పాలమూరు ఎత్తిపోతల కాంగ్రెస్ తోనే సాధ్యం

పాలమూరు ఎత్తిపోతల కాంగ్రెస్ తోనే సాధ్యం
  • పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో  పడకేసిన ప్రగతి
  • సమస్యల పరిష్కారానికే న్యాయ యాత్ర
  • షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

ముద్ర,షాద్ నగర్ : పాలమూరు ఎత్తిపోతల పథకం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రైతుల కళలను నిజం చేసి రైతులకు సాగునీరు, జిల్లా ప్రజలకు తాగునీరు అందించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని  షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. సి డబ్ల్యూ సి ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచందర్ రెడ్డి సారధ్యంలో షాద్ నగర్ నియోజక వర్గంలో చేపట్టిన న్యాయ యాత్ర మూడవరోజు కేశంపేట మండలం నిడదవెల్లి గ్రామానికి చేరుకుంది. న్యాయ యాత్రలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని తమ మద్దతును తెలియజేయడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే శంకర్ అన్నారు.

గత పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సమస్యలన్నీ పడకశాయని, ప్రజా సమస్యలను పరిష్కరించే నాథులే కరువయ్యారని, మాయ మాటలతో అధికారం చేపట్టిన బిఆర్ఎస్ ప్రభుత్వం దోపిడీకీ పాల్పడిందే కాని ప్రజలకు చేసింది ఏమి లేదని విమర్శించారు. ప్రస్తుత ఎంపీ పాలమూరు సమస్యలపై పార్లమెంటులో ఏ ఒక్క రోజు గొంతెత్తి మాట్లాడింది లేదని విమర్శించారు. పాలమూరు ఎత్తిపోతలకు జాతీయ హోదా రావాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, పాలమూరు జిల్లా సమస్యలపై పార్లమెంటులో  ప్రజల వాణి వినిపించె సమస్యలకు వంశీచంద్ రెడ్డిని గెలిపించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే అన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో  ప్రజల ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికె న్యాయ యాత్ర చేపట్టినట్టు వీర్లపల్లి శంకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి సభ్యుడు శ్యాంసుందర్ రెడ్డి, కేశంపేట జడ్పిటిసి తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి,  కేశంపేట మండల పార్టీ అధ్యక్షుడు వీరేష్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పట్లూరు జగదీశ్వర్ , పాల్గొన్నారు.