ప్రేమగా పెంచుదాం..

ప్రేమగా పెంచుదాం..

చిన్నారులను పెంచడం అంటే ఓ చక్కని బాధ్యత. ఇందులో తల్లీదండ్రులు ఎన్నో ముఖ్య విషయాలు పాటించాలి. అప్పుడే చిన్నారులకు మంచి భవిష్యత్‌ని అందించిన వారవుతాం. అందుకు పేరెంట్స్ పాటించాల్సిన కొన్ని కీ పాయింట్స్ ఇవే.
పిల్లల పెంపకం అంటే మాటలు కాదు. వారికి చిన్నప్పుడు ఎలా పెంచుతామో.. ఆ ప్రభావమే వారి జీవితంపై ఉంటుంది. జీవితంలో ఎదుగుదల ఉండాలంటే ముందునుంచే చాలా కొన్ని నియమాలు పాటించాలి. పిల్లలను చిన్న వయసు నుంచే తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుంది. దీన్ని బట్టే పిల్లల ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. కాబట్టి పిల్లల పెంపకంపై కొంతమంది నిపుణులు చెప్పిన సలహాలను చూద్దాం..
–  పిల్లల పెంపకం అంటే ఓ బాధ్యత. అయితే దాన్ని మరీ మిలటరీ ట్రైనింగ్‌లా కాకుండా ఆడుతూ పాడుతూ ఉండేలా జాగ్రత్త పడాలి. మనం వారి రూట్‌లోనే వెళ్తూ మంచి, చెడులను చెప్పాలి.
– పిల్లలను ఆడుతూ పాడుతూ పెంచాలి. అలా అని వారిని మొత్తం వదిలేయమని కాదు.. ఏ సమయాల్లో ఎలా ఉండాలో తెలుసుకోవాలి. చిన్నతనం నుంచి వారికి  ప్రేమ, బాధ్యతలను  తెలియజేయాలి.
– మామూలుగా తల్లిదండ్రులు ఎలా ఉంటే.. పిల్లల ప్రవర్తన కూడా అలానే ఉంటుంది.  పిల్లల పట్ల స్నేహపూర్వక వాతావరణం కలిగించేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
– పిల్లలు పెరిగే కొద్దీ కొంత స్వేచ్ఛ కోరుకుంటారు. స్వేచ్ఛనివ్వాలి. కానీ ఓ కంట కనిపెట్టుకుని ఉండాలి. కొంతమంది మరీ స్వేచ్ఛనిస్తారు. ప్రేమ ఉండాలి కానీ, ఆ ప్రేమ వారిని పాడుజేసేలా ఉండకూడదు. ఈ విషయాన్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఆ విధంగానే పెంపకం ఉండాలి.
–  కొన్ని అనవసరమైన విషయాలు పిల్లల ముందు చర్చించకపోవడమే మంచిది. అలాంటి విషయాలు వారి మనసును ప్రభావం చేస్తాయి.
–  ఆడ, మగ ఇద్దరూ సమానమే అని తెలుసుకునే విధంగా పిల్లల్ని పెంచాలి. ఇదే వారు భవిష్యత్‌లోనూ అమలు చేస్తారు.
– పిల్లలు యుక్తవయసుకి చేరాక వాళ్లకి ఏవైనా చెప్పడం కాస్త కష్టంతో కూడుకున్న పనే..  దీని గురించి తల్లిదండ్రులు ముందునుంచే కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి.  వారితో స్నేహంగా ఉండడం,  మనతో అన్ని విషయాలు షేర్ చేసుకునేలా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. యుక్త వయస్సులో పిల్లలు స్వేచ్ఛని కోరుకుంటారు. వారి కాళ్లపై వారు నిలబడాలనుకుంటారు. అలాంటి సమయంలో తల్లులు కీ రోల్ పోషించాలి. కాస్త చేయూతనిస్తే వారి ఎదుగుదలకు సహకరించినట్లవుతుంది.
– పిల్లల విషయంలో మనకే అన్నీ తెలుసనేలా కాకుండా..  పిల్లలవైపు నుంచి ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. వారికి తాము అన్ని విషయాల్లో తోడు ఉన్నామనే విషయాన్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉండాలి. 
– పెంపకం విషయంలో  పిల్లల వయసు, అవసరాలను దృష్టిలో ఉంచుకోవడం చాలా ముఖ్యం. వాటికి తగ్గట్లుగానే అన్ని నిర్ణయాలు తీసుకోవాలి. ఇలా ఆలోచించకపోవడం వల్ల కొన్ని సమస్యలు మొదలవుతాయి. వాటిని పెద్దలు సరిగా అర్థం చేసుకోకపోవటం వల్లనే అసలు సమస్యలు మొదలవుతాయి. తల్లిదండ్రులు పిల్లలను ఎప్పటికీ చిన్నవారిలాగానే చూస్తారు. వారిలో వయస్సుతో వచ్చిన మార్పులను అర్థం చేసుకోక వారి ప్రవర్తన చాలా మారిపోయిందనుకుంటారు. కాబట్టి తల్లిదండ్రులకు పిల్లల పెరుగుదలపై సరైన అవగాహన ఉండాలి. 
– ఎదిగే పిల్లలకు కొన్ని అవసరాలు ఉంటాయి. అవేంటో తెలుసుకుని ముందుగానే సమకూర్చాలి. మనమూ ఆ వయసు నుంచే వచ్చామన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది తల్లిదండ్రులు ‘చిన్న వయసులో మేము ఏం లేకుండానే పెరిగాం.. పిల్లలు కూడా అలానే ఉండాలి అని ఆలోచిస్తారు..’ కానీ అప్పటి అవసరాలు వేరు,  ఇప్పటి అవసరాలు వేరు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. 
– పిల్లల్ని గారాబం చేయాలి. అంతేకానీ వారిని సోమరిపోతులుగా మార్చకూడదు.  చిన్నతనం నుంచే వారి పనులు వారే స్వతహాగా చేసుకునేలా అలవాటు చేయాలి.
– ప్రతీ చిన్నారిలోనూ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. దాన్ని గమనించి ప్రోత్సహించాలి. ఒక వేళ అలాంటివేం పిల్లల్లో మనం గుర్తించకపోతే.. వారికి ఏం ఇష్టమో తెలుసుకుని ఆ రంగంలో రాణించేలా ప్రోత్సహించాలి. ఇదే వారి భవిష్యత్‌కి పునాది అవుతుంది.
– సాధారణంగా మన స్నేహితులను బట్టి మనం ఎలాంటివారో చెప్పేయొచ్చు. అలానే చిన్నారుల విషయంలోనూ జరుగుతుంది కాబట్టి వారు ఎలాంటివారితో స్నేహం చేస్తున్నారో గమనించాలి. అలాగని అందరినీ అనుమానించకుండా, వారి స్నేహాలను అర్థం చేసుకోవాలి, గౌరవించాలి.
–  పిల్లలకి చక్కని విద్య అందించే విషయంలో ఉపాధ్యాయులకు ఎంత బాధ్యత ఉందో.. తల్లిదండ్రులకూ అంతే బాధ్యత ఉంటుంది. పిల్లల చదువుకు తగిన వాతావరణాన్ని కల్పించాలి. 
–  పిల్లలు కొన్ని సబ్జెక్ట్స్‌ని చదివేందుకు కష్టపడతారు. ఆ విషయాల్లోతల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని శిక్షణ ఇవ్వాలి.  
– కేవలం చదువులోనే కాకుండా లోకజ్ఞానాన్ని అందించే పుస్తకాలను కూడా పిల్లలకు చిన్నతనం నుంచే అలవాటు చేయాలి. వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లి వాటి గొప్పతనం తెలియజేసి వాటి చరిత్రను చెప్పాలి.
– పిల్లలకు స్వేచ్ఛ, క్రమశిక్షణ సమపాళ్ళలో ఉండాలి. వారికి చదువు ఎంత అవసరమో, ఆటపాటలు కూడా అంతే అవసరం.. ఇది వారి శారీరక, మానసిక వృద్ధికి దోహదం చేస్తాయి.
– పిల్లలను విమర్శించడం కంటే వారు ఏ తప్పులు చేస్తున్నారో ప్రేమగా చెప్పి చూడాలి. వారిని మార్చే ప్రయత్నం ప్రేమతోనే మొదలవ్వాలి. ఆత్మవిశ్వాసం, సహనం, అభినందనలతో కూడిన పెంపకం ఎప్పుడూ కూడా.. ఎదుటివారిని గౌరవిస్తూ, నీతిగా బతకడం నేర్పుతుంది.