కేసీఆర్ సర్కార్​ను  సాగనంపుదాం!

కేసీఆర్ సర్కార్​ను  సాగనంపుదాం!
  • బీఆర్ఎస్​ప్రభుత్వానికి కౌంట్​డౌన్​స్టార్ట్​అయ్యింది
  • కారు స్టీరింగ్​ఒవైసీ చేతిలో ఉంది
  • తెలంగాణలో 4జీ, 3జీ, 2జీ రాదు.. మోడీజీ వస్తారు
  • కేసీఆర్​హఠావో.. బీజేపీ జితావో.. తెలంగాణ బచావో..
  • ఖమ్మం సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా

ముద్ర ప్రతినిధి, ఖమ్మం: తెలంగాణలో కేసీఆర్ సర్కార్ సాగనంపాలని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. కేసీఆర్ హఠావో.. బీజేపీ జితావో.. తెలంగాణ బచావో.. అంటూ ‘రైతు గోస- బీజేపీ భరోసా’ పేరిట ఆదివారం ఖమ్మంలో నిర్వహించిన సభకు అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అంతకు ముందు భద్రాద్రి రామాలయం సందర్శన ఉంటుందని చెప్పినప్పటికీ ఆ పర్యటన రద్దయింది. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం వచ్చిన షా.. అక్కడి నుంచి బీఎస్ఎఫ్ హెలికాప్టర్ లో ఖమ్మం వచ్చారు. 

బీఆర్ఎస్​పై విరుచుకుపడ్డ షా..

బీఆర్ఎస్​పార్టీ, సీఎం కేసీఆర్ పై అమిత్​షా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణలో డబులింజన్ సర్కారు రావాల్సిన అవసరం ఉందని, సీఎం కేసీఆర్​ని సాగనంపాలన్నారు. బీజేపీకి ప్రజలు మద్దతు ఇవ్వాలని, హైదరాబాద్​ విముక్తికి  75 సంవత్సరాలు పూర్తయ్యాయని పేర్కొన్నారు. కేసీఆర్​సర్కార్​కు కౌంట్ డౌన్​స్టార్ట్ అయ్యిందని దుయ్యబట్టారు. హైదరాబాద్​ 75 విముక్తి దినోత్సవం త్వరలోనే రాబోతోందని, ఓవైసీతో కలిసి కేసీఆర్​తెలంగాణ ఉద్యమం, సాయుధ పోరాటంలో పాల్గొన్నవారిని అవమానించారని అన్నారు. 

కేసీఆర్​సంప్రదాయాన్ని విస్మరించారు..

కేసీఆర్​కారు స్టీరింగ్​ఓవైసీ చేతిలో ఉందని అమిత్​షా తెలిపారు. దక్షిణ అయోధ్యగా భద్రాచలం పేరుగాంచిందని, భద్రాచలం రాముడికి ముత్యాల తలంబ్రాలు సమర్పించడం సంప్రదాయం కాగా.. ఆ సంప్రదాయాన్ని కేసీఆర్ విడిచిపెట్టారని విమర్శించారు. ‘కారు భద్రాచలం వస్తుంది కానీ రాముడి వద్దకు రాదు.. బీజేపీ సర్కారు వస్తే కమలాన్ని రాముడి పాదాల దగ్గర సమర్పిస్తాం, కారు స్టీరింగ్ మజ్లిస్​చేతిలో ఉంది’ అని పేర్కొన్నారు.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్​పార్టీని గెలిపిస్తారా? కేసీఆర్​ను మళ్లీ సీఎం చేస్తారా.? మజ్లిస్ చేతిలో ఉన్న కేసీఆర్​ను మళ్లీ సీఎం చేస్తారా? అంటూ అమిత్​షా ప్రజలనుద్దేశివంచి ప్రశ్నించారు. 

కేసీఆర్​గద్దె దిగిపోవాల్సిందే..

బీజేపీ నేతలపై దాడులు చేస్తే వాళ్లు ఆగిపోతారని కేసీఆర్​అనుకుంటున్నారు. ఈటల రాజేందర్​ను అసెంబ్లీ నుంచి బయటికి పంపించారు. ఎన్నో పథకాల పేరుతో ప్రజలను కేసీఆర్​మోసం చేశారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్​పార్టీ నాడు రైతుల కోసం 22వేల కోట్ల బడ్జెట్ మాత్రమే పెడితే.. నేడు ప్రధాని మోడీజీ రైతుల సంక్షేమం కోసం, వారి అభివృద్ధి కోసం లక్షా 25వేల కోట్ల బడ్జెట్ పెట్టారన్నారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసినందుకు కేంద్ర మంత్రి కిషన్​రెడ్డిని అరెస్టు చేశారని గుర్తు చేశారు. బీఆర్ఎస్​ ప్రభుత్వం రజాకార్ల పక్కన కూర్చొని పరిపాలిస్తోందని ఆరోపించారు. ఎన్నికలు సమీపిస్తున్నాయని, కేసీఆర్​గద్దె దిగిపోవాల్సిందేనని అమిత్​షా తెలిపారు. సంపూర్ణ మెజార్టీతో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

రైతుల గోస తెలియజేసేందుకే సభ..

తెలంగాణ ప్రభుత్వంలో రైతుల గోస  తెలియజేస్తూ బీజేపీ, మోడీ కేంద్ర ప్రభుత్వం ఎలా భరోసా కల్పిస్తుందనే విషయాన్ని తెలియజేసేందుకు ఈ సభ ఏర్పాటు చేశామని బీజేపీ స్టేట్​చీఫ్​కిషన్ రెడ్డి తెలిపారు. రానున్న ఎన్నికల్లో రైతులు తమకు అండగా నిలవాలని ఆయన కోరారు. కోటి ఎకరాలకు సాగునీరు ఇస్తామని చెప్పిన కేసీఆర్ వాగ్దానం ఏమైందని ప్రశ్నించారు. కేసీఆర్​పాలనలో వ్యవసాయం విధ్వంసం అయిందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్.. రెండూ కుటుంబ పార్టీలే అని మండిపడ్డారు. పార్టీ రాష్ట్ర ఎన్నికల కమిటీ  ఛైర్మెన్ , ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ నాలుగున్నర సంవత్సరాల తర్వాత ఎన్నికలు వస్తున్నాయని రైతు రుణమాఫీ చేస్తున్నారని సీఎం కేసీఆర్ తీరుపై మండిపడ్డారు. అది కూడా హైదరాబాద్ లో ప్రభుత్వ భూములు అమ్మకం చేసి రుణ మాఫీ చేస్తున్నారని ఆరోపించారు. బంగారు తెలంగాణ మాటల్లో  తప్ప చేతల్లో లేదన్నారు. 

మోసం చేయడంలో కేసీఆర్ పీహెచ్ డీ చేసిండు.. 

ఉద్యమాల గడ్డ, కేసీఆర్ దొంగ దీక్షను బయటపెట్టిన జిల్లా ఖమ్మం అని  బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, బండి సంజయ్ అన్నారు. మోసం చేయడంలో కేసీఆర్ పీహెచ్ డీ చేసిండని, దొంగ పాస్ పోర్టులు చేసిన దుబాయ్ శేఖర్ అని మండిపడ్డారు.  ఆయన కొడుకు పేరు అజయ్ రావు అని ఉంటే.. టిక్కెట్ కోసం నందమూరి తారక రామారావు పేరు పెట్టుకున్నడని విమర్శించారు. కేసీఆర్ కు రాత్రయితే పెగ్గు గుర్తుకొస్తది... ఎన్నికలొస్తేనే హామీలు గుర్తుకొస్తయ్ తప్ప ఆ తరువాత ప్రజల బాగోగులే గుర్తుకు రావు అని సంజయ్ అన్నారు. సభలో బీజేపీ జాతీయ , రాష్ట్ర , జిల్లా నేతలు పాల్గొన్నారు. సభకు పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు.