అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలి ...  షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలి ...  షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
  • షాద్ నగర్ చౌరస్తాలో 100 ఫీట్లతో సర్కిల్ నిర్మాణానికి ప్రణాళిక 
  • సర్కిల్ విస్తరణపై  అఖిలపక్షం సమావేశం 

ముద్ర/షాద్ నగర్:- భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని షాద్ నగర్ పట్టణ అభివృద్ధికి ప్రజలందరూ సహకరించాలని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కోరారు. సోమవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల నేతలతో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. పట్టణంలోని ముఖ్య కూడలిలో సర్కిల్ నిర్మాణంపై వివిధ పార్టీల నుంచి అభిప్రాయాలను తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని ముఖ్య కూడలిలో సర్కిల్ ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

ఇందుకు అన్ని వర్గాల ప్రజలు, వ్యాపారవేత్తలు సహకరించాలని పేర్కొన్నారు. పెరుగుతున్న పట్టణ జనాభాను దృష్టిలో పెట్టుకొని చౌరస్తా విస్తరణ చేపట్టడానికి ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ అధికారులతో ఇప్పటికే ఒకసారి చర్చించడం జరిగిందని వివరించారు. ప్రజాస్వామ్యంలో ఎంతోమంది నాయకులకు అవకాశం లభిస్తుందని, అయితే ఈ సమయంలో భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని పట్టణ అభివృద్ధి కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంటుందని అన్నారు. తనకు వచ్చిన అవకాశంతో రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. పట్టణ చౌరస్తాలో ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉందని పెరిగిన జనాభాకు అనుగుణంగా సరైన సదుపాయాలు లేవని పేర్కొన్నారు. అందుకే అధికారుల నిబంధనల ప్రకారం మాస్టర్ ప్లాన్ లో భాగంగా 100 ఫీట్ల సర్కిల్ ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు.

రోడ్డు విస్తరణ పనుల్లో నష్టపోయిన బాధితులకు నష్టపరిహారం సాధ్యసాధ్యులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించడం జరుగుతుందని తెలిపారు. అఖిలపక్షం కోరిన విధంగా వీలైతే ముఖ్యమంత్రిని కల్పించే ప్రయత్నం చేస్తామని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. అభివృద్ధి జరుగుతుందంటే కొంత నష్టం మరికొంత లాభం జరగవచ్చు అని దానికి ఎవరు బాధపడాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే అన్నారు. అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని అన్నారు. కొన్ని సందర్భాల్లో అభివృద్ధి కోసం అధికారులు కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని వాటిని ఎవరు తప్పు పట్టవద్ద అన్నారు. ప్రభుత్వ ప్రయత్నానికి రాజకీయాలకు పార్టీలకు అతీతంగా అందరూ సహకరించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. 

సమన్వయంతో ఒప్పించి పనులు చేయాలి. - మాజీ ఎమ్మెల్యే బక్కని 

అభివృద్ధి విషయంలో అందరినీ సమన్వయంతో ఒప్పించి పనులు చేసేందుకు అధికారులు కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు చెప్పారు. అభివృద్ధి వ్యవహారాల్లో కొంత నష్టం కూడా ఉంటుందని వాటిని భరించి ముందుకు సాగినప్పుడే అభివృద్ధి సాధ్యపడుతుందని అన్నారు. ప్రభుత్వం వాటి నిబంధనలు, చట్టాలు ఎవరు ఉల్లంఘించలేరని దీనిని ప్రజలు గుర్తుపెట్టుకోవాలని అన్నారు. విస్తరణ పనులు చేపడితే భవన యజమానులకు నష్టం జరిగితే వాటికి సంబంధించిన నష్టపరిహారం సాధ్యసాధ్యాలపై ఎమ్మెల్యే అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాలని, అప్పుడు ఎలాంటి ఒడిదుడుకులు ఎదురుకావని అన్నారు. ప్రస్తుతం ఉన్న రథశాలను తొలగించి నూతనంగా నిర్మించేందుకు కృషి చేయాలని కోరారు.

పదిమందికి నష్టం జరిగినా వేల మందికి లాభం - మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి 

పదిమందికి నష్టం జరుగుతుందని వేలాది మందికి లాభం జరిగే పనులను ఎప్పుడు ఆపకూడదని అవి నిర్విఘ్నంగా కొనసాగాలని మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి అన్నారు. అభివృద్ధి పేరిట ప్రణాళిక చర్యలు చేపడితే అన్ని వర్గాలు దానిని సమర్థించాల్సిన అవసరం ఉంటుందని అన్నారు. అభివృద్ధి నిర్మాణ పనుల విషయంలో సాధ్య సుసాధ్యాలపై అధికారులు నిబంధన ప్రకారం వ్యవహరించాలని, స్థానిక ఎమ్మెల్యే ఈ వ్యవహారాన్ని స్వయంగా సమీక్షించి అభివృద్ధికి కంకణ బదులుగా ఉండాలని సూచించారు.

ప్రజలందరి ఆమోదం మేరకే విగ్రహాలు పెట్టండి - మాజీ ఎమ్మెల్యే భీష్మ కిష్టయ్య 

ప్రజలందరి ఆమోదం మేరకే విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే బి. కిష్టయ్య సూచించారు. దేశ నాయకుల విగ్రహాలు అందరికీ అనువుగా పెడితే బాగుంటుందని తన అభిప్రాయాన్ని చెప్పారు. 

అఖిలపక్షాన్ని సీఎం వద్దకు తీసుకెళ్లాలి - బిజెపి నేత నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి 

నియోజకవర్గ అభివృద్ధి విషయంలో  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దకు అఖిలపక్ష నాయకులను తీసుకువెళ్లి అభిప్రాయాలను చెప్పే విధంగా చూడాలని స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి కోరారు.  అభివృద్ధి పనులు ఎవరికైనా నష్టం జరిగితే వారికి నష్టపరిహారం ఇచ్చే విషయమై ప్రజలకు అవగాహన చేయాలని చెప్పారు. 100% అభివృద్ధి పనులు చేపట్టడం మంచిదేనని దానికి తమ సహకారం ఎల్లవేళలా ఉంటుందని అన్నారు.

చౌరస్తా నలు దిశలా అభివృద్ధి జరగాలి - మున్సిపల్ చైర్మన్ నరేందర్ 

పట్టణ చౌరస్తాలో నలుదిక్కలకు వెళ్లే రహదారులు చట్టనిబంధనల ప్రకారం అభివృద్ధి జరగాలని దానికోసం మున్సిపాలిటీ తన పూర్తి సహకారం అందజేస్తుందని చైర్మన్ కే. నరేందర్ తెలిపారు. రాజకీయాలకు అతీతంగా పట్టణ అభివృద్ధి కోసం టిఆర్ఎస్ పార్టీ కూడా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని అన్నారు. అదేవిధంగా అభివృద్ధి విస్తరణ పనులు చేపట్టే క్రమంలో పేద ప్రజలు ఎంతోమంది ఫుట్ పాతులపై జీవనం సాగిస్తుంటారని వారికి కూడా ప్రత్యామ్నాయంగా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని తెలిపారు.  చౌరస్తా సర్కిల్ విస్తరిస్తే దాని స్వరూపం మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని సిపిఎం నేత ఎన్ రాజు తెలిపారు. ప్రణాళికలు చేసుకొని అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు.

అభివృద్ధి విషయంలో సిపిఎం పార్టీ ఎల్లవేళలా సహకరిస్తుందని తెలిపారు. పేద వర్గాలకు, సామాన్యులకు నష్టం కల్పించకుండా అభివృద్ధి పనులు చేపట్టాలని తెలిపారు. ముఖ్య కూడలిలో సర్కిల్లో ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని వివరించారు. అదేవిధంగా నూతనంగా ఏర్పాటు చేయబోయే సర్కిల్ మధ్య డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టాలని అంబేద్కర్ చౌరస్తాగా ఇప్పటికే చలామణిలో ఉందని అందుకు తగ్గట్టు ఉండాలని చెప్పారు. బహుజన సమాజ్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ దొడ్డి శ్రీనివాస్ తన అభిప్రాయాన్ని తెలిపారు. ఈ అఖిల పక్ష సమావేశంలో పట్టణ సీఐ విజయ్ కుమార్, ట్రాఫిక్ సిఐ చంద్రశేఖర్, మాజీ జెడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డి, ఆర్ అండ్ బి డిఈ రవీందర్, కౌన్సిలర్లు కానుగు అనంతయ్య, సర్వర్ పాషా, నందీశ్వర్, రాయికల్ శ్రీనివాస్, శ్రీనివాస్ గౌడ్, ప్రతాప్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు మహమ్మద్ అలీ ఖాన్ బాబర్, రఘు, చెంది తిరుపతిరెడ్డి, బాలరాజ్ గౌడ్, తోకల దామోదర్ రెడ్డి, బిజెపి నేతలు మల్చాల మురళి, వంశీ, టిఆర్ఎస్ నాయకులు యుగంధర్, రామకృష్ణ లు పాల్గొన్నారు.