విజ్ఞానవంతమైన సమాజం కోసం ముందుకు సాగాలి

  • లిటిల్ స్టార్స్ హైస్కూల్లో వైజ్ఞానిక సదస్సు విజయవంతం

ముద్ర,పానుగల్:-పానగల్ మండల పరిధిలోని తెల్లరాళ్లపల్లి గ్రామంలో బుధవారం లిటిల్ స్టార్ హై స్కూల్ లో నిర్వహించిన సైన్స్ నా ఊపిరి అనే అంశంపై వైజ్ఞానిక సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విజ్ఞాన దర్శని రాష్ట్ర  అధ్యక్షులు టి రమేష్  హాజరై మాట్లాడారు. విద్యార్థులు సైన్సును ప్రేమించాలని, ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని అన్నారు.తరగతి గదినుండే ప్రయోగాలు ప్రారంభించాలని, రానున్న కాలంలో గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు.సమాజంలో నెలకొన్న మూఢనమ్మకాలను మటుమాయం చేయాలని, విజ్ఞాన వంతమైన సమాజ నిర్మాణం కోసం సైనికులుగా ముందుకు సాగాలని అన్నారు.జన విజ్ఞాన వేదిక జిల్లా నాయకులు జితేందర్ మాట్లాడుతూ దేనిని కూడా గుడ్డిగా నమ్మొద్దని,పరిశీలన శక్తిని పెంచుకోవాలని అన్నారు. చదువుకున్న వాళ్లు కూడా మూడ విశ్వాసాలు పాటించడం దురదృష్టకరమని చింతించారు.

ట్రస్మా జిల్లా నాయకులు రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ సైన్స్  ప్రపంచానికి గుండెకాయ లాంటిదని అభివర్ణించారు.ఎందరో శాస్త్రవేత్తల త్యాగ ఫలితం నేడు మనం అనుభవిస్తున్న టెక్నాలజీ అని అన్నారు.ప్రతి విద్యార్థి మెదడుకు పదును పెట్టాలని పిలుపునిచ్చారు.జానపద కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షులు డప్పు స్వామి మాట్లాడుతూ ప్రముఖ కళాకారుడు పాము నాగులు, దళిత ఉద్యమ నాయకులు మీసాల రాము,ప్రముఖ గాయకులు బండారు కుర్మయ్య, తమ ఆటపాటలతో విద్యార్థులను ఆకట్టుకున్నారు.ఈ కార్యక్రమంలో లిటిల్ స్టార్ హైస్కూల్ ప్రిన్సిపల్ ఎం శేఖర్ యాదవ్,కరస్పాండెంట్ కాకం ఆంజనేయులు,ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.