సింగరేణి అదుర్స్.. మొదటి అర్ధ భాగంలో అనూహ్య ఫలితాలు
- గతేడాదితో పోల్చితే వెయ్యి కోట్ల కన్నా ఎక్కువ స్థూల లాభం,36 శాతం వృద్ధి
- ఆర్థిక క్రమశిక్షణతో పెరిగిన లాభాలు
- అన్ని శాఖల పనితీరును సమీక్షిస్తున్న సింగరేణి సీఎండీ
- మంచి స్ఫూర్తినిచ్చిన అవగాహన సదస్సులు
- అత్యధిక లాభాల వాటా, దీపావళి బోనస్ లతో కొత్త ఉత్సాహంలో కార్మికులు
- వార్షిక లక్ష్య సాధన దిశగా వడివడిగా ముందుకు
ముద్ర, తెలంగాణ బ్యూరో : బొగ్గు ఉత్పత్తి రవాణా అంశంలో సింగరేణి రికార్డు దిశగా పయనిస్తోంది. తీవ్ర వర్ష ప్రభావాన్ని అధిగమిస్తూ, తన వినియోగదారులకు తగినంత బొగ్గును సరఫరా చేస్తూ గడచిన ఏడు నెలల కాలంలో అనూహ్య ఫలితాలు సాధించి అబ్బురపర్చింది. గతేడాదితో పోల్చితే వెయ్యి కోట్ల కన్నా ఎక్కువ లాభం గడించి ముందుకు దూసుకుపోతోంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి అర్థ భాగంలో భారీ వర్షాల కారణంగా బొగ్గు ఉత్పత్తి కి కొన్ని అవాంతరాలు ఏర్పడినప్పటికీ.. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత ఇప్పుడు మళ్లీ ఉత్పత్తి రథం వేగంగా కదులుతోంది. సంస్థ ఛైర్మన్, ఎండీ ఎన్.బలరామ్ ప్రతిరోజు అన్ని ఏరియాలతో ఉత్పత్తి పై ప్రత్యేకంగా సమీక్షిస్తూ, అవాంతరాలను అధిగమించేందుకు రోజువారీగా దిశా నిర్దేశం చేస్తూ లక్ష్యాల సాధన దిశగా అన్ని శాఖలను సమాయత్తం చేస్తున్నారు.
ఫలితంగా బొగ్గు ఉత్పత్తి, బొగ్గు రవాణా, ఓవర్ బర్డెన్ తొలగింపులో గణనీయ వృద్ధితో ముందుకువెళ్తున్నది. ఇదే ఒరవడితో వార్షిక ఉత్పత్తి లక్ష్యం 720 లక్షల టన్నులను సాధించాలని సింగరేణి వ్యాప్త అధికార యంత్రాంగం సమాయత్తమై పనిచేస్తోంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు బొగ్గు అమ్మకం ద్వారా రూ.17151 కోట్లు, విద్యుత్ అమ్మకాల ద్వారా రూ.2286 కోట్ల టర్నోవర్ను నమోదు చేసుకున్న సింగరేణి రికార్డు సృష్టించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి అక్టోబరు వరకు బొగ్గు, థర్మల్ విద్యుత్ అమ్మకాల ద్వారా పన్ను చెల్లింపునకు ముందు రూ.4 వేల కోట్ల స్థూల లాభాన్ని కంపెనీ ఆర్జించింది. కాగా గతేడాది ఇదే సమయానికి ఆర్థించిన రూ.2,932 కోట్ల మీద ఇది రూ.1,072 కోట్లు అదనం కావడం విశేషం. మొత్తం మీద గతేడాదితో పోల్చితే స్థూల లాభంపై 36 శాతం వృద్ధి నమోదైంది.
ఆత్మ విశ్వాసం, ఉత్సాహం నింపిన ప్రభుత్వ ప్రోత్సాహం..!
సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఇటీవలే సింగరేణి చరిత్రలోనే అత్యధిక లాభాల వాటా రూ.796 కోట్లు ప్రకటించి చెల్లించేలా ఆదేశాలిచ్చారు. దీపావళి బోనస్ రూ.358 కోట్ల రూపాయల చెల్లింపుతో పాటు కార్మికుల రక్షణకు సింగరేణి ప్రత్యేక చొరవ చూపారు. ఫలితంగా కార్మిక శ్రేణుల్లో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపై.. మరింత ఉత్సాహంతో విధులు నిర్వర్తిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం సహకారం, దిశా నిర్దేశంతో కంపెనీ కల్పించిన రూ. కోటి ప్రమాద బీమా సింగరేణీయుల్లో ధీమా పెంచింది. కొత్తగూడెం ఏరియాలోని వీకే ఓసీ, ఇల్లందు ఏరియాలోని జేకే ఓసీలకు అటవీ అనుమతులు లభించడం సంస్థ భవిష్యత్తు కు భరోసానిచ్చినట్లు అయింది. ఇదీలావుంటే సంస్ధ సీఎండీ గతంలో ఎవరూ నిర్వహించని విధంగా అన్ని గనుల రక్షణ కమిటీలు, పిట్ కమిటీలు, వర్క్ ఇన్స్పెక్టర్ల లతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.ఏక కాలంలో 40 గనులకు సంబంధించిన 1500 మంది సూపర్వైజరీ సిబ్బందిని ఉద్దేశిస్తూ.. ఉత్పత్తి కన్నా రక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కార్మికులు,సూపర్వైజర్లు ఇచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకున్న సీఎండీ.. స్వయంగా ఏరియాల్లోని వివిధ గనులను తనిఖీ చేస్తూ సంక్షేమంపై దృష్టిసారించడంతో మంచి ఫలితాలు వస్తున్నాయి.
కంపెనీ తీసుకుంటున్న ఆర్థిక క్రమశిక్షణ చర్యలు, భూ గర్భ గనుల్లో నష్టాలపై ఉద్యోగులకు కల్పిస్తున్న అవగాహన కార్యక్రమాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఉత్పత్తి, ఉత్పాదకత, కార్మికుల బాధ్యత అనే అంశం పై ప్రత్యేక సమావేశాలు, సామూహిక విందు కార్యక్రమాలను నిర్వహించిన సంస్ధ ఇందులో ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడంపై, యంత్రాల వినియోగాన్ని పెంచడంపై పూర్తి అవగాహన కలిగించింది. దీంతో అన్ని ఏరియాల్లోనూ కంపెనీ యంత్రాల వినియోగాన్ని 14 గంటల నుంచి 20 గంటల వరకు పెంచేలా చర్యలు తీసుకుంటున్నారు.ముఖ్యంగా మణుగూరు, రామగుండం-1, ఇల్లందు, కొత్తగూడెం, ఆర్జీ-3, తదితర ఏరియాల్లో ప్రొడక్షన్ డే నిర్వహిస్తూ యంత్రాల వినియోగాన్ని 20 గంటల వరకు పెంచగలిగారు. వర్షాకాలంలో రోజుకు లక్ష టన్నులకు పడిపోయిన ఉత్పత్తి పుంజుకుని ఇప్పుడు 2.2 లక్షల టన్నులకు చేరుకుంటోంది. రానున్న రోజుల్లో ఇది మరింత పెరగనుంది. మొత్తమ్మీద కష్టించి పని చేస్తేనే కంపెనీ మనుగడ ఉంటుందని, కంపెనీ ఉంటేనే తమకు మనుగడ ఉంటుందన్న విషయాన్ని కార్మికుల్లోకి తీసుకెళ్లగలిగారు. దీంతో ఉత్పత్తి ప్రక్రియలో ఉద్యోగులు అంకితభావంతో పని చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 5 నెలల కాలంలో నిర్దేశిత లక్ష్యాలను సాధించేలా ముందుకు సాగుతున్నారు. ఫలితంగా కంపెనీ గతేడాది కన్నా ఎక్కువ అత్యధిక ఉత్పత్తి, లాభాల దిశగా దూసుకెళ్తోంది.