భార్యా, పిల్లల్ని తుపాకీతో కాల్చి చంపి, ఆత్మహత్య చేసుకున్న సిద్దిపేట కలెక్టర్ గన్‌మెన్
- సిద్దిపేట జిల్లా రామునిపట్నంలో చోటు చేసుకున్న విషాదం
- కలెక్టర్ ప్రశాంత్ జీవన్ వద్ద గన్‌మెన్‌గా పని చేస్తోన్న నవీన్
- ఆన్ లైన్ బెట్టింగ్స్ కారణంగా పెద్ద మొత్తంలో అప్పులు
- భార్యతో గొడవ... ఇద్దరు పిల్లలు సహా భార్యను తుపాకీతో కాల్చిన నవీన్
- ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకున్న నవీన్
సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం రామునిపట్నంలో ఘోరం జరిగింది. భార్య, ఇద్దరు పిల్లలని చంపి తానూ ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ వద్ద ఆకుల నవీన్ గన్‌మెన్‌గా పని చేస్తున్నాడు. ఆన్ డ్యూటీలో ఉన్న సమయంలోనే అతను ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఆన్ లైన్ బెట్టింగ్స్ కారణంగా నరేశ్ పెద్ద మొత్తంలో అప్పులు చేశాడు. దీనికి సంబంధించి భార్యాభర్తల మధ్య వాగ్వాదం.. గొడవ జరిగాయి. వారి మధ్య గొడవ తీవ్రస్థాయికి చేరుకోవడంతో నరేశ్ పాఠశాలకు వెళ్లి తన ఇద్దరు పిల్లలను తీసుకు వచ్చాడు. ఆ కోపంలో ఆరేళ్ల కొడుకు రేవంత్, అయిదేళ్ల కూతురు రిషిత, భార్య చైతన్యను తుపాకీతో కాల్చి చంపి... ఆ తర్వాత తానూ కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ విషాద ఘటనపై సిద్దిపేట సీపీ శ్వేత మీడియాతో మాట్లాడుతూ... నరేశ్ సర్వీస్ రివాల్వర్‌తో కొడుకు, కూతురు, భార్యను కాల్చి చంపాడని, ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. ప్రాథమిక సమాచారం మేరకు ఆయనకు అప్పులు ఉన్నట్లుగా తెలిసిందన్నారు. ఆన్ డ్యూటీలో ఉండగానే ఇలా జరిగిందని, అతని ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కేసు దర్యాఫ్తు చేస్తున్నట్లు వెల్లడించారు.