిక్రూట్ మెంట్​బోర్డ్ ఫలితాలపై గురువారం హైకోర్టులో జరగాల్సిన విచారణ వాయిదా పడింది. ఆగస్టు 17వ వరకు ఎలాంటి ఫలితాలు విడుదల చేయొద్దని పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్‌ను ధర్మాసనం ఆదేశించింది. జీఓ నంబర్ 57, 58పై అభ్యర్థులు హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. జీఓ నంబర్ 57, 58 ప్రకారం మార్కులు తగ్గిస్తున్నట్లు రిక్రూట్ మెంట్ బోర్డ్ ప్రకటించింది. ప్రిలిమ్స్ పరీక్షలు పూర్తయిన తరువాత జీఓ 57, 58ను రిక్రూట్ మెంట్ బోర్డ్ తెరపైకి తెచ్చింది. జీఓ 57, 58 ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు ప్రకారం కటఫ్ మార్కులను బోర్డ్ నిర్ణయించింది. అయితే నోటిఫికేషన్‌లో ఎక్కడ కూడా జీఓ 57, 58ను పేర్కొనలేదని అభ్యర్థులు వాదించారు. రిజర్వేషన్లపై కటాఫ్ మార్కులు ఉన్నాయని బోర్డ్ వెల్లడించలేదని కోర్టుకు తెలిపారు. ప్రిలిమ్స్ రాసిన అభ్యర్థులందరికీ తీవ్ర నష్టం వాటిల్లిందని అభ్యర్థులు పేర్కొన్నారు. పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్‌పై ఇప్పటి వరకు హైకోర్టులో 52 పిటిషన్లు దాఖలయ్యాయి. పిటిషనర్ అభ్యంతరాలపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ.. తదుపరి విచారణను హైకోర్టు ఆగస్టు 17కు వాయిదా వేసింది. పోలీస్​శాఖలో 2‌‌0వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది.

విచారణలో వేగం పెంచండి..

మరోవైపు విద్యాశాఖలో ఊరిస్తున్న 1500 మంది స్పౌజ్ బదిలీలకు సంబంధించిన కేసులో విచారణలో వేగం పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును అభ్యర్థించింది. హైకోర్టులో నమోదైన పిటిషన్లతో ఉద్యోగుల్లో అయోమయ పరిస్థితి నెలకొందని ప్రభుత్వం తన పిటిషన్ లో పేర్కొంది. టీచర్ల బదిలీల కేసుపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో వాదనలు ముగిసి విచారణ పూర్తయింది. గతంలో విధించిన స్టేను ఎత్తివేస్తేనే బదిలీలు సజావుగా సాగుతాయని తెలిపింది. ఈ స్టే ఎత్తివేతకు మధ్యంతర పిటిషన్ కూడా వేశామని అదనపు అడ్వొకేట్ జనరల్ హైకోర్టుకు విన్నవించారు. అయితే స్టే ఎత్తివేయాలన్న పిటిషన్ పై సోమవారం విచారణ చేపడతామని కోర్టు స్పష్టం చేసింది.