వరి కొయ్యలకు నిప్పు అంటిస్తే భారీ నష్టం

వరి కొయ్యలకు నిప్పు అంటిస్తే భారీ నష్టం
  • రైతన్నలు పారా హుషార్ 
  • భూసారం తగ్గుతుంది... విలువైన పోషకాలు మాయమవుతాయి 

హుజూర్ నగర్, ముద్ర ప్రతినిధి:వరి కొయ్యలకు నిప్పంటిస్తే నేలకు మనం ఊహించని భారీ నష్టం జరుగుతుందని సీనియర్ హార్టికల్చర్ కన్సల్టెంట్ సుందరి సురేష్ కుమార్ మంగళవారం విలేకరులకు తెలిపారు. నేల సారంతో పాటు నేలకు మేలు చేసే సూక్ష్మజీవులు చనిపోతాయన్నారు.

పంట దిగుబడి తగ్గుతుందని, వరి మొదళ్ళలో నత్రజని, భాస్వరం, పొటాషియం ఉంటాయని ఆయన వివరించారు. ఈ మొదళ్ళను కాల్చడం వలన పోషకాలు నే లలోనే కలవకుండా మంటలకు మాడిపోతాయని,  తరచుగా వరి కొయ్యకాలు కాల్చే పొలాల్లో నేల కోతకు గురవుతుందని వెల్లడించారు.కాలుష్యం ఏర్పడుతుందని, దీంతో గ్లోబల్ వార్మింగ్ ఏర్పడి వాతావరణంలో ఉష్నోగ్రతలు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. 

గడ్డి తిని బ్రతికే కీటకాలు, పశువులకు ఆహారం కొరత ఏర్పడే అవకాశం ఉందని సూచించారు.  మంటలు అకస్మాత్తుగా గ్రామాలలో గుడిసెలకు, గడ్డివాములకు వ్యాపించి ఆస్థి నష్టం జరిగే ప్రమాదం ఉందని, ఈ విషయంలో గ్రామస్తులు రైతులు జాగ్రత్తగా ఉండాలని కోరారు. అలాగే ఉద్యానవన పంటలు కూడా నష్టపోతామని,ఇటీవల మునగాల మండలంలో ఓ రైతు వరి కొయ్యలకు నిప్పంటిస్తు ప్రమాద వశాత్తు మంటల్లో చిక్కుకొని గాలి ఆడకపోవడంతో మృతి చెందాడన్న  విషయాన్ని ఆయన గుర్తు చేశారు.  రైతు సోదరులు వరి కొయ్యలకు నిప్పు అంటించవద్దని, మన నేలను మనమే కాపాడుకుందాం అనే సుందరి సురేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు.