కాంగ్రెస్ గరం..గరం

కాంగ్రెస్ గరం..గరం
  • ఢిల్లీలో సోనియా, రాహుల్ తో షర్మిల భేటీ
  • హైదరాబాదు లో రేవంత్ ను కలిసిన తుమ్మల
  • తుది దశకు చేరుకున్న వైఎస్సార్టీపీ విలీనం!
  • పాలేరు నుంచి పోటీకి ఏఐసీసీ గ్రీన్​ సిగ్నల్?
  • టీ కాంగ్రెస్​సీనియర్ నేతలలో షర్మిల చిచ్చు?


ముద్ర, తెలంగాణ బ్యూరో : టీ కాంగ్రెస్ లో రాజకీయం రసవత్తరంగా మారింది. ఒకే రోజు చోటు చేసుకున్న రెండు కీలక పరిణామాలు హస్తం శ్రేణులలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఎట్టి పరిస్థితులలోనూ తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయనని పదే పదే చెబుతూ వచ్చిన షర్మిల గురువారం అనూహ్యంగా ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్​ గాంధీతో భేటీ అయ్యారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కు కౌంట్ డౌన్​ మొదలైందంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఇదే సమయంలో ముందు నుంచి ఆమె చెబుతున్నట్టుగా వచ్చే ఎన్నికలలో ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీకి కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందనే ప్రచారం హాట్ టాపిక్​ గా మారింది. కాంగ్రెస్ లో వైఎస్సార్టీపీ విలీనం దాదాపు ఖరారు కావడం, ఆమెకు తెలంగాణ నుండి టిక్కెట్టు ఇవ్వాలని అధిష్టానం భావించడం టీపీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డికి ఇబ్బందికరంగా మారిందని అంటున్నారు. తాను కాంగ్రెస్ లో ఉన్నంత వరకు తెలంగాణలో ఎట్టిపరిస్థితులలో ఆంధ్ర నాయకత్వం ఉండదని రేవంత్ రెడ్డి ఇది వరకే ప్రకటించారు. దీంతో తనను కాదని అధిష్టానం షర్మిల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోవడంపై రేవంత్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో బీఆర్ఎస్ అసంతృప్త నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రేవంత్ రెడ్డితో భేటీ కావడం మరో విశేషం.

ప్రజాప్రస్థానం పేరిట తెలంగాణలో 4,111 కి.మీ పాదయాత్ర చేపట్టిన షర్మిల వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పాలేరు నుంచి పోటీ చేస్తానని పదే పదే ప్రకటించారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ బలం పుంజుకోవడం, వైఎస్సార్టీపీకి ప్రజల నుంచి ఊహించిన ఆదరణ లేకపోవడంతో తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాలని భావించారు. ఇందులో భాగంగా తనకు పాలేరు టిక్కెట్టు డిమాండ్​ తెరపైకి తీసుకొచ్చారు. స్పందించిన రేవంత్ షర్మిల రాకను అడ్డుకుంటామని చెప్పారు. దీంతో కొన్నాళ్లు సైలెంటుగా ఉన్న షర్మిల నెల రోజుల క్రితం కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ను బెంగళూరులో కలిశారు. తర్వాత భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సైతం కాంగ్రెస్ లో షర్మిల చేరిక అంశాన్ని ప్రస్తావించారు. షర్మిల పార్టీలో చేరితో అదనంగా నాలుగు ఓట్లు వచ్చినా లాభమేనంటూ ప్రకటించారు. అదే సమయంలో డీకేతోపాటు మాణిక్​ రావ్​ ఠాక్రే సైతం షర్మిల చేరికను ధ్రువీకరించారు. 20‌‌18 అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్​ను ఓడించేందుకు ఇతర రాజకీయ పార్టీలన్నీ మహాకూటమిగా ఏర్పడగా అందులో టీడీపీ కూడా జతకలిసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన టీడీపీ తో జతకలవడాన్ని సీఎం కేసీఆర్ ​తప్పుబట్టిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికలలో తెలంగాణేతర నాయకత్వ అంశాన్ని ప్రధాన అస్త్రంగా వాడుకున్నారు. అది బీఆర్ఎస్ ​గెలుపునకు దోహదపడింది. తాజాగా షర్మిల తెలంగాణలో పోటీకి దిగితే వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపుపై ప్రతికూల ప్రభావం పడుతుందనే అనుమానాలు టీ కాంగ్రెస్​ నేతలలో వ్యక్తమవుతున్నాయి.

చేరిక ప్రతిష్టాత్మకం

షర్మిల చేరిక టీ కాంగ్రెస్​ లో రెండు వర్గాలకు ప్రతిష్టాత్మకంగా మారింది. దూకుడు స్వభావం ఉన్న షర్మిలను టీపీసీసీ చీఫ్​, సీనియర్ నాయకుడు వీహెచ్ వ్యతిరేకిస్తుంటే, కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మధుయాష్కీ గౌడ్​ వంటి సీనియర్లు సమర్థిస్తున్నారు. దీంతో సీనియర్ల మద్య విభేదాలు రచ్చకెక్కుతాయని కాంగ్రెస్ శ్రేణులే అభిప్రాయపడుతున్నాయి. షర్మిల ఢిల్లీ పర్యటన గురించి తీవ్ర చర్చ జరుగుతోంది. పాలేరు నుంచి బీఆర్ఎస్ టిక్కెట్టు ఆశించి భంగపడిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుతో పాటు కొత్తగూడెం టిక్కెట్టు రాక అసంతృప్తితో ఉన్న జలగం వెంకట్ రావు  త్వరలోనే కాంగ్రెస్​ లో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. తుమ్మల కాంగ్రెసులో చేరితే తాను ఆశించిన పాలేరు సీటు దక్కకపోవచ్చనే ముందు జాగ్రత్తతోనే షర్మిల నేరుగా ఢిల్లీకి వెళ్లి పాలేరు టిక్కెట్టు ఖరారు చేసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. దీంతో పాలేరు నుండి పోటీపడుతోన్న షర్మిల, తుమ్మలలో ఎవరికి టిక్కెట్టు వరిస్తుందనే చర్చ ఆసక్తి రేపుతోంది. జలగం వెంకట్​ రావుకు కొత్తగూడెం, మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఖమ్మం టిక్కెట్లు ఇవ్వాలనే ఆలోచనతో అధిష్టానం ఉందని సమాచారం.


16న హైదరాబాదులో సీడబ్ల్యూసీ?

ఇప్పటికే కర్ణాటక విజయంతో దూకుడు పెంచిన హస్తం దక్షిణాది రాష్ట్రాలలో అత్యధిక సీట్లు కైవసం చేసుకోవడం ద్వారా వచ్చే ఎన్నికలలో కేంద్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకునేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీకి చెక్ పెట్టేలా వ్యూహాలకు పదునుపెట్టింది. తెలంగాణలో రాబోయే ఎన్నికలే లక్ష్యంగా తొలిసారిగా ఈ నెల 16న హైదరాబాదులో  సీడబ్ల్యూసీ సమావేశానికి సన్నాహాలు ముమ్మరం చేసింది. ఇందులో అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గేతో పాటు సిడబ్ల్యూసీ సభ్యులంతా పాల్గొననున్నారు. 18న ఎన్నికల శంఖారావం పేరుతో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నది. హైదరాబాద్ కేంద్రంగా సీడబ్ల్యూసీ సమావేశాలు జరిగితే తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్​ బలీయశక్తీగా ఎదిగే అవకాశాలు లేకపోలేదు.