నిద్రపోతోన్న నిఘా..! శాంతిభద్రతల పరిరక్షణలో సర్కార్ వైఫల్యం

నిద్రపోతోన్న నిఘా..! శాంతిభద్రతల పరిరక్షణలో సర్కార్ వైఫల్యం
  • 11 నెలల్లో 9 చోట్ల మత ఘర్షణలకు బీజం
  • లగచర్ల లో కలెక్టర్ పై దాడి పసిగట్టలేకపోయిన నిఘా వర్గాలు 
  • సీఎం సొంత జిల్లాల్లోనే సర్కార్ పై వ్యతిరేకత 
  • లగచర్ల ఘటనపై సర్కారు సీరియస్ 
  • నివేదిక కోసం వెయిటింగ్​
  • అధికారులపై దాడి ప్రచారాన్ని తేలిగ్గా తీసుకున్న నిఘా వర్గాలు 
  • డీజీపీపై వేటుకు సిద్ధమవుతోన్న రంగం..?
  • నోటిఫికేషన్​ నాటి నుంచే ప్లాన్​
  • పలుమార్లు సమావేశాలు
  • అధికారులపై దాడి బహిరంగ ప్రచారమే
  • అయినా తేలిగ్గా తీసుకున్న నిఘా వర్గాలు
  • డీజీపీకి సమాచారం ఉందంటూ అనుమానాలు

ముద్ర, తెలంగాణ బ్యూరో :  రాష్ట్రంలో నిఘా నిద్రపోతున్నది. ఎప్పుడు..? ఏ వర్గం..? ఎక్కడి నుంచి వచ్చి రొడ్డెక్కుతుందో అర్ధం కాని ఆందోళనకర వాతావరణం నెలకొన్నది. కాంగ్రెస్ పాలన తీరుపై ప్రజల్లో రోజు రోజుకు పెరుగుతున్న వ్యతిరేకతను అంచనా వేయలేకపోతున్న నిఘా వర్గాలు.. కనీసం వారు చేపడుతున్న ఆందోళనలనూ పసిగట్టడంలో ఘోరంగా వైఫల్యం చెందడం విస్మయానికి గురి చేస్తున్నది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఆధీనంలో ఉన్న ఈ శాఖ...పని తీరు విషయంలో ప్రభుత్వ వర్గాలతో పాటు ప్రజల్లోనూ అపవాదును మూటగట్టుకుంటున్నది. ముఖ్యంగా రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో కాంగ్రెస్ సర్కార్ ఘోరంగా విఫలమైందనే ప్రచారం జరుగుతున్నది. గడిచిన 11 నెలల కాంగ్రెస్‌ పాలనలో రాష్ట్రంలో తొమ్మిది చోట్ల మత ఘర్షణలకు బీజం పడింది.దాంతో భవిష్యత్తులో రాష్ట్రం రావణకాష్టంగా రగిలిపోతుందేమోనని రాజకీయ విశ్లేషకులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు.

తాజాగా ఈ నెల 11న వికారాబాద్​ జిల్లా లగచర్లలో జిల్లా కలెక్టర్​ ప్రతీక్​ జైన్​, ఇతర ఉద్యోగులపై జరిగిన దాడి మరోసారి నిఘా వైఫల్యాన్ని తేటతెల్లం చేసింది. అధికారులపై దాడి గురించి నిఘా వర్గాలకు ముందే తెలిసినా తేలిగ్గా తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రమాదం గురించి నిఘా వర్గాలు డీజీపీకి ముందే సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదనే ప్రచారం జరుగుతున్నది. వాస్తవానికి లగచర్లలో ఫార్మా సిటీ ఏర్పాటుకు సంబంధించి నోటీఫికేషన్​ వెలువడిన వెంటనే ఆ ప్రాంత ప్రజల్లో ప్రభుత్వ నిర్ణయంపై వ్యతిరేకత మొదలైన విషయం బహిరంగ రహస్యమే. అయితే దానిపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం కలెక్టర్​, తన అధికార బృందంతో కలిసి లగచర్లకు వెళ్తున్నట్టు ముందే ప్రకటించారు. అప్పటికే ఫార్మాసిటీ ఏర్పాటుపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న ఆ ప్రాంత ప్రజలు కలెక్టర్​ ను అడ్డుకునేందుకు సిద్​ధమయ్యారు. అయినా నిఘా వర్గాలు ఆ ప్రమాదాన్ని పసిగట్టలేకపోవడం తీవ్ర పర్యావసానానికి దారితీసినట్టయింది. రాష్ట్రంలో అన్ని వర్గాలను కుదిపేసిన లగచర్ల ఘటన రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్​ సర్కార్​ వైఫల్యాన్ని బహిర్గతం చేసింది. దీనిపై అన్ని వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొనడంతో.. వెంటనే స్పందించిన సీఎం రేవంత్​ రెడ్డి దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించారు. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు 46 మందిని గుర్తించారు.

ఇప్పటి వరకు 26 మందిని అరెస్ట్​ చేసి సంగారెడ్డి కేంద్ర కారాగారానికి తరలించారు. మరోవైపు ఈ ఘటనకు బాధ్యుడిగా భావిస్తూ కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్​ రెడ్డి, ప్రధాన నిందితుడు సురేశ్ లను పోలీసులు అరెస్ట్ చేయగా కొడంగల్​ కోర్టు పట్నంకు 14 రోజుల రిమాండ్​ విధించింది. దీంతో పోలీసులు ఆయన్ను చర్లపల్లి జైలుకు తరలించారు. ఇదీలావుంటే ఘటనపై సమగ్ర విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం అదనపు డీజీ మహేశ్​ భగవత్​ కు బాద్యత అప్పగించింది. దీంతో ఈనెల 14న పరిగి పోలీస్ స్టేషన్​ లో పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించిన మహేశ్ భగవత్​.. మాజీ ఎమ్మెల్యే నరేందర్​ రెడ్డి సెల్​ ఫోన్​ తెరిచి కీలక సమాచారం రాబట్టినట్టు ప్రచారం జరుగుతున్నది.  కలెక్టర్​ పై దాడికి ముందు నుంచే వ్యూహాలు రచించారనీ, నిఘా వర్గాలే పసిగట్టలేకపోయినట్లు గుర్తించినట్లు తెలిసింది. ప్రస్తుతం విచారణను ముమ్మరం చేసిన పోలీసులు త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నది.అయితే ఈ మొత్తం వ్యవహారంలో డిజీపీ రవిగుప్తా వైఫల్యం చెందారని సీఎం భావిస్తున్నట్లు సమాచారం. విచారణాధికారి మహేశ్​ భగవత్​ ఇచ్చే నివేదిక ఆధారంగా ఆయనపై వేటు ఉంటుందనే ప్రచారం జరుగుతున్నది. 

11 నెలల్లో 9 ఘటనలు..!

లగచర్ల ఘటనను అటుంచితే.. ఈ మద్యకాలంలో   భైంసా, పాతబస్తీ, మెదక్‌, బోడుప్పల్‌లో తలెత్తిన ఘర్షణలు సర్కార్ ను కలవరపెట్టాయి.మెదక్‌ మతఘర్షణల్లో నిర్లక్ష్యం వహించిన మెదక్‌ టౌన్‌, రూరల్‌ స్టేషన్ల సీఐలను అప్పటి  ఐజీ రంగనాథ్‌ డీజీపీ ఆఫీస్‌కు అటాచ్‌ చేయగా  సికింద్రాబాద్‌ ముత్యాలమ్మ ఆలయంపై దాడి ఘటనలో ఓ వర్గానికి చెందిన 151 మంది యువకులను  సికింద్రాబాద్‌లోని ఓ హోటల్లో 59 గదుల్లో గుర్తించడం విస్మయానికి గురిచేసింది.అలాగే జూన్‌లో మియాపూర్‌లోని హెచ్‌ఎండీఏ భూముల్లో పేదలకు ఇండ్ల స్థలాలు పంచుతున్నారని సామాజిక మాధ్యమాల్లో ఓ వార్త వైరలైంది.దాంతో  రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి ప్రాంతాల నుంచి భారీ  సంఖ్యలో జనం అక్కడ పోటెత్తగా అది లాఠీచార్జీ కి దారితీసింది. లకలగూడ, ఉప్పల్‌, మేడ్చల్‌, హయత్‌నగర్‌ ప్రాంతాల్లో దొంగతనాలకు గ్యాంగులు వచ్చాయని ఆలస్యంగా గుర్తించింది. ఇటీవల నగరంలోని ఆసిఫ్‌నగర్‌లో పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే వరుసగా జరిగిన  మూడు హత్యలు పోలీస్ శాఖకు సవాల్ విసిరాయి.

ఇంత జరుగుతున్నా ఇంటెలిజెన్స్‌ విభాగానికి సమాచారం లేకపోవడం గమనార్హం.మరోవైపు గ్రూప్‌-1 పరీక్షను రీషెడ్యూల్‌ చేయాలని అభ్యర్థులు అక్టోబర్‌ రెండోవారంలో అర్ధరాత్రి రోడ్లపైకి వచ్చి క్యాండిళ్లతో నిరసన వ్యక్తం చేశారు. అయితే  ఇంటెలిజెన్స్‌ విభాగం దాన్ని పసిగట్టలేకపోయింది. వారంతా సెక్రటేరియట్‌ను ముట్టడిస్తారని తెలిసి అభ్యర్థుల గదుల్లోకి చొచ్చుకెళ్లిన పోలీసులు నిరుద్యోగులను పోలీసు వాహనాల్లో ఈడ్చిపడేశారు. లాగే విధుల నిర్వహణలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బెటాలియన్‌ కానిస్టేబుళ్లు, వారి భార్యలతో కలిసి  రోడ్లెక్కి నిరసన తెలపడం రాష్ట్రంలో అన్ని వర్గాలను కుదిపేసిన విషయం తెలిసిందే. అదే సమయంలో కానిస్టేబుళ్లు తమ తమ  కుటుంబాలతో కలిసి సచివాలయాన్ని ముట్టడించారు.  అయితే  వారి పోరాటం నుంచి కూడా నిఘా వర్గాలు పాఠం నేర్చుకోలేకపోయాయి.దాంతో హోంగార్డులు సైతం ఆందోళన బాటపట్టారు. వారు కూడా కుటుంబాలతో సచివాలయం ముట్టడికి యత్నించడంతో.. అప్పటికి తేరుకొని జిల్లాల సరిహద్దుల్లోనే నిలువరించారు.