సత్యమేవ జయతే

సత్యమేవ జయతే
Satyameva Jayate

పత్రికా రంగం వ్యాపారంగా పుట్టిన మాధ్యమం కాదు. ప్రజా చైతన్యం లక్ష్యంగా ఆవిర్భవించిన జ్వాల అది. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు రక్షణగా నిలవడం, వాస్తవాలను నిర్భీతిగా ప్రకటించడం, సామాజిక స్పృహకు బాటలు వేయడం, రాజకీయ చైతన్యాన్ని ఉద్దీపింపజేయడం ప్రాథమిక లక్ష్యాలుగా మన దేశంలో పత్రికలు, ప్రసార మాధ్యమాలు ఆవిర్భవించాయి. అప్పట్లో పత్రికా రంగంలో లాభార్జన, రాజకీయ ప్రయోజనాలు, వ్యాపార విస్తృతి, అకృత్యాలకు చట్టం నుంచి రక్షణ పొందడం వంటి సంకుచిత ప్రయోజనాల ఊసే లేదు. జాతీయోద్యమానికి ఊతంగా, సంఘ సంస్కరణాభిలాషులకు బాసటగా నిలవడం ప్రధాన లక్ష్యాలుగా మాత్రమే పత్రికలు నడిచాయి. అందువల్లనే జర్నలిజం-పత్రికల మౌలిక నిర్వచనం సేవారంగంగానే ఉండిపోయింది.

కాలం మారింది. మీడియా రంగంలోకి కార్పొరేట్లు ప్రవేశించిన తర్వాత అది ఫక్తు వ్యాపారంగా మారిపోయింది. దళారీలు కాలుమోపిన తర్వాత పలుకుబడిని పెంచుకోవడమే బాట అయింది. రాజకీయ నాయకులే యజమానులైన తర్వాత స్వార్థ ప్రయోజనాలే రాజ్యమేలుతున్నాయి.  వందల కోట్ల పెట్టుబడులతో పత్రికలు, ఛానెళ్లు! ఈ అవాంఛనీయ  పరిణామాల ఒరవడిలో ఎందరో త్యాగధనులు, అత్యుత్తమ జర్నలిస్టులు నెలకొల్పిన విలువలు పతనమైపోయాయి. ప్రమాణాలు దిగజారిపోయాయి.

ఒకవైపు ఈ విలువల దిగజారుడు లోతులు కొలవడం కష్టంగా మారిన తరుణంలో మరో వైపు సమాచార సాంకేతక పరిజ్ఞానం కొత్త ఆశలకు ఊపిరులూదింది. విలువలతో కూడిన జర్నలిజాన్ని కోరుకునే వారికి నూతన మార్గావిష్కరణ చేసింది. కమ్యూనికేషన్ విప్లవం మీడియా రంగంలో అనేక మార్పులు తెచ్చింది. ముఖ్యంగా డిజిటల్ మీడియాలో అతి తక్కువ ఖర్చుతో ఓ వెబ్ సైట్, ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడానికి అవకాశం ఏర్పడింది. స్వచ్ఛమైన, కల్మషం లేని, విషం కక్కని.. భావప్రకటనలకు ఎవరికి వారు వేదికలు సృష్టించుకోగల వెసులుబాటు ఏర్పడింది. ఆంగ్ల మాధ్యమంలో అలాంటి మంచి వార్తా సంస్థలు కొన్ని వచ్చాయి.

అదే దారిలో ఓ మంచి తెలుగు పత్రిక కోసం పాఠకుడు వెతుకుతున్న ప్రస్తుత తరుణంలో తెలుగు మీడియా రంగంలో సరికొత్త ‘ముద్ర’ వేయడానికి మేము సమాయత్తమయ్యాం. తెలుగు పాత్రికేయ రంగంలో 30–40  యేళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన కొందరు మిత్రులం కలిసి ‘నెట్ వర్త్  మీడియా ప్రైవేట్ లిమిటెడ్’ అనే సంస్థను ఏర్పాటు చేసుకున్నాం. ముద్ర పత్రికను, ముద్ర టీవీని, ‘ముద్ర న్యూస్ డాట్ ఇన్’ పేరుతో  వెబ్ సైట్ ను  ఏక కాలంలో ప్రారంభించాం. మేము ఏ రాజకీయ పార్టీకీ అనుకూలం కాదు. వ్యతిరేకమూ కాదు. మేము ఇజాల పేరుతో గిరి గీసుకొని కూర్చోం. మంచిని మంచిగా చెబుతాం. చెడును చెడుగానే చూపుతాం.  వార్తను వాస్తవంగా రాస్తాం. చూపిస్తాం. నిజాన్ని నిర్భయంగా చాటుతాం. ప్రజాహితమే మా లక్ష్యం. అన్ని వర్గాల అభ్యున్నతి మా ఆకాంక్ష. సామాన్య పౌరుడి గొంతుకను ఎలుగెత్తి చాటుతాం. మా అక్షర సంకల్ప యాత్రలో ప్రతి ఒక్కరూ కలిసి రావాలని, మాకు సంపూర్ణ సహకారం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

 

మీడియా స్వతంత్రంగా ఉండాలని కోరుకునే ప్రజాస్వామ్యవాదులు, ఆలోచనాపరులు, మేధావులు, మాకు వెన్నుదన్నుగా నిలవాలని కోరుకుంటున్నాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగో మూల స్తంభాన్ని బలోపేతం చేసే యజ్ఞంలో పాలు పంచుకోవాలని ప్రార్థిస్తున్నాం. ధనస్వాముల అండదండలు లేకుండా కేవలం పాత్రికేయులు సమకూర్చుకుంటున్న స్వల్ప నిధులతో ప్రారంభించిన ఈ మీడియా వేదికకు మీ ఆశీస్సులు ఉంటాయన్న విశ్వాసంతో మీ ముందుకు వచ్చాం. మీ మెప్పు పొందగలమన్న విశ్వాసంతో ముందుకు సాగుతాం.