ఖమ్మం లోక్‌సభ నుంచి  సోనియమ్మ పోటీ!

ఖమ్మం లోక్‌సభ నుంచి  సోనియమ్మ పోటీ!
  • కాంగ్రెస్ రాష్ట్ర  కమిటీకి  సమాచారం
  • సోనియాగాంధీ పోటీపై దృష్టిసారించిన రాష్ట్ర నేతలు

ముద్ర ప్రతినిధి,  ఖమ్మం : కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీ తెలంగాణ నుంచి లోక్‌సభ బరిలో నిలవబోతున్నారా? ఖమ్మం లోక్‌సభ నుంచి ఆమె పోటీ చేయడం ఖరారైందా?.. అంటే అవుననే సమాధానమిస్తున్నాయి ఆ పార్టీ వర్గాల నుంచి. సోనియాగాంధీ ఖమ్మం నుంచి పోటీ చేస్తారంటూ అధిష్ఠానం నుంచి పార్టీ కీలక నేతలకు సమాచారం అందినట్టు సమాచారం. ఈ మేరకు కార్యాచరణను రూపొందించాలని అధిష్ఠానం సూచన చేయడంతో  పార్టీ నేతలు ఏర్పాట్లపై దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. 

తెలంగాణ నుంచి సోనియా పోటీ చేయాలని కోరుతూ టీపీసీసీ డిసెంబర్‌ నెలలోనే తీర్మానం చేసింది. ఇటీవల రెండోసారి కూడా తీర్మానం చేయగా దానిపై సోనియాగాంధీ సానుకూలంగా స్పందించారు. గతంలోనే సూత్రప్రాయ అంగీకారం తెలిపినప్పటికీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది తాజాగా క్లారిటీ వచ్చింది. కాగా, సోనియా నామినేషన్ పత్రాలను సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు దాఖలు చేస్తారని సమాచారం. ఎన్నికల సమయంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి సోనియాగాంధీని ఆహ్వానించాలని రాష్ట్ర నేతలు నిర్ణయించినట్టు తెలుస్తోంది.  పార్టీ బలంగా ఉన్న ఖమ్మం నుంచి సోనియాను బరిలోకి దింపడం ద్వారా రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేసుకోవాలని ఆ పార్టీ వర్గాలు యోచిస్తున్నాయి.