ధైర్యమే పెట్టుబడి

ధైర్యమే పెట్టుబడి
Rural women's mann desi bank

అదో మారుమూల గ్రామం.. అక్కడి మహిళలకు బడికెళ్లే అవకాశం రాలేదు.. చదువు తెలీదు.. డిగ్రీలు లేవు.. లోకజ్ఞానం అసలే లేదు.. ఆఖరికి ప్రయాణాల సంగతి కూడా వారికి తెలియదు. అలాంటి మారుమూల గ్రామంలో ఒక మహిళ తనకోసం, తను కష్టపడి సంపాదించిన సొమ్మును దాచుకోవడం కోసం చేసిన ప్రయత్నం ఆ ఊరిని మార్చేసింది. తమకోసం ప్రత్యేకంగా ఒక బ్యాంకు ఏర్పాటు చేసుకునేలా చేసింది. ప్రపంచంలో మొదటిసారిగా చిన్నమొత్తాల రుణాలకై ఏర్పాటు చేసిన మహిళల బ్యాంక్ ఇది. ఇందులో కేవలం మహిళలే పనిచేస్తారు. ఇంతింతై.. వటుడింతై.. అన్నట్లుగా ఇప్పుడా బ్యాంకు కోట్ల టర్నోవర్​కు చేరుకుంది. త్వరలో స్టాక్​ ఎక్చేంజ్​పై  దృష్టి పెట్టాలన్న ఆలోచనలో ఉన్నారు ఆ గ్రామీణ మహిళలు. వివరాల్లోకి వెళితే.. అనాదిగా మహిళలను ఆర్థిక శాస్త్రం పరిధిలోకి తీసుకురావడం అనేది చాలా తక్కువ. పట్టణాల్లోనే ఆర్థికరంగంలో స్త్రీ, పురుష నిష్పత్తి సమానంగా ఉండదు. ఇక గ్రామాల పరిస్థతి చెప్పనక్కరలేదు.

నేటి పరిస్థితే ఇలా ఉంటే.. ఇక పాతికేళ్ల క్రితం అంటే.. సమస్యే లేదు.. ఆ కాలంలో ఆడవారు చదువుకోవడమే చాలా గొప్ప విషయం. అది కూడా పట్టణాల్లోనే సాధ్యం. గ్రామాల్లో బడులు, చదువులు ఉండేవి కావు. అలాంటి కోవకు చెందినదే మహారాష్ట్రలోని ఓ కుగ్రామం. ఆ గ్రామంలో మహిళలు చదువుకునేది లేదు. ఇల్లు, పిల్లలు, భర్త పనిలో చేదోడు, వాదోడుగా ఉండటం.. ఇవే వారికి తెలిసింది.  అలాంటి చోట కాంతాబాయి అనే మహిళ.. తన దగ్గర ఉన్న డబ్బును పొదుపు చేయాలనుకుంది. అందుకు చదువుకున్న, సమాజ సేవకురాలైన చేతనాసిన్హా సాయం తీసుకుంది. మొదటి ప్రయత్నం విఫలమైంది. దీంతో డబ్బు దాచుకునేందుకు వీరే ఒక బ్యాంకును ఏర్పాటు చేసుకోవాలనుకున్నారు. అదే ‘మణ్​ దేశీ సహకార బ్యాంక్​’. ఇది కేవలం మహిళల కోసమే స్థాపించిన బ్యాంక్​. ఇందులో మహిళలే పనిచేస్తారు. ఇది స్థాపించి పాతికేళ్లు గడిచాయి. ఇప్పటికీ అక్కడి మహిళలు టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ  అప్​డేట్​ అవుతున్నారు. ఇక్కడి మహిళలకు వారి ధైర్యమే మూలధనం. 

చేతనాసిన్హా ముంబయిలో పుట్టి, పెరిగిన మహిళ. ఆమె కాలేజీలో చదువుతున్నప్పుడు జయప్రకాశ్​ నారాయణ్​గారిని కలిసింది. ఆయన ప్రముఖ గాంధేయవాది.  యువతని ఎప్పుడూ గ్రామీణ భారతంలో పనిచేయాలని ప్రోత్సహించేవాడు. ఆయన మాట ప్రకారం ఊళ్లలో పనిచేయడానికి వెళుతుండేది చేతనాసిన్హా. అలా భూమి హక్కుల ఉద్యమాల్లో, రైతు పోరాటాల్లో, స్త్రీల ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనేది చేతన. అలా ఆమె ఓ మారుమూల ప్రాంతానికి చేరుకుంది. అక్కడ ఆమె చలాకీగా, అందంగా ఉన్న ఓ రైతు నాయకునితో ప్రేమలో పడింది. అతను పెద్దగా చదువుకోలేదు కానీ, జనాలను తనవైపు తిప్పుకోగల నేర్పు కలవాడనుకుని అతని పెళ్లి చేసుకుంది చేతనాసిన్హా. ముంబయిని వదిలేసింది. తాగునీటి సౌకర్యం, టాయిలెట్లు కూడా సరిగా లేని ఆ గ్రామానికి వెళ్లింది చేతనాసిన్హా. మొదట ఆ ఊరిని చూసి ఆమె కుటుంబం, స్నేహితులు ఇలాంటి చోట నువ్వు ఉండగలవా? అని  భయపడ్డారు.. ఇప్పుడు ఆమె అక్కడే ఉంటోంది తన ముగ్గురు పిల్లలతో సహా.. కొద్దిరోజుల తర్వాత ఆమె దగ్గరికి కాంతాబాయి అనే మహిళ వచ్చి ‘నేను బ్యాంకులో ఖాతా తెరవాలనుకుంటున్నాను. డబ్బులు పొదుపుచేయాలనుకుంటున్నాను’ అని చెప్పింది. అప్పుడు చేతనాసిన్హా ‘నువ్వు పనిముట్లను తయారుచేసి అమ్ముతుంటావు. నీ దగ్గర బ్యాంకులో పొదుపుచేసేంత డబ్బు నీ దగ్గర ఉందా? ’ అని అడిగింది. అందుకు కాంతాబాయి ‘నేను డబ్బులు దాచుకోవాలమ్మా.. రాబోయేది వర్షాకాలం.. ఒక ప్లాస్టిక్​ షీట్​ కొనాలి. వర్షాల నుంచి మా కుటుంబాన్ని కాపాడుకోవాలి.. అందుకే డబ్బులు దాచుకోవాలనుకుంటున్నాను. మేము రోడ్డు పక్కన గుడిసె వేసుకుని ఉంటాం కదా.. అక్కడ డబ్బులు దాచుకుంటే ఇబ్బంది.. అందుకే బ్యాంకులో దాచుకోవాలనుకుంటున్నాను’ అని చెప్పింది. 

అది విన్న చేతనాసిన్హా ఏమాత్రం ఆలోచించకుండా కాంతాబాయిని తీసుకుని బ్యాంకుకు వెళ్లింది. కాంతాబాయి రోజుకు పదిరూపాయలు దాచుకోవాలనుకుంది. అంత తక్కువ డబ్బు దాచడం కోసం ఖాతా తెరవడం కుదరదని తెగేసి చెప్పాడు బ్యాంకు మేనేజర్. కాంతాబాయి బ్యాంకు నుండి లోను అడగడం లేదు, ప్రభుత్వం నుండి సబ్సిడీగానీ, గ్రాంట్​ కానీ అడగడం లేదు.. ఆమె అడిగేది కేవలం తన కష్టార్జితాన్ని దాచుకోవడానికి ఒక ఖాతా తెరవాలని.. దానికి కూడా ఆ బ్యాంకు మేనేజర్​ ఒప్పుకోకపోగా, నా సమయాన్ని వృథా చేస్తున్నారు అని విసుక్కున్నాడు. ఈ విషయం విన్న చేతనాసిన్హా.. ‘తన కష్టార్జితాన్ని దాచుకునే హక్కు ఆమెకు ఉంది. మీరు కాంతాబాయిని అకౌంట్​ తెరవనివ్వకుంటే.. మేమే ఒక బ్యాంకును మొదలుపెడతాము’ అని చెప్పి కాంతాబాయి వంటి వారికి డబ్బు దాచుకునేందుకు బ్యాంకు లైసెన్స్​ కోసం భారతీయ రిజర్వు బ్యాంకుకు దరఖాస్తు చేసింది చేతనాసిన్హా. కానీ అదంత సులువైన పని కాదు కదా.. రిజర్వ్​బ్యాంక్​ వీరి దరఖాస్తును తిరస్కరించింది. కారణం వీరికెవరికీ చదువు రాదని. ఈ విషయం విన్న చేతన సిన్హాకు ఏడుపు ఆగలేదు. ఏడుస్తూనే విషయాన్ని కాంతాబాయి, మరికొంతమంది మహిళలకు చెప్పింది చేతన. ఇది విన్న మహిళలు ‘ఓస్​ అంతేనా.. దీనికెందుకు మీరు ఏడుస్తున్నారు? మాకు చదువు రాదన్నారు కదా.. మేం చదువుకుంటాం. తరువాతే బ్యాంకును స్థాపించుకుందాం..’ అన్నారు. వారి దృఢసంకల్పం చూసి చేతనాసిన్హా ఆశ్చర్యపోయింది. అనుకున్నదే తడవుగా ఆరోజే చదువుకోవడం మొదలుపెట్టారు ఆ మహిళలు. రోజంతా కష్టపడి పనిచేసిన తరువాత తరగతులకు హాజరయ్యేవారు. చదవడం, రాయడం నేర్చుకున్నారు. అలా ఐదు నెలల తరువాత బ్యాంకు కోసం దరఖాస్తు చేసుకున్నారు ఆ మహిళలు. ఈసారి అక్కడికి చేతన ఒక్కరే వెళ్లలేదు. ఆమెతో బాటు మరో పదిహేను మంది వెళ్లారు. అక్కడి బ్యాంకు ఆఫీసర్​తో మాట్లాడుతూ ‘మాకు చదవడం, రాయడం రాదని మీరు లైసెన్స్​ను నిరాకరించారు. మా బాల్యంలో బడులు లేవు. చదవకపోవడం మా తప్పు కాదు. మీ అంతగా మాకు చదవడం, రాయడం రాదు. కానీ మేము మీకంటే బాగా లెక్కించగలం.. ఎంత పెద్ద మొత్తానికైనా మేం వడ్డీని లెక్కపెట్టగలం. కాలిక్యులేటర్​ వాడకుండా మీ ఆఫీసర్లు మాతో పాటు వడ్డీని లెక్కించగలరా’ అంటూ సవాలు విసిరారు. అంతే ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు. వారికి బ్యాంకు లైసెన్స్​ వచ్చింది. అలా ఆ కుగ్రామంలో మణ్​దేశీ సహకార బ్యాంకు మొదలైంది. దానికి ఫౌండర్​ చేతనాసిన్హా. 

నేడు లక్ష కంటే ఎక్కువమంది స్ర్తీలు ఈ బ్యాంకును ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు బ్యాంకులో 20 కోట్లకు పైగా మూలధనం ఉంది. ఇదంతా గ్రామీణ స్త్రీలు చేసిన పొదుపే.. వారి పెట్టుబడే.. బయటి నుంచి మదుపరులెవరూ ఇక్కడ లేరు. వీరికి లైసెన్స్​ వచ్చాక, బ్యాంకు స్థాపించాక.. ఇప్పుడు కాంతాబాయికి సొంత ఇల్లు ఉంది. ఆ ఇంట్లో తన వారితో కలిసి ఉంటోంది. ఇక్కడ మహిళలకు మాత్రమే లోన్లు ఇస్తారు. బ్యాంకు కార్యకలాపాలు మొదలు పెట్టిన తరువాత ఆడవాళ్లు బ్యాంకుకు రాకపోవడాన్ని గమనించింది చేతన. బ్యాంక్​కి వస్తే వారికి ఒకరోజు పని పోయేది. స్త్రీలు బ్యాంకుకు రాకుంటే.. బ్యాంకే స్త్రీల దగ్గరకు వెళుతుంది.. అని బ్యాంకునే ఇంటి వద్దకు వచ్చేలా చేసింది చేతన. ఇటీవలే వీరు డిజిటల్​ బ్యాంకును కూడా మొదలుపెట్టారు. డిజిటల్​ బ్యాంక్​ అంటే మళ్లీ పిన్​ నంబర్​ గుర్తు పెట్టుకోవాలి. మాకు పిన్​ నంబర్​ వద్దు.. అది మంచి పద్ధతి కాదన్నారు అక్కడి మహిళలు. వాళ్లకు వివరించడానికి ప్రయత్నించారు చేతన. పిన్​ నెంబర్​ను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి, అందుకు మేం సహాయం చేస్తాం అని చెప్పింది చేతన. అందుకు అక్కడి మహిళలు ఒప్పుకోలేదు. దీనికి మరో మార్గం మేం చెబుతాం అంటూ ‘ఇంతకు ముందు అంతా వేలిముద్రలే వేసాం కదా.. ఇప్పుడు కూడా వేలిముద్రలతోనే డబ్బు వేయడం, తీయడం చేస్తాం.. పిన్​ నెంబరును ఎవరైనా వాడొచ్చు. డబ్బుని దొంగిలించవచ్చు. మా బొటనవేలినైతే ఎవరూ వాడలేరు కదా’ అన్నారు అక్కడి మహిళలు. ఈ ఆలోచన చేతనకు బాగా నచ్చింది. డిజిటల్​ బ్యాంకింగ్​ను బయోమెట్రిక్​తో అనుసంధానం చేశారు. ఇప్పుడు స్త్రీలు బొటనవేలిని వాడటం ద్వారా ఆర్థిక కార్యకలాపాలకు డిజిటల్​ పద్ధతిని వాడుతున్నారు. అప్పుడు చేతనకు ఒక విషయం అర్థమమైంది. కష్టపడేవారికెప్పుడూ చిన్న చిన్న పరిష్కారాలను సూచించకూడదు.. వారు చాలా తెలివైనవారని. ఆమె వారి దగ్గరి నుంచి ఎంతో నేర్చుకుంది. అదే విషయాన్ని చాలా వేదికలపై చెప్పారు చేతనా సిన్హా. ఇప్పుడు అక్కడి స్త్రీలు స్మార్ట్​ ఫోన్స్​ ద్వారా కూడా బ్యాంక్​ సేవలు పొందుతున్నారు. పాతికేళ్ల క్రిత ఒక మహిళ ఆలోచనతో మొదలైన ఈ మణ్​ దేశీ సహకార బ్యాంకులో లక్షకు పైగా ఖాతాదారులున్నారు. గ్రామీణ మహిళలు, చదువురాని వారు అని గేలి చేసిన వారే ఇప్పుడు ఆ మహిళలకు వందనం చేస్తున్నారు. చేతనాసిన్హా దేశ, విదేశాల్లో ఈ మహిళల గురించి మాట్లాడుతోంది. ఈమెకు నారీ శక్తి  అవార్డు వచ్చింది.

వారే నాకు స్ఫూర్తి

సునీత, కేరాబాయి వంటి స్త్రీలు లక్షలాదిగా మన చుట్టూ ఉన్నారు. ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదు అంటారు చేతనా సిన్హా.. కాంతాబాయి, కేరాబాయి, సునీత వంటి వారితో పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నా.. వారి జ్ఞానాన్ని నాతో పంచుకుని నన్ను ముందుకు నడిపించారు. ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఒక బ్యాంకును మొదలుపెట్టాలని రిజర్వ్​ బ్యాంకుకు వెళ్లాము. అప్పుడు వారిలో ఒక మహిళ నాతో ‘నా ధైర్యమే నా మూలధనం’ అని చెప్పింది. వారు నన్నీ రోజు నేషనల్​ స్టాక్​ ఎక్చ్సేంజ్​ వైపు దృష్టి పెట్టమని పోరుతున్నారు. ప్రపంచంలో మొదటిసారిగా చిన్నమొత్తాల రుణాలకై ఏర్పాటు చేసిన మహిళల బ్యాంక్​ నా ఆధ్వర్యంలో ఏర్పాటు అయినందుకు నేను గర్విస్తున్నా. ‘వారి ధైర్యమే నా మూలధనం’ అని నేను చెబుతున్నాను. 

ఆకలివేసినప్పుడు పాడేదాన్ని...


కొన్ని నెలల తరువాత బ్యాంక్​కి మరో స్త్రీ వచ్చింది. ఆమె పేరు కేరాబాయి. ఆమె బంగారాన్ని కుదువబెట్టి లోన్​ తీసుకోవచ్చా? అని చేతనసిన్హాని అడిగింది.  ఇప్పుడు నీకు లోన్​ ఎందుకు? అని అడిగింది చేతనాసిన్హా.  ఇప్పుడు మన గ్రామం తీవ్రమైన కరువు పరిస్థితుల్లో ఉంది. పశువులకు తిండి, పశుగ్రాసం దొరకడం లేదు. అవి తాగడానికి నీళ్లు కూడా లేవు. నా పశువులకు దాణా, పశుగ్రాసం కొనడానికి బంగారాన్ని తాకట్టు పెడుతున్నాను అని చెప్పింది. చేతన మాట్లాడలేకపోయింది.  లోన్​ తీసుకుంటూ కేరాబాయి చేతనతో ‘నువ్వు ఈ ఊళ్లో పనిచేస్తున్నావు. ఇక్కడి మహిళలతో, వారి డబ్బుతో బ్యాంకును నడిపిస్తున్నావు. ఏదో ఒకరోజు నీళ్లు లేని కాలం వస్తే.. ఎవరితో ఈ బ్యాంకును నడిపిస్తావు? అప్పుడు ఊరిని వదిలేసి వెళతావా? అని అడిగింది. కేరాబాయి అడిగిన ప్రశ్న చేతనను ఆలోచింపజేసింది. ఈ కరువులో ఏదో ఒకటి చేయాలని సంకల్పించింది చేతన. పశువుల క్యాంప్​ను ఏర్పాటు చేసింది. ఆ ఊరి రైతులందరూ పశువులను ఒకచోటికి తెస్తే.. అక్కడ వాటికి నీరు, పశుగ్రాసాన్ని ఏర్పాటుచేశారు. వర్షాలు లేని కాలంలో ఇలా పశువుల క్యాంప్ ను పెట్టి 18 నెలలు కొనసాగించారు. కేరాబాయి తన పశువులను అక్కడే ఉంచి, పాటలు పాడుతూ తిరుగుతూ ఉండేది.

ఇలా కేరాబాయి పేరు చుట్టుపక్కలకు పాకింది. వర్షాలు పడగానే పశువుల క్యాంపు ముగిసింది. కానీ కేరాబాయికి రేడియోలో అవకాశం వచ్చింది. అలా కేరాబాయి రేడియోజాకీగా మారింది. ఇప్పుడు వారి కమ్యూనిటీ రేడియో ఉంది. దానికి లక్షకు పైగా శ్రోతలు ఉన్నారు. కేరాబాయి రెగ్యులర్​గా రేడియో షో చేయాలంటే ఆమె స్ర్కిప్ట్​ ఎలా రాస్తుంది? ఆమె చదవడం, రాయడం రాదు కదా  అనుకుని, కేరాబాయిని అదే ప్రశ్న వేశాడు. అందుకు కేరాబాయి నవ్వుతూ ‘నేను చదవలేను, రాయలేను.. కానీ పాడగలను కదా.. అదేమైనా పెద్ద సమస్కా’ అని కొట్టిపడేసింది. నేడు కేరాబాయి రోజూ రేడియో ప్రోగ్రాం చేస్తోంది. ఆమె ఇప్పుడు పేరు మోసిన రేడియోజాకీ.. చాలామంది రేడియో స్టేషన్లకి ఆమె గెస్టుగా వెళ్లింది. ముంబయి రేడియో స్టేషన్లో కూడా ఆమె షో చేసింది. ఇప్పుడు ఆ చుట్టుపక్కన ఆమె సెలబ్రటీగా మారిపోయింది. ఒకరోజు చేతన ‘నువ్వు పాటలు పాడటం ఎలా మొదలుపెట్టావు?’ అని కేరాబాయిని అడిగింది. అందుకు కేరాబాయి నవ్వుతూ ‘నీకు నిజం చెబుతా.. నేను మొదటిసారి గర్భవతిగా ఉన్నప్పుడు.. నాకు బాగా ఆకలి వేసేది.. ఇంట్లో నా కడుపు నిండేంత ఆహారం ఉండేది కాదు. కొనడానికి డబ్బులు కూడా ఉండేవి కావు.. ఆకలిని మర్చిపోవడానికే పాటలు పాడటం మొదలుపెట్టాను’ అంది. ఎంత గొప్ప విషయమో కదా.. మహిళలు ఎన్నో ఆటంకాలను, సమస్యలను చిరునవ్వుతో దాటవేస్తూ వెళుతుంటారు. వీటిని దాటడానికి సాంఘిక, సాంస్కృతిక, ఆర్థికంగా.. ఏదో ఒక దారిని వెతుక్కుంటారు.

కష్టంతో వివక్షను గెలిచింది... 


సునితాకాంబ్లి పశువుల డాక్టర్​. ఈమె బిజినెస్​ స్కూల్లో కోర్సు కూడా చేసింది. ఆమె దళిత మహిళ. గ్రామాల్లో ఇలాంటి మహిళలను ముట్టుకోరు కూడా. ఈమె మేకల్లో కృత్రిమ గర్భధారణ నిపుణురాలు. ఇటువంటివి ఎక్కువగా పురుషులే చేసేవారు. ఒక మహిళ.. అదీ దళిత వర్గానికి చెందినది కావడంతో సునీత చాలా కష్టపడేది. కానీ కొద్దిరోజులకే సునీత మేకల డాక్టరుగా మంచి పేరు తెచ్చుకుంది. సునీతకు జాతీయ పురస్కారం కూడా వచ్చింది. ఆ సందర్భంలో చేతన ఆమె దగ్గరికి వెళ్లింది. గ్రామంలోకి అడుగుపెట్టగానే అక్కడ సునీతది పెద్ద కటౌట్​ కనిపించింది. అందులో ఆమె నవ్వుతూ కనిపించింది. అది చూడగానే చేతనాసిన్హా ఆశ్చర్యపోయింది. ఊరి నుంచి వచ్చిన హరిజన స్త్రీకి పెద్ద కటౌట్​ గ్రామం మొదట్లో పెట్టడం చాలా అరుదు. సునీత ఇంటికి వెళ్లాక చేతన మరింత ఆశ్చర్యపోవాల్సివచ్చింది. ఎందుకంటే ఆమె ఇంట్లో అగ్రవర్ణ నాయకులు కూర్చుని టీ తాగుతున్నారు. గ్రామాల్లో అగ్రవర్ణాలవారు హరిజనుల ఇంటి ఛాయలకు కూడా వెళ్లరు. అలాంటిది అగ్రవర్ణాలకు చెందిన నాయకులు ఆమె ఇంటికి వెళ్లి, తమ ఊరికి వచ్చి సభలో ప్రసగించమని వేడుకుంటున్నారు. ఇలా సునీత తన కష్టంతో శతాబ్దాల జాతి వివక్షను తోసిపుచ్చింది.