గ్రూప్ -4 పరీక్షల నిబంధనలు పాటించాలి..

గ్రూప్ -4 పరీక్షల నిబంధనలు పాటించాలి..

పరీక్షా కేంద్రానికి సకాలంలో హాజరు కావాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా..

ముద్రప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: జులై 1న నిర్వహించే గ్రూప్ -4 పరీక్షల నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా కోరారు. మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ దివాకర తో కలిసి గ్రూప్ -4 పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ టి.ఎస్.పి.ఎస్.సి. నిర్వహించే గ్రూప్-4 పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసి అభ్యర్థులు సజావుగా పరీక్షలు వ్రాసే విధంగా చూడాలని అన్నారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12-30 వరకు మొదటి పేపర్, మధ్యాహ్నం 2-30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు రెండవ పేపర్ పరీక్ష ఉంటుందని, జిల్లాలో 29 సెంటర్లలో మొత్తం 7,482 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారని తెలిపారు. టి.ఎస్.పి.ఎస్.సి. పరీక్షల నిబంధనలు పాటించాలని, లైజనింగ్ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్ లు పరీక్షా కేంద్రాలను ముందస్తుగా సందర్శించి త్రాగునీరు, విద్యుత్, సీటింగ్, సి.సి. కెమెరాల ఏర్పాటును, ఇతర మౌళిక వసతులను సరి చూసుకోవాలని చెప్పారు. పరీక్ష రోజు పరీక్షా కేంద్రం పరిసర ప్రాంతాల్లో జిరాక్స్ సెంటర్ లను మూసివేయాలని, 144 సెక్షన్ అమలు చేయాలని తెలిపారు.

ప్రతీ పరీక్షా కేంద్రంలో ఒక ఆశ, ఒక ఏ.ఎన్.ఎం. లను ఉంచాలని, పోలీస్ బందోబస్తు పకడ్బందీగా ఏర్పాటు చేయాలని, పరీక్షా కేంద్రంలోకి అభ్యర్థులు వెళ్ళే ముందు క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి పంపాలని, ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని, ఆభరణాలు ధరించి రావద్దని, పరీక్ష రోజు చెప్పులు ధరించాలని తెలిపారు. పరీక్షా కేంద్రాలలో ప్రతి 24 మంది అభ్యర్థులకు ఒక ఇన్విజిలేటర్, 48 మందికి ఇద్దరు ఇన్విజిలేటర్ల ను నియమించాలని, అదనంగా 10శాతం సిబ్బందిని సిద్ధంగా ఉంచుకోవాలని, పరీక్షా కేంద్రాల్లో పనిచేసే ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా ఐడెంటిటీ కార్డు ఉండాలని తెలిపారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్ తో పాటు తప్పనిసరిగా ప్రభుత్వ గుర్తింపు కార్డు ఒరిజినల్ తీసుకొని రావాలని తెలిపారు.

పరీక్షకు 15 నిమిషాల ముందుగా పరీక్ష కేంద్రం గేట్ మూసివేయాలని, పరీక్షా కేంద్రం గేటు మూసినా తర్వాత ఎవరిని లోపలికి అనుమతించబడదని పేర్కొన్నారు. ప్రశ్నాపత్రాల కవర్ ను ఉదయం 9:30 గంటలకు, మధ్యాహ్నం 2 గంటలకు చీఫ్ సూపరింటెండెంట్ సమక్షంలో ఓపెన్ చేయాలని, పరీక్ష ప్రారంభానికి ముందే ఇన్విజిలేటర్లు ప్రతి అభ్యర్థి తమకు కేటాయించిన సీటులో కూర్చున్నారో లేదో చెక్ చేసుకోవాలని, ప్రతి అభ్యర్థికి ప్రశ్నాపత్రం అందజేయాలని తెలిపారు. పరీక్షకు హాజయ్యే అభ్యర్థుల హాల్ టికెట్లో ఫోటో ముద్రన కాకపోయినచో, ముద్రణ సరిగా లేకపోయినా అభ్యర్థులు గెజిటెడ్ అధికారి అటెస్టెడ్ చేయించి అదనంగా 3 పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు, ఒరిజినల్ వ్యాలిడిటి ఫోటో ఐడి కార్డు, హాల్ టికెట్ లు చూపించి పరీక్షా కేంద్రంకు వెళ్లాలని కలెక్టర్ చెప్పారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ శ్రీనివాసులు, చీఫ్ సూపరింటెండెంట్ లు, లైజనింగ్ అధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీఓ లు, ఎం.పి.ఓలు, కలెక్టరేట్ ఏ.ఓ., సిబ్బంది పాల్గొన్నారు.