కాంగ్రెస్ అభివృద్ధిని సాగర్​కట్టపై చర్చిద్దామా?

కాంగ్రెస్ అభివృద్ధిని సాగర్​కట్టపై చర్చిద్దామా?
  • కేసీఆర్​కు రేవంత్​రెడ్డి సవాల్

ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణకు కాంగ్రెస్ ఏం చేసిందో నాగార్జున సాగర్ కట్టమీద చర్చిద్దామా? అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్​కు సవాల్​ విసిరారు. చరిత్ర తిరగేసి చూస్తే కాంగ్రెస్ ఏం చేసిందో తెలుస్తుందన్నారు. బుధవారం గాంధీభవన్​లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కమ్యూనిస్టులకు సీఎం కేసీఆర్​పంగనామాలు పెట్టారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి విమర్శించారు. మునుగోడులో కమ్యూనిస్టులతో కేసీఆర్​కలిసి పొత్తు పెట్టుకొని రాష్ట్రంలో బీజేపీకి, కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా పోటీ చేస్తామని ప్రకటించారు. కానీ కేసీఆర్​ఢిల్లీ వెళ్లి మోడీ, అమిత్ షాతో చీకట్లో ఒప్పందం చేసుకొని రాష్ట్రంలో కమ్యూనిస్టులకు పంగనామాలు పెట్టారని తెలిపారు. కమ్యూనిస్టులకు సీట్లు ఇవ్వకుండా, ఏకపక్షంగా కేసీఆర్ ఎందుకు సీట్లు ప్రకటించారని ప్రశ్నించారు. బీజేపీతో ఉన్న అనుబంధంతోనే కమ్యూనిస్టులను కేసీఆర్ వదిలేశారని తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటే అని తెలిపారు. మూడు నెలల ఉండగానే వైన్​షాపులకు టెండర్లను పిలిచారని, 60 వేల బెల్టు షాపులు దేశంలో ఏ రాష్ట్రంలో లేవని తెలిపారు. వైన్ షాపుల టెండర్ల పేరుతో రూ.2500 కోట్లు కేసీఆర్ కొల్లగొట్టారని తెలిపారు. అంతకు ముందు మాజీ మంత్రి ఎ. చంద్రశేఖర్ తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ ఇన్​చార్జి మానిక్ రావ్ ఠాక్రే, రేవంత్ రెడ్డి వారిని కాంగ్రెస్​లోకి ఆహ్వానించారు.