ముద్ర వార్తకు స్పందన

ముద్ర వార్తకు స్పందన
  • ప్రభుత్వ నిబంధనలు పాటించని సుప్రజ హాస్పిటల్
  • అర్హతకు మించి వైద్యం
  • డిఎంహెచ్ఓ తనిఖీలు
  • ల్యాబ్ ఆపరేషన్ థియేటర్స్ సీజ్
  • 15 రోజులు ఓపి సేవలు నిలిపివేత

సూర్యాపేట ముద్ర ప్రతినిధి: ప్రైవేట్ వైద్యంలో అంతులేని దోపిడి' శీర్షికన ప్రైవేటు వైద్యులు అర్హత లేకున్నా ల్యాబ్ లు ఏర్పాటు చేయడం, అర్హత లేని వ్యక్తులతో అనవసర పరీక్షలు చేస్తూ రోగులను పీల్చి పిప్పి చేస్తున్నారని సోమవారం ముద్ర దినపత్రికలో వచ్చిన వార్తకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు స్పందించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సుప్రజ ఆసుపత్రిలో డీఎంహెచ్వో కోటాచలం మంగళవారం తనిఖీలు నిర్వహించారు.

తనిఖీల అనంతరం డీఎంహెచ్వో మీడియాతో మాట్లాడుతూ గత మార్చి నెల నుండి ఇప్పటివరకు అర్హత లేకుండా ఇప్పటికే 46 సర్జరీలు చేశారని తెలిపారు. ఇందులో భాగంగా 15 రోజులు ఆసుపత్రి ఒపీ సేవలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ల్యాబ్, ఆపరేషన్ థియేటర్ సీజ్ చేశామని, అనంతరం సరైన వివరణ ఇవ్వకపోతే ఆస్పత్రిని సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు.

ప్రభుత్వ నిబంధనలు పాటించాలని అన్నారు. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఆసుపత్రులు, ల్యాబ్ లు, ఏర్పాటు చేస్తే, అనవసర స్కానింగ్ లు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీఎంహెచ్వో తో పాటు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు.