క్రిప్టో కరెన్సీ,బిట్ కాయిన్ పేర్లతో పెట్టుబడి పెట్టిస్తూ మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు

క్రిప్టో కరెన్సీ,బిట్ కాయిన్ పేర్లతో పెట్టుబడి పెట్టిస్తూ మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు
  • నిందితుల్లో ప్రభుత్వోద్యోగులు
  • ఎస్పీ జానకీ షర్మిల
             

ముద్ర ప్రతినిధి , నిర్మల్ :పెట్టుబడి పెడితే డబ్బులు రెట్టింపు అవుతాయని, కొత్త సభ్యులను చేర్పిస్తే వర్కింగ్ బోనస్ లభిస్తుందని నమ్మిస్తూ  అమాయకులను క్రిప్టో కరెన్సీ లో పెట్టుబడి పెట్టించి మోసగిస్తున్న ఐదుగురిని అరెస్టు చేసినట్లు ఎస్పీ జానకి షర్మిల వెల్లడించారు. వీరిలో ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ఎక్సైజ్ అధికారి, ఎ ఆర్ కానిస్టేబుల్ ఉన్నట్లు వివరించారు.  కడెం మండలం నవాబుపేట్ కు చెందిన సల్ల రాజ్ కుమార్, సహా మరో నలుగురు వ్యక్తులు అమాయకులైన వారిని క్రిప్టొ కరెన్సీ లో ఆన్లైన్ పెట్టుబడులు పెట్టించి మోసగించారని ఫిర్యాదు అందటంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారన్నారు.  జిల్లా లో కడెం నుండి ప్రారంభించిన ఈ వ్యవహారంతో అన్ని జిల్లాల, ప్రాంతాల ప్రజలను మోసాలు చేయడమే వీరి పని అని తెలిపారు. పలువురి ఫిర్యాదు మేరకు ప్రధాన వ్యక్తి సల్ల రాజ్ కుమార్ ను పట్టుకుని విచారించగా నేరం జరిగిన క్రమాన్ని వివరించాడన్నారు.    

ఆయనతో చేతులు కలిపిన సాయికిరణ్, నిర్మల్ లోని ప్రియదర్శిని నగర్ కు చెందిన కండెల నరేష్ (ఉపాధ్యాయుడు), గంగాధర్(ఎక్సైజ్ ఎస్ ఐ), ఎ ఆర్ కానిస్టేబుల్ మహేష్ లను పట్టుకుని విచారణ చేపట్టామన్నారు. సల్లా రాజ్ కుమార్ చెప్పిన వివరాల ప్రకారం యూనిట్ కాయిన్,యు బిట్ అనే ఆన్లైన్ వ్యాపారం లో పెట్టుబడి పెడితే డాలర్ల రూపంలో లాభం వస్తుందని నమ్మబలికారన్నారు. కేవలం ఒకటిన్నర ఏళ్లలో పెట్టుబడిని 5 నుంచి పది రెట్లు పెంచుకోవచ్చని నమ్మించారన్నారు. నాన్ వర్కింగ్ బోనస్ గా రోజుకు 0.5 శాతం, చేర్పిస్తే 1శాతం బోనస్ వస్తుందని ఆశపెట్టారని పేర్కొన్నారు.

పలువురి ని మభ్యపెట్టి  పెట్టి ఈ  వ్యవహారంలో  చాలా మంది ఉద్యోగస్తుల్ని చిన్న, మధ్య తరగతి వారిచే పెట్టుబడి పెట్టించి నెలకి కొంత సొమ్ము వారికి చెల్లిస్తూ విస్తరించారని తెలిపారు. అయితే ఈ వ్యాపారంలో ప్రారంభంలో చేరిన వారు మాత్రమే ప్రయోజనం పొందుతారని అన్నారు. ఇది పూర్తిగా గొలుసుకట్టు విధానంలో కొనసాగుతుందని చెప్పారు. వీరిలో సల్ల రాజ్ కుమార్ మెటా మాస్క్ లో ఖాతాను సృష్టించాడని,  ఆ తర్వాత యు బిట్ క్రిప్టోలో ఖాతాను తెరిచాడనీ వివరించారు. ప్రారంభ పెట్టుబడి 500 రోజుల వరకు లాక్ చేయబడిందని, ఆ తర్వాత పెట్టుబడి పెట్టిన డబ్బు రెట్టింపు అవుతుందని నమ్మించాడు. నిర్మల్ జిల్లాలో Ubit అనే కరెన్సీ నెట్వర్క్ తో పాటు ఇతర వ్యక్తులను ఈ పథకానికి జాయిన్ చేస్తున్నట్లు తెలిపాడనీ పేర్కొన్నారు.  ఇతను కిరణ్, సాయికృష్ణ తో పాటు నరేష్, మహేష్, గంగాధర్ లతో కీలకంగా వ్యవహరించాడని తెలిపారు.

ఈ కేసుని విచారణలో కీలకంగా వ్యవహరించిన ఎ ఎస్పీ అవినాష్ కుమార్, డిఎస్పి గంగారెడ్డి తోపాటు నిర్మల్ టౌన్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, నిర్మల్ రూరల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ , ఎస్సైలు సాయి కృష్ణ,  ఎం రవి,  రవీందర్, కానిస్టేబుల్ తిరుపతి , గణేష్,  షోకత్,  సతీష్ లను అభినందించారు.