అనుకూలమేనా?

అనుకూలమేనా?
  • రాష్ట్రంలో స్పీడ్​పెంచిన చిన్న పార్టీలు
  • 28 స్థానాలపై కన్నేసిన ఎంఐఎం
  • బహుజన లక్ష్యంతో ఆర్ఎస్పీ ప్రచారం
  • సంక్షేమ పథకాల్లో నిర్లక్ష్యమే టార్గెట్ గా ఆకునూరి మురళి
  • కీలక సమయంలో చంద్రబాబు రీ ఎంట్రీ
  • అంతర్గతంగా ప్రభావం చూపించనున్న చిన్న పార్టీలు
  • ఓట్ల చీలికపై బీఆర్ఎస్ ఆశలు
  • కేసీఆర్ హ్యాట్రిక్ కు రాచబాట?
  • తమకూ కలిసి వస్తుందనే ధీమాలో మరో రెండు పార్టీలు


ముద్ర, తెలంగాణ బ్యూరో : వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ ఉంటుందని భావిస్తున్న నేపథ్యంలో.. చిన్న పార్టీలే కీలక ప్రభావం చూపిస్తాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలితేనే బీఆర్ఎస్​కు లాభంగా మారనున్నది. ఇదే సమయంలో చిన్న పార్టీలు అనూహ్యంగా స్పీడ్ పెంచుతున్నాయి. బీఆర్ఎస్​తో దోస్తీ కొనసాగిస్తూ ఎంఐఎం.. అంతర్గత భేటీలు, యాత్రలతో బీఎస్పీ స్టేట్​చీఫ్ ఆర్ఎస్​ప్రవీణ్​ కుమార్, ఆకునూరి మురళి, కేఏ పాల్ తదితర నేతలు కూడా ఓట్ల వేటలో పడ్డారు. కీలకమైన ఎన్నికలకు ముందు టీడీపీ చీఫ్ చంద్రబాబు కూడా తెలంగాణలో దిగారు. దీంతో ఓట్లు చీలికపై బీఆర్ఎస్​అధినేత కేసీఆర్​ భారీ ఆశలు పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది.

ముందస్తుగానే మైండ్​ గేమ్!

రాష్ట్రంలో పొలిటికల్​సీన్ మారుతోంది. ఈసారి- హ్యాట్రిక్ లక్ష్యంగా బీఆర్ఎస్ ఎన్నికల ముంగిట నిచింది. వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలతో సహా సిట్టింగ్ లందరికీ సీట్లు ఖాయం చేశారు. రాష్ట్రంలో తామే పోటీ అంటూ చెబుతున్న బీజేపీపై కేసీఆర్ తన వ్యూహాలతో తెలంగాణ ప్రజల్లో వ్యతిరేకత పెంచే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, పదేళ్ల ప్రభుత్వంపైన వ్యతిరేక ఓటు సహజంగానే ఉంటుంది. దీన్ని ఒకే పార్టీకి వెళ్లకుండా.. ఇతర పార్టీల మధ్య చీలిపోయేలా చిన్న పార్టీలతోనూ కొత్తగా మైండ్ గేమ్ ప్రారంభించినట్లుగా రాజకీయాలు మొదలయ్యాయి. కొంతకాలం క్రితందాకా తెలంగాణలో ఒకటీ రెండు పార్టీలే ఉన్నాయనే చందంగా మారిన సీను.. ఇప్పుడు పలు పార్టీలు తామంటే తాము ఉన్నామంటూ ప్రజల్లో తిరుగుతున్నారు. ఓవైపు జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టిన కేసీఆర్.. తెలంగాణలో తిరిగి అధికారంలోకి రావాలనే లక్ష్యంతో పావులు కదుపుతున్నారు. ఎన్నికలకు మరో నాలుగు నెలల సమయం ఉండటంతో ఇప్పటి వరకు చేయించిన సర్వేల్లో మాత్రం బీఆర్ఎస్ కు అధికారం పక్కా అని తేలినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.

పోటీ మారింది..

2018 ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు మూడు పార్టీలు ప్రధానంగా బరిలో నిలుస్తున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ బలాలు, బలహీనతలు పక్కనపెడితే.. కాంగ్రెస్​ మాత్రం అనూహ్యంగా బలం పెంచుకుంటున్నది. యాత్రలు, ఇటీవల కన్నడ ఫలితాలు కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ పుంజుకుంటుందా.. బీజేపీ ఆశిస్తున్న స్థాయిలో ప్రజామద్దతు దక్కించుకోగలదా.. బీఆర్ఎస్ పదేళ్ల పాలన తరువాత కూడా ప్రస్తుత సవాళ్లను ఎదుర్కొని హ్యాట్రిక్ సాధించగలదా అనేది ఇప్పుడు బిగ్ డిబేట్ గా మారింది. అయితే తెలంగాణ కేంద్రంగా జరిగే పరిణామాలు అటు కేంద్రంతో ముడిపడే ఛాన్స్ ఎక్కువగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులను గమనిస్తే బీఆర్‌ఎస్‌పై పోటీకి కాంగ్రెస్, బీజేపీ సిద్ధమవుతున్నట్లు కనిపిస్తుండగా, మూడు ప్రధాన పార్టీలు ఈసారి ఒంటరిగా పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ తో చేతులు కలిపేందుకు వామపక్షాలు హస్తిన వేదికగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక బీఆర్‌ఎస్‌తో బీజేపీ బహిరంగంగా పొత్తులు పెట్టుకునే ఛాన్స్ లేదు. 

పోల్ డైవర్షన్..

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ మూడు ప్రధాన పార్టీలు రంగంలో కనిపిస్తున్నా.. పలు చిన్న పార్టీలు చాలా సీట్లలో పోటీ చేసే అవకాశం ఉంది. అయితే ఆయా స్థానాల్లో వారు గెలవకపోయినా ఓట్లను మాత్రం చీల్చే అవకాశం ఎక్కువగానే ఉంది. ఇప్పుడు అందరూ వేస్తున్న లెక్కల ప్రకారం వచ్చే ఎన్నికలలో మెజార్టీ కనీసం 5 వేలలోపు ఓట్లతో గెలిచే నియోజకవర్గాలు ఎక్కువగా ఉండే అవకావం ఉంది. అందుకే చిన్న పార్టీల ఓట్ల చీలికలు కూడా కీలకం అయ్యే అవకాశాలున్నాయి. అయితే, ఈ చిన్న పార్టీలు ఎవరి ఓట్లను చీలుస్తాయి, తద్వారా ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనేది ఇప్పుడు ముందున్న ప్రధాన చర్చగా  మారింది. 

మైనార్టీ ఓట్లను చీల్చేందుకు ఎంఐఎం..

ఇప్పటివరకు పాతబస్తీకే పరిమితమైన ఎంఐఎం.. ఇప్పుడు రాష్ట్రంలోని 20 నియోజకవర్గాలకుపైగా కన్నేసింది. ప్రస్తుతానికి 20 నియోజకవర్గాల్లో తమ ఆధిపత్యం ఉందని లెక్క తీసింది. ఎంఐఎం రాష్ట్రంలోని 50 స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతుందని సమాచారం. ఎంఐఎం ప్రధానంగా ముస్లిం వర్గాల ఓట్లను 80 శాతం వరకు చీల్చుతుందని అంచనా. ఇప్పటి లెక్కల ప్రకారం రాష్ట్రంలో మైనార్టీ వర్గాల్లో వ్యతిరేకత ఉందని భావిస్తున్నండగా.. ఎంఐఎం ఓట్లు చీల్చితే.. అది పరోక్షంగా కేసీఆర్ కే కలిసి వస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కొంతమేరకు మైనార్టీ ఓట్లు కాంగ్రెస్​ ఖాతాలో ఉంటాయి. ఇప్పుడు వీటిని చీల్చితే కాంగ్రెస్​ ఓటు బ్యాంకుకు గండి పడి, కేసీఆర్​కు లాభం చేస్తుందని అంచనా. 

ఆర్ఎస్పీతో ఫాయిదా ఎవరికి.?

ఉన్నతోద్యోగాలను వదిలి ఆకునూరి మురళి, ప్రవీణ్​కుమార్​ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ప్రవీణ్​కుమార్​బహుజన నినాదంతో రాష్ట్రంలో తిరుగుతున్నారు. ఇటీవల విదేశాల్లో ఉన్నవారితోపాటుగా దుబాయి తదితర ప్రాంతాలకు బతుకుదెరువుకు వలస వెళ్లిన వారిని కలిసి వచ్చారు. బీసీలు, ఎస్సీలు.. ఇలా అన్ని వర్గాలు తమకు అనుకూలంగా ఉంటాయని బీఎస్పీ నేతలు చెబుతున్నా.. ఎస్సీ వర్గం మాత్రమే దూరమవుతుందని అధికార పార్టీ అంచనా. ఒకవేళ ఈ వర్గం బీఎస్పీకి అనుకూలంగా మారి, ఓట్లను ఏనుగు గుర్తుకు మళ్లిస్తే ఇక్కడా కాంగ్రెస్​ కే నష్టమని భావిస్తున్నారు. దళితులు, గిరిజన ఓట్లపై ముందు నుంచీ కాంగ్రెస్ కొంత ఆశలు పెట్టుకుంది. రాష్ట్రంలో ప్రవీణ్​ రూపంలో ఈ ఓట్లు బీఎస్పీ ఖాతాలోకి వెళ్తే పరోక్షంగా కేసీఆర్ కు లాభం. 

ప్రజల్లో తిరుగుతున్న ఆకునూరి..

ఐఏఎస్​ పదవికి రాజీనామా చేసిన ఆకునూరి మురళి కూడా ప్రస్తుతం సంక్షేమ పథకాల్లో ఫెయిల్యూర్ ను చూపిస్తూ జనాల్లో తిరుగుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ ప్రజల్లో వ్యతిరేకతను నింపే ప్రయత్నాల్లో ఉన్నారు. ఆయన ప్రస్తుతం ఇంకా ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం లేదు. ఈ నేపథ్యంలో ఆకునూరి మురళి కీలకమైన ఎన్నికల సమయంలో ఎటువైపు నిలుస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. సహజంగా కాంగ్రెస్ లేదా బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లపై ఆశలు పెట్టుకున్నాయి. కానీ వీటిపి ఆకునూరి మురళి రూపంలో చీల్చితే.. బీఆర్ఎస్​ కు కలిసివచ్చే అవకాశం ఉంటుందని స్పష్టమవుతున్నది. మరోవైపు కోదండరాం తెలంగాణ జనసమితి ఒక్క చోట కూడాప్రభావం చూపించలేకపోయింది. ఈసారి ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపిస్తుందనేది తేల్చడం కష్టంగానే మారింది. ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ కూడా తెలంగాణలో స్పీడ్ పెంచారు. అయితే ఆయన రాజకీయాల్లో టైంపాస్​ నేతగా మాత్రమే కనిపిస్తున్నా.. వచ్చే ఎన్నికల నాటికి మైనార్టీ ఓట్లను తమవైపు తిప్పుకునే అవకాశం కూడా ఉందంటున్నారు. మైనార్టీ ఓట్లపై ఆశ పెట్టుకున్న కాంగ్రెస్ కు ఇది కొంత ఇబ్బందే. 

బాబు రీ ఎంట్రీ

నాలుగున్నరేండ్ల తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నఫళంగా రీ ఎంట్రీ ఇచ్చారు. ఆయన రీ ఎంట్రీ బీజేపీ శ్రేణులను కొంత భయంలో పడేస్తున్నది. ఎందుకంటే గత ఎన్నికల్లో మహా కూటమితో ఆయన కేసీఆర్ కే లాభం చేశారనే టాక్ ఉంది. అప్పుడు కూడా కేసీఆర్​కు చంద్రబాబు రూపంలో ఆయుధం దొరికింది. తెలంగాణలో కూడా టీడీపీని ఆంధ్రా పార్టీగానే చూస్తున్నారు. బీసీ లక్ష్యంతో ఆయన తెలంగాణలో జ్ఞానేశ్వర్ ముదిరాజ్​కు పార్టీ పగ్గాలు అప్పగించారు. దీంతో బీజేపీ ఓటు బ్యాంకుకు నష్టమనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 

కేసీఆర్ కు చేతికి అనుకూలత ఆయుధాలు

కేంద్రంలో అధికారంలో ఉండి కూడా తెలంగాణ అభివృద్ధికి సహకరించడం లేదంటూ బీజేపీపై రాష్ట్రంలో స్పష్టమైన అభిప్రాయాన్ని కల్పించేందుకు బీఆర్ఎస్​ భారీ వ్యూహం పన్నుతోంది. అటు బీజేపీ కూడా.. తాము అధికారంలోకి వస్తే ఈ పనులు చేస్తాం అని చెప్పే కార్యాచరణే చూపిస్తున్నది. మైనారిటీ రిజర్వేషన్లు తగ్గిస్తాం, యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేస్తాం అనేలా మతం కేంద్రంగా జరిగే ప్రచారం రాబోయే ఎన్నికల్లో వారి ఎజెండాగా కనిపిస్తోంది. బీజేపీకి చాలా నియోజకవర్గాల్లో ఇప్పటికీ పోటీ ఇచ్చే అభ్యర్థులు లేరు అన్నది వాస్తవం. ఇదే సమయంలో నాలుగేండ్ల నుంచి పెంచిన గ్యాస్ ధరలను తగ్గించిన కేంద్రం.. పెట్రోల్ ధరల విషయంలోనూ పునరాలోచన చేస్తున్నది. ఇలాంటి పరిస్థితులతో పాటుగా చిన్న పార్టీల జోరును కేసీఆర్​ అనుకూలంగా మల్చుకుంటారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.