సందీప్​రెడ్డి ఓ బచ్చా!

సందీప్​రెడ్డి ఓ బచ్చా!
  • తండ్రి పలుకుబడి లేకపోతే వార్డు మెంబర్​గా కూడా గెలవలేరు
  • మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ఫైర్​
  • బీఆర్ఎస్​ నిధులతోనే బిల్డింగ్​లు కట్టారు
  • రైతుబంధు అడిగితే చెప్పుతో కొట్టమంటారా? 
  • భువనగిరి జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి
  • గూడూరు జీపీ కార్యాలయం ప్రారంభోత్సవంలో నేతల వాగ్వాదం


 ముద్ర ప్రతినిధి, బీబీనగర్: ‘‘మాజీ మంత్రి, దివంగత ఎలిమినేటి మాధవరెడ్డి గొప్ప నాయకుడు. ఆయన కడుపులో పుట్టిన సందీప్ రెడ్డి ఒక బచ్చా.. తండ్రి పలుకుబడి లేకపోతే.. ఆయన కనీసం వార్డు సభ్యుడిగా కూడా గెలవలేరు” అని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా గూడూరులో జరిగిన జీపీ పంచాయతీ భవనం ప్రారంభోత్సవంలో మంత్రి కోమటిరెడ్డి, యాదాద్రి భువనగిరి జడ్పీ చైర్మన్​ సందీప్​రెడ్డి మధ్య ఉద్రిక్తత చోటుచేసుకుంది. భవన ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి కంటే ముందు మాట్లాడిన సందీప్​రెడ్డి కాంగ్రెస్​ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు బీఆర్ఎస్ ఇచ్చిన నిధులతో నిర్మించిన భవనాలనే ఇప్పుడు మంత్రి ప్రారంభిస్తున్నారని, అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీపైనే బురద జల్లుతున్నారని పేర్కొన్నారు. అలాగే రైతుబంధు అడిగినోళ్లను చెప్పుతో కొట్టమని చెప్పడం మంచిపద్ధతి కాదని మంత్రికి సూచించారు.

దీంతో ఓవైపు సందీప్ రెడ్డి మాట్లాడుతుండగానే.. మంత్రి వెంకటరెడ్డి మధ్యలో జోక్యం చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మాజీమంత్రి, దివంగత ఎలిమినేటి మాధవరెడ్డి గొప్ప నాయకుడని, ఆయన కడుపులో పుట్టిన సందీప్ రెడ్డి ఒక బచ్చా అని  అన్నారు. తండ్రిపై ప్రజలలో ఉన్న గౌరవమే నేడు ఆయనకు జడ్పీ చైర్మన్ పదవిని కల్పించింది తప్ప, కనీసం ఆయనకు వార్డు సభ్యుడిగా కూడా గెలిచే సత్తా లేదని మంత్రి విమర్శించారు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు జడ్పీచైర్మన్ తీరుపై మండిపడ్డారు. అనంతరం పోలీసులు సందీప్​రెడ్డిని అక్కడి నుంచి తీసుకుపోయారు.