యువచైతన్యంతో  సామాజిక సంస్కరణను చేపట్టాలి

యువచైతన్యంతో  సామాజిక సంస్కరణను చేపట్టాలి

సామాజిక సదస్సులో  ప్రముఖుల పిలుపు

హైదరాబాద్, ముద్ర ప్రతినిధి: ప్రస్తుత ఆధునిక సామాజిక జీవన వ్యవస్థలో చోటుచేసుకుంటున్న విపరీత ధోరణులు, బాధ్యతారాహిత్యం వంటి దుష్పరిణామాలను సంస్కరించుకోవాలంటే నేటి యువతరానికి పరిస్థితులపట్ల అవగాహన కల్పించి వారిని కర్తవ్యోన్ముఖులను చేయడం తక్షణం అసరమని ప్రముఖులు పిలుపునిచ్చారు.  శనివారంనాడు సికింద్రాబాద్ మౌలాలిలోని శ్రీ రామానుజ సేవా ట్రస్టు భవనంలో  నేటి సామాజిక పరిస్థితులు ... మన బాధ్యత అనే  అంశంపై  చర్చా గోష్టిని నిర్వహించారు.  

విశ్వహిందూ పరిషత్, ఆర్ ఎస్ ఎస్,  శ్రీ రామానుజ సేవా ట్రస్టులవారి సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన  ఈ సదస్సులో  శ్రీధర్ జీ, ఎం.వి. ఆర్. శాస్త్రి, పాలుట్ల రమేష్, రావినూతల శశిధర్, సోలార్ శ్రీనాధరెడ్డి, రాకా సుధాకర్,  డాక్టర్ నాగమోహనరావు,  ఎస్. శ్రీనివాసరావు (ఎల్ఐసి),, రిటైర్డ్ ఎస్.పి మాధవాచార్య,, వేణు, డి. ఎస్ పి చంద్రమౌళి, పి. శంకరన్న, ఎన్.ఐ.ఎన్ డాక్టర్ కడ్లకుంట్ల భాస్కరాచార్య, యువ సైంటిస్టు డాక్టర్ దిలీప్,  ఎన్ఆర్ఐ రాయప్రోలు చిదంబరం వంటి వివిధ రంగాల ప్రముఖులు ఈ చర్చాగోష్టిలో  సంస్కరణాత్మకమైన సూచనలు చేస్తూ  ప్రసంగాలు చేశారు.  

మన దేశంలో  నేటి ఆధునిక సమాజం విద్యాభ్యాసం నుంచే జీవితాన్ని ఆర్ధిక,  వాణిజ్యపరమైన కోణాలలో  చూడడం ప్రారంభిస్తోందని, ఇది మన సనాతన భారతీయ సంస్కృతి, సంప్రదాయ కుటుంబ జీవన వ్యవస్థకు పూర్తి విరుద్ధంగా పరిణమిస్తోందని వక్తలు ఆందోళన వ్యక్తంచేశారు.  నేటి తరానికి జీవితమంటే   ధనం,  ఆధునిక వసతులతో అనుభవించడమే జీవిత పరమావధిగా అన్వయించుకోవడం అలవాటైపోతోందని వారు విశ్లేషించారు.  పాశ్చాత్యుల మాదిరిగా మనకూ ఆధునిక విద్యా, వైద్య, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాలు తప్పక అవసరమే. కానీ వాటికోసమే మనిషి జీవించలేదని,  వాటితోపాటు జీవితాన్ని  సార్థకంచేసే.. ప్రకృతి, ఆరాధన, దైవారాధన,  సర్వమానవ సమతాభావం, లోకకల్యాణంకోసం ఆలోచించడం, సభ్యత, సంస్కారం, క్రమశిక్షణాయుతమైన జీవనశైలి, భూతదయ వంటి గొప్ప ప్రవర్తనా నియమావళిని మన  సనాతన భారతీయం మనకు అందించిందని వక్తలు గుర్తుచేశారు.

ఆహార విహారాలలో, వస్త్రధారణలో, జీవన విధానంలో మనం పాశ్చాత్యులను అనుకరించాల్సిన అగత్యం ఎందుకు వచ్చిందని వారు ప్రశ్నించారు.  మనం పాశ్చాత్యులతో ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిశోధనారంగాలలో పోటీపడాలే తప్ప వారి సంస్కృతి, వస్త్రధారణ,  జీవనశైలిని అనుకరించాల్సిన అవసరం ఏమాత్రం లేదని, ఇది నేటి యువతరం తెలుసుకొని మసలుకోవాలని వక్తలు పిలుపునిచ్చారు. ఇందుకోసం మేధావులు, విద్యా, వైద్య, ఆధ్యాత్మిక రంగాల ప్రముఖులు నేటి  సామాజిక పరిస్థితులపట్ల  అవగాహన కల్పించి, వారిని అప్రమత్తులను చేయాల్సిన అవసరం ఉందని వారు పిలుపునిచ్చారు. యువత చైతన్యవంతమైన ఎటువంటి సామాజిక దుస్థితినైనా సంస్కరించుకోగలమని వారు సూచించారు.  కాగా ఈ చర్చా గోష్టిలో రామానుజ సేవా ట్రస్టు అధ్యక్షులు డాక్టర్ ధనుంజయ, ట్రస్టు ఉపాధ్యక్షులు కౌశల్ లు సమన్వయ కర్తలుగా వ్యవహరించారు.