ఆయేగా ఆయేగా ఆనే వాలే ఆయేగా….

ఆయేగా ఆయేగా ఆనే వాలే ఆయేగా….

(సెప్టెంబర్ 28 లతామంగేష్కర్ జయంతి)

ఆమె పాటకు పుడమి పులకించింది.మేఘం వర్షించింది. సెలయేటి జాలు ఆగిపోయింది. పచ్చని పైరు తల ఊపింది. పైగా … గాలికి సైగచేసి చెప్పింది. .. ఏమని? కాసేపు వీయడం ఆపి ఆ పాటను వినమని. గాలి విని పరవశించి … ప్రేమికుల చెంతచేరి ఆ ఊసు చెప్పింది. ఊహల కలల అలలలో తేలిపోయే ఆ జంట …. గాలిమోసుకొచ్చిన ఆ పాటను విని తన్మయం చెందింది. ప్రకృతిని, జీవరాశులను తన గానధారతో తన్మతత్వంలోకి తీసుకెళ్లిన ఆ కోకిల లతామంగేష్కర్. రాగాల పల్లకిలో ఆ కొకిలమ్మ కలకూజితాలు వినిపించింది. ఆమె వెళ్లిపోయారు. ఆమె పాట మిగిలింది.  

ఆ గొంతు వినగానే…

హిందీ పాట అనగానే మనకు మొదట గుర్తొచ్చేది లతామంగేష్కర్. ఆమె గొంతు అలాంటిది. లత పాటకు అంతటి ప్రభావం ఉంది. ‘ఆయేగా ఆయేగా ఆనేవాలే ఆయేగా’ అంటూ లత తన పాటను ప్రారంభించారు. ఆశించినట్టే ఆ పాటను, మరెన్నో పాటల్ని వినేందుకు ఆమె ‘మహల్’లోకి ఒకరా ఇద్దరా… మొత్తం దేశమే తరలివచ్చింది.

గాయనిగా లత కొన్ని దశాబ్దాలపాటు… అంటే 70 ఏళ్లపాటు ప్రేక్షకుల్ని, శ్రోతల్నీ రంజింపచేశారు. అదంత తేలిక కాదు. అయినా చివరివరకూ ఆ గానమాధుర్యం తగ్గలేదు. పటుత్వం సడలలేదు. ఒక వయసు దాటాక ఎవరి గొంతులో అయినా వార్థక్య లక్షణాలు వస్తాయి. కానీ లతమ్మ గొంతు వయసుకు, వార్థక్యానికీ అతీతం. అది ఆమెకు దేవుడిచ్చిన వరం. వయసెరుగని, అలుపెరుగని గాత్రం మంగేష్కర్ ది. పూర్వజన్మ పుణ్యం కొద్దీ వచ్చిందనాలి. జోలపాట పాడినా, జాలి పాట పాడినా ఆ గొంతులో లాలిత్యం తొణికిసలాడింది. వలపు పాటలో తియ్యదనం కురుస్తుంది. అల్లరి పాట పాడితే చిలిపిదనం మురుస్తుంది. మధురమైన ప్రేమ పాటైనా, మనసును కదిలించే విషాద గీతమైనా, ఆర్తితో పాడే భక్తి గీతమైనా లతామంగేష్కర్ గొంతులో ప్రాణం పోసుకుంటుంది. జీవం నింపుకుంటుంది. 

ఆమె పాట వినని వారు లేరు

ఈ గానకోకిల పాట ఒక్కటైనా వినని భారతీయుడు ఉండడంటే అతిశయోక్తి కాదు. లత పాటలను స్టేజీల మీద వందలాది మంది పాడుతున్నారు. బయట పాడేందుకు వెనకాడేవారు ఇంట్లో కూనిరాగాలు తీస్తున్నారు. సామాన్యులే కాదు, మ్యూజిక్ డైరెక్టర్లూ ఆమె పాటలతో పేరు తెచ్చుకున్నారు. నౌషాద్, లక్ష్మీకాంత్ ప్యారేలాల్, కళ్యాణ్ జీ– ఆనంద్ జీ, ఆర్.డి. బర్మన్,  బప్పీ లహరి, రాంలక్ష్మణ్, శంకర్ జై కిషన్ వంటి వారు తమ సినిమాల్లో ఆమె పాడాలనుకునేవారు. ఆమె చేతే పాడించుకున్నారు. పేరు గడించారు. లయరాజు ఇళయరాజా, ఎఆర్ రెహమాన్ ల సినీ సంగీత గీతాలను కూడా లతాజీ పాడారు. 

గానకోకిల పాటలే ప్రాణం

ఆమె పాటలతో ఎన్నో సినిమాలు సక్సెస్ అయ్యాయి. ఒకవేళ సినిమా బాగా ఆడకున్నా ఆమె పాటలు మాత్రం హిట్టయ్యాయి. ఒకటా రెండా … వేల పాటలు పాడారు లత. తమ సినిమాలో ఆమె పాట ఒక్కటైనా ఉండాలని నిర్మాతలు, సంగీత దర్శకులు కోరుకునేవారు. ప్రేమగీతాలలో ఆమెకు ఆమే సాటి. హిందీ పాటల్లో ఉర్దూ భాష భావుకత ఉంటుంది. మజ్రూహ్ సుల్తాన్ పురి రాసిన గీతాల్లో రుబాయీల గుబాళింపు, కవాలీ కమనీయత ఉంటాయి. ఆనంద్ బక్షీ, కైఫీ అజ్మీ తమ గీతాల్లో ప్రేమ సరిగమల్ని వినిపించారు. భాంగ్రా నాట్యం సొబగులు చూపించారు. ఈ సినీ గీత రచయితలు రాసిన భావం ఏమాత్రం చెడకుండా, మరింత భావస్ఫోరకంగా ఆలపించారు లతామంగేష్కర్. మహమ్మద్ రఫీ, కిశోర్ కుమార్, ముఖేష్ లతో కలిసి ఆలపించిన ఎన్నో పాటల్లో ప్రేమామృతాన్ని అందించారు గానకోకిల. ప్రేమలో మాధుర్యం ఉంటుంది. విరహం ఉంటుంది. విషాదమూ ఉంటుంది. ఆయా భావాల్ని గొంతులో మార్దవంగా పలికించిన ప్రతిభామూర్తి ఆమె. ఈ ప్రతిభ ఆమెతో పాడిన గాయకులకూ ఉంది. మొగల్ ఏ ఆజం లో … ‘జబ్ ప్యార్ కియాతో డర్ నా క్యా’ పాట … ప్రేమికులు పిరికివాళ్లుగా ఉండకూడదని చెబుతుంది.

లతాజీ హిందీలోనే కాదు, అనేక భాషల్లోనూ పాడారు. తెలుగులో కూడా ఆలపించారు. సంతానం సినిమాలో – ‘నిదురపోరా తమ్ముడా’ పాట ఎంత హాయి గొలిపిందో కదా. ఆపాటను లతానే పాడారు. సుసర్ల దక్షిణామూర్తి సంగీతంలో లత గొంతులో ఆ పాట  పరిమళించింది.   లతా మంగేష్కర్ ప్రేమ భావనను తన గళంలో ఎంత ఆర్తితో పలికించారో, దేశభక్తినీ అంత గొప్పగానూ వినిపించారు. తను పాడిన దేశభక్తి గీతం విని ఒకప్పుడు దేశ ప్రధాని కూడా కంటతడి పెట్టారు. ఆయన ఎవరో కాదు… పండిట్ జవహర్ లాల్ నెహ్రూ. 

ఏ మేరే వతన్ లోగోవ్…

‘ఏ మేరే వతన్ లోగోం జరా ఆంఖ్ మే భర్ లో పానీ జో షహీద్ హుయే హే ఉన్కీ జరా యాద్ కరో ఖుర్బానీ’ … అని ప్రజల్ని ఉత్తేజపరుస్తూ, దేశంకోసం త్యాగం చేయండి అని పిలుపునిస్తూ లతా పాడిన పాట విని నెహ్రూ చలించిపోయారు. రక్తం గడ్డకట్టే చలిలో … హిమాలయాల్లో దేశ రక్షణకోసం తమ ప్రాణాల్ని అర్పించే సైనికుల్ని గుర్తు చేసుకోండి. వారికోసం ఒక్క కన్నీటి చుక్క రాల్చండి … అంటూ సాగే పాటను విన్న వారెవరైనా కన్నీరొలికిస్తారు. ఒకవైపు బాధ, మరోవైపు ఆత్మవిశ్వాసం … ఈ రెండు భావాలనూ లతామంగేష్కర్ అద్భుతంగా పలికించారు.

ఆ పాటతోనే… నెహ్రూ హయాంలోనే లతామంగేష్కర్ కు పార్లమెంటులో పాడే అవకాశం లభించింది. మరే గాయనికీ, గాయకుడికీ దక్కని అపూర్వ గౌరవం అది. 

ఏ పాటైనా ఆమె గొంతు నుంచి మంద్రంగా జాలువారి జీవం పోసుకొంటుంది. సన్నగా, వీణా నాదంలా, సున్నితమైన లతల్లా ఉండే ఆమె పాటలు వింటుంటే ఏదో తెలియని అలౌకికానందం కలుగుతుంది.

ఓ వెలుగు… ఓ వెన్నెల 

సూర్యోదయం ముంగిట్లో… ఆ సుప్రభాత వేళ… అందమైన అమ్మాయి రంగవల్లులు తీర్చిదిద్దుతుంటే… చూసేవాళ్లకు ఎలాంటి అనుభూతి కలుగుతుందో – లతా మంగేష్కర్ పాటలు వింటున్నప్పుడూ అదే వివశత్వం కలుగుతుంది. సంధ్యా సమయంలో ఏ నదీతీరాన్నో కూచుని ప్రకృతి సోయగాన్ని ఆస్వాదిస్తున్నట్టు ఉంటుంది.

భారతీయ సినిమా పాటకు లతామంగేష్కర్ ఓ వెలుగు. ఓ వెన్నెల. ఈ జాతి ఉన్నంతకాలం ఆమె పాట నిత్యమై, నూతనమై వెలుగులీనుతూనే ఉంటుంది.

– వి. మధుసూదనరావు