లక్షలాదిమందికి విద్యను అందించిన ఆ గురువు ఇక లేరు ...!

లక్షలాదిమందికి విద్యను అందించిన ఆ గురువు ఇక లేరు ...!
  • విద్యారంగంలో తనదైన ముద్ర వేసిన విద్యావేత్త.. మేధావి సత్తార్ సార్ 


సూర్యాపేట ముద్ర ప్రతినిధి :- సూర్యాపేట విద్యా రంగానికి దశాబ్ద కాలం పాటు సేవలు అందించిన బాపూజీ ట్యుటోరియల్ వ్యవస్థాపకులు ఎంఏ సత్తార్ మంగళవారం మధ్యాహ్నం కన్నుమూశారు. సూర్యాపేట ప్రాంతంలో 80వ దశకంలో ఆయన తెలియని వారు ఉండరు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు చాలా సులభంగా బోధించగలిగే నేర్పరితనం వల్ల ఎందరో విద్యార్థులకు ఆయన ఆరాధ్యునిగా నిలిచారు. 1978లో సూర్యాపేటలో బాపూజీ ట్యుటోరియల్ కాలేజీని ఏర్పాటు చేశారు. 19 86 వరకు సూర్యాపేటలో, ఆ తర్వాత 1989 వరకు కోదాడలో ఆయన బాపూజీ ట్యుటోరియల్ కాలేజీ పేరుతో విద్యా సేవలు అందజేశారు. లక్షలాదిమంది కి ఆయన విద్యను అందించి వారి జీవితాలకు పునాది అయ్యారు.

 విద్యారంగంలో చేయి తిరిగిన విద్యావేత్త, మేధావి అయిన సత్తార్ సార్ ఎందరకో  అందించిన విద్యా ఫలాలు వారు జీవితంలో స్థిరపడటమే కాకుండా సమాజంలో మంచి వ్యక్తులుగా, నిజాయితీగల మనుషులుగా జీవించడంలో సత్తార్ సార్ చేసిన కృషి అమోఘం, శ్లాఘనీయం, అజరామరం. ఆయన తన సంస్థకు పెట్టుకున్న పేరు బాపూజీ. గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా ఆయన తన సంస్థను నిర్వహించాలని భావించారు. ఆయన పాఠశాల ముందు "come to learn Go to earn" అని వ్యాఖ్యానం ఉండేది. విద్యార్థుల పట్ల ఎంత కఠినంగా ఉండేవారో మామూలు సమయంలో అంతా ఉదారంగా ఉండేవారు. ఆ విద్యావేత్త మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో కన్నుమూశారు. అంతిమ సంస్కారం మునగాల మండలం నరసింహుల గూడెం గ్రామంలో బుధవారం మధ్యాహ్నం జరగనుంది .తప్పనిసరిగా ఆయన శిష్యులు, విద్యారంగ అభిమానులు హాజరు కావలసిందిగా సత్తార్ సార్ శిష్యులు అభిమానులు కోరుతున్నారు.