జెసిబి తో ఇసుక తవ్వకాలు– యదేచ్చగా ఇసుక అక్రమ రవాణా
ముద్ర.వీపనగండ్ల :- రెవెన్యూ, పోలీసులు తమను పట్టుకున్న ఎంతో కొంత ముట్టచెప్పి లేదా నామకవస్తుగా ఫైన్ లు కట్టి వస్తున్నామని ధీమాతో ఇసుక అక్రమ రవాణా వ్యాపారస్తులు పట్టపగలే యదేచ్చగా వాగులో నెంబర్ లేని జెసిబి తో ఇసుక ను తవ్వుతూ అక్రమంగా ఇసుక ఇతర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
మండల పరిధిలోని తూముకుంట వాగు నుంచి పట్టపగలే ఇసుక తవ్వకాలు తవ్వుతూ ట్రాక్టర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు ఇసుకను తరలిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక ను తరలిస్తే కఠిన చర్యలు తప్పవని రెవెన్యూ పోలీస్ అధికారులు హెచ్చరిస్తున్న తమకు అవేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. తూముకుంట వాగు నుంచి నిత్యం పదుల సంఖ్యలో ఇసుక తరలిపోతున్న అధికారులు చోద్యం చూస్తున్నారు అని విమర్శలు వస్తున్నాయి.అక్రమంగా ఇసుకను ట్రాక్టర్ ద్వారా తరలిస్తున్న స్థానిక రెవెన్యూ పోలీస్ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
వనపర్తి నుంచి వచ్చే స్పెషల్ పోలీసులు మాత్రమే పలుమార్లు తూముకుంట కుంట వాగు నుంచి అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లను పట్టుకొని స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించి కేసులు నమోదు చేయించిన ఘటనలు ఉన్నాయి. ఇసుకతో పట్టుబడిన ట్రాక్టర్లను బైండోవర్ చేయటం గాని, మైనింగ్ కు అప్పజెప్పడంతో జరిమానాలు విధించకుస్తుండగా ట్రాక్టర్ యజమానులు వాటిని చెల్లించి మళ్లీ యదేచ్చగా తరలిస్తున్నారు. గత నాలుగు రోజుల క్రితం గ్రామానికి చెందిన ట్రాక్టర్లు ఇసుక తరలిస్తుండగా పోలీసులు పట్టుకొని కేసులు నమోదు చేసిన, మంగళవారం తూముకుంట వాగులో జావాయిపల్లి చెందిన నెంబర్ లేని జెసిబి తో ఇసుక తవ్వకాలు చేస్తూ ట్రాక్టర్ల ద్వారా ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా పట్టపగలే రోజు ఇసుకను ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్న రెవెన్యూ పోలీసు లు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఇదేనా కఠిన చర్యలు తీసుకోవడం అంటూ ప్రజలు విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ, పోలీస్ అధికారులు కఠిన చర్యలు తీసుకొని ఇసుక అక్రమ రవాణా కు అడ్డుకట్ట వేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.