బిఆర్ఎస్  'చే' జారిన ఎంపీపీ పదవి

బిఆర్ఎస్  'చే' జారిన ఎంపీపీ పదవి
  • సారంగాపూర్ ఎంపీపీ గా సవిత

ముద్ర ప్రతినిధి, నిర్మల్:నిర్మల్ జిల్లా సారంగాపూర్  మండల ప్రజా పరిషత్‌ (ఎంపీపీ) అధ్యక్ష పదవికి జరిగిన ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ఆడే సవిత ఎన్నికయ్యారు.  అయితే ఎంపికైన కొద్ది గంటలలోపే ఆ పార్టీని వీడి కాంగ్రెస్ లో  చేరటం కొసమెరుపు. వివరాల్లోకి వెళితే... గతంలో భారత రాష్ట్ర సమితి పక్షాన ఎంపీపీ గా కొనసాగిన అట్ల మహిపాల్ రెడ్డిపై ఇటీవల అవిశ్వాసం ప్రవేశ పెట్టడంతో బల పరీక్షకు ముందే ఆయన రాజీనామా చేశారు. దీంతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.  

కాగా బుధవారం నిర్వహించిన మండల పరిషత్ అధ్యక్ష పదవి ఎన్నికల్లో మండలంలో ఉన్న 13 ఎంపీటీసీ లు బిజెపి అభ్యర్థి కొరిపల్లి సరితకు(వంజర్ ఎంపీటీసీ) 6 గురు మద్దతివ్వగా, బిఆర్ఎస్ అభ్యర్థి రాథోడ్ సవిత బాయి (అడెల్లి)కి 7 గురు ఎంపిటిసిలు మద్దతు తెలిపారు.దీంతోఎంపీపీ అధ్యక్ష స్థానం బీ ఆర్ ఎస్ చేజిక్కింది. అయితే ఎంపికైన కొద్ది గంటల్లోనే ఆమె కాంగ్రెస్ లో చేరటంతో బీ ఆర్ ఎస్ చేజిక్కిన పదవి చే జారినట్లయింది. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు.