నెత్తుటి మడుగులో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి

నెత్తుటి మడుగులో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి
  • నెల రోజుల్లోనే సూర్యాపేట జిల్లాలో దాదాపు 20 మరణాలు, 20 మంది పైగా క్షతగాత్రులు
  • జిల్లా వ్యాప్తంగా జాతీయ రహదారిపై సగానికి పైగా పూర్తికాని సర్వీస్ రోడ్లు
  • ఉలుకు పలుకులేని జిఎంఆర్ రోడ్ కాంట్రాక్టర్లు
  • భయంతో బెంబేలుతున్న ప్రయాణికులు
  • రోడ్డు పక్కన లారీలు భారీ కంటైనర్లు ఆపడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ 
  • ప్రయాణంలో పోలీసుల సలహాలు సూచనలు పాటించని కారణంగానే ప్రమాదాలు అంటున్న ప్రజలు

సూర్యాపేట ముద్ర ప్రతినిధి:-సూర్యాపేట జిల్లా పరిధిలో 15 రోజుల వ్యవధిలోనే జాతీయ రహదారిపై 20 మంది మృత్యువాత పడ్డారు. దాదాపు వందల సంఖ్యలో క్షతగాత్రులు అయ్యారు. చక్కని జీవితాన్ని, భవిష్యత్తును ప్రమాదాల బారినబడి నాశనం చేసుకుంటున్నారు. మద్యం మత్తులో నిర్లక్ష్యంగా రోడ్డుపై వాహనాన్ని నడుపుతూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అంతేకాకుండా ర్యాష్ గా, నిర్లక్ష్యంగా, తొందరగా వెళ్లాలనే ఆలోచనతో ఓవర్టేక్ చేస్తూ రోడ్డు పక్కన ఆగి ఉన్న వాహనాలను వెనకనుంచి బలంగా ఢీకొట్టడంతో ప్రమాదాలకు కారణాలుగా చెప్పుకోవచ్చు.

ఇటీవల కోదాడ సమీపంలో జరిగిన రెండు ప్రమాదాలు ఆగి ఉన్న లారీలను వెనుక నుంచి ఢీ కొట్టిన సంఘటనలే. రోడ్డు పక్కన ఉన్న చెట్లకు ఢీకొని మరికొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. జల్సాలకు అలవాటు పడ్డ యువకులు మితిమీరిన వేగంతో వాహనాలను నడిపి ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. సూర్యాపేట ఖమ్మం క్రాస్ రోడ్డు వద్ద ఫ్లై ఓవర్ పై జరిగిన సంఘటన దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. పోలీసు వారు రోడ్డు రవాణా విషయంలో పలు సలహాలు సూచనలు అందించినప్పటికీ వాటిని వాహనదారులు కచ్చితంగా పాటించకపోవడంతో మరికొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పవచ్చు.

ట్రాఫిక్ రూల్స్ పాటించి వాహనాన్ని నడిపితే ప్రమాదాల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. దీనికి తోడు జాతీయ రహదారిపై ఉన్న గ్రామాల్లో సర్వీస్ రోడ్లు పూర్తి చేయకుండా గుత్తేదారుల నిర్లక్ష్యానికి ఈ ప్రమాదాలు అద్దం పడుతున్నాయి. హైదరాబాద్ నుండి విజయవాడకు నిత్యం వందల సంఖ్యలో కార్లు ఇతర వాహనాలు అధిక వేగంతో వెళ్లడం మనం గమనిస్తూనే ఉంటాం. ప్రధానంగా ఈ మధ్యకాలంలో అధిక స్పీడ్ లో వెళుతూ డ్రైవింగ్ లో అవగాహన లేకుండా కంట్రోల్ తప్పడంతో వారి ప్రాణాలు క్షణంలోనే గాల్లో కలిసిపోతున్నాయి. జాతీయ రహదారిపై వెళ్లే భారీ లోడ్ కంటైనర్లు, లారీలు బ్రేక్ డౌన్, టైర్ పంచర్ లాంటి సమస్యలతో రోడ్డుపైనే వాహనాన్ని నిలిపివేస్తూ ప్రమాదాలకు కారణం అవుతున్నారు. వెంటనే జీ.యం.ఆర్ రోడ్ కాంట్రాక్టర్లు, పోలీస్ ఉన్నత అధికారులు దృష్టి సారించి జాతీయ రహదారిపై వెళ్లి ప్రయాణికులకు భరోసా కల్పించాల్సిందిగా జిల్లా వాసులు కోరుతున్నారు. ఈ విషయంలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా జిఎంఆర్ తదితర సంస్థలతో ఇటీవల సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తదితర అధికారులు రోడ్డు ప్రమాదాల నివారణకు గాను సమావేశం జరిపి పలు జాగ్రత్తలు తీసుకున్న విషయంలో సలహాలు, సూచనలు అందిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అయితే కేవలం పోలీస్ రవాణా శాఖ అధికారులు చెప్పిన విషయాలే కాకుండా ప్రతివారు కూడా సొంతంగా డ్రైవింగ్ చేసే సమయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలను చాలా వరకు తగ్గిస్తూ అరికట్టే ప్రమాదం ఉందని రోడ్డు ప్రమాదాల నివారణ నిపుణులు పేర్కొంటున్నారు. ఏదేమైనా ప్రాణం అనేది చాలా విలువ కలదని, ఒకసారి పోతే తిరిగి రానిదని, తాము ఒకరం చనిపోతే తన కుటుంబం కూడా రోడ్డున పడ్డట్టే అని ప్రతివారు భావించి జాగ్రత్తగా డ్రైవింగ్ చేసి ప్రాణాలను నిలుపుకొని, కుటుంబాలను కాపాడుకొని ప్రమాద రహితంగా వాహనాలను నడిపినప్పుడే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చన్నది మెజార్టీ ప్రజలు అంగీకరిస్తున్న సత్యం.