మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలి

మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలి
  • దొంగతనాల నివారణకు నిఘా వ్యవస్థను మరింత పటిష్ట పరచాలి: జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: మిస్సింగ్ కేసులతో పాటు చాలా రోజుల నుండి పెండింగ్లో ఉన్న కేసులపై ప్రత్యేక ద్రుష్టి సారించి త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్ అన్నారు. మంగళవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జగిత్యాల రూరల్, ధర్మపురి సర్కిల్ పరిధి పోలీస్ స్టేషన్లో ఉన్న పెండింగ్ కేసులపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఇప్పటివరకు నమోదైన కేసులలో నాన్ గ్రేవ్, గ్రేవ్ కేసులలో తీసుకోవలసిన చర్యలు గురించి అధికారులకు వివరించారు. మిస్సింగ్ కేసు ఫిర్యాదు వచ్చినప్పుడు ఆ వ్యక్తి యొక్క ఫోటోని అన్ని పోలిస్టేషన్లకు పంపించి మిస్సింగ్ వ్యక్తులను కనిపెట్టడానికి ప్రయత్నం చేయాలని అన్నారు. జిల్లా లో మిస్సింగ్ అయన మహిళలు, చిన్న పిల్లలు కేసులపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే వాటిని ట్రేస్ చేయాలని, సాధ్యమైనంత త్వరగా మిస్సయిన వారిని ట్రేస్ అవుట్ చేయాలని సూచించారు.

గుర్తుతెలియని మృతదేహాలు దొరికినప్పుడు కేసు నమోదు చేయగానే వెంటనే ఫోటోలు సీసీటీఎన్ఎస్ లో అప్లోడ్ చేయాలని, దీని ద్వారా ఎక్కడైనా మిస్సింగ్ పర్సన్ ఉంటే రాష్ట్రవ్యాప్తంగా గుర్తించి మిస్సింగ్ కేసులను ఛేదించవచ్చని సూచించారు. దోపిడీ, దొంగతనాలు ఇతర రకాల నేరాలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవడంతో పాటు పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉండాలని అధికారులను ఆదేశించారు. దొంగతనాల నివారణకు రాత్రిపూట పెట్రోలింగ్ వ్యవస్థను, నిఘా వ్యవస్థను పటిష్టం చేయాలని, ప్రతి సర్కిల్ పరిధిలో ఒక స్పెషల్ టీం ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని సూచించారు. నేర నియంత్రణ చర్యలలో కీలక పాత్ర పోషించే సి సి కెమెరాల ఏర్పాటు లో ప్రజలకు, వ్యాపారులకు అవగాహన కలిగిస్తూ బాగస్వామ్యులను చేయాలని అన్నారు. ఈ సమావేశంలో డిఎస్పీలు వెంకటస్వామి, శ్రీనివాస్ సి.ఐలు రమణమూర్తి ,ఆరిఫ్ అలీ ఖాన్, ఎస్.ఐ లు, డిసిఆర్ బి, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.