ఆధ్యాత్మిక, సామాజిక, వైద్యరంగాల సేవాప్రస్థానంలో... శ్రీరామానుజ సేవా ట్రస్టు అద్వితీయం!

ఆధ్యాత్మిక, సామాజిక, వైద్యరంగాల సేవాప్రస్థానంలో... శ్రీరామానుజ సేవా ట్రస్టు అద్వితీయం!

(ముద్ర ప్రత్యేక ప్రతినిధి): సమాజంలో చాలామంది వ్యక్తులకు అద్భుతమైన విద్యా,  వైజానిక  ప్రతిభ, సంపద, ఆధ్యాత్మిక దృక్పధం ఉంటాయి. కానీ వాటిని తమతోపాటు సమాజంలో సాటి మనుషులుగా జీవిస్తున్న వ్యక్తులకు ఉచిత సేవారూపంలో అందించడం అనేది చాలా అరుదైన విషయం. అలాంటి ఆత్మీయ సేవా సంస్థల్లో శ్రీ రామానుజ సేవా ట్రస్టు వారు విశేష పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటున్నారు. విద్యార్థులకు ఆర్థిక సహాయం శ్రీ రామానుజ సేవా ట్రస్టువారు చక్కని తెలివితేటలు కలిగి ఉన్నత చదువుల్లో రాణించగలిగి, ఆర్థికంగా స్తోమతలేని విద్యార్థులకు హార్దికంగా చేయూతనిస్తున్నారు.  ఇందులో భాగంగా సివిల్స్, గ్రూప్ 1 సర్వీసులకోసం పోటీపడుతున్న  ప్రతిభావంతులైన 43మంది పేద విద్యార్థులకు ఉన్నతస్థాయి కోచింగ్ సంస్థల్లో శిక్షణా సదుపాయాన్ని కల్పించి ప్రోత్సహిస్తున్నారు. ఇటీవల సివిల్స్ ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన ఖమ్మం జిల్లా వాసి అయిన హేమంత్ అనే విద్యార్థికి మెయిన్స్ ప్రిపరేషన్ కోసం ఉచిత శిక్షణా సదుపాయాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా నగరంలో అతడి వ్యక్తిగత జీవన అవసరాలకు తగిన ఆర్ధిక సహాయాన్ని అందించి అతనికి ట్రస్టు అండగా నిలిచింది.

పేద మహిళలకు కుట్టుమిషన్ల శిక్షణ
సికింద్రాబాద్ నెహ్రూనగర్ (మల్లాపూర్) లో గల శ్రీ బృహదాంజనేయ స్వామివారి సన్నిధిలోని  రామానుజ మందిరంలో  పేద మహిళలకోసం ఉచిత కుట్టుమిషన్ శిక్షణా కార్యక్రమాన్ని శ్రీరామానుజ సేవా ట్రస్టువారు ప్రారంభించారు. ఈ సేవా కార్యక్రమంలో మరో సామాజిక స్వచ్ఛంద సేవా సంస్థ అయిన జనహిత సేవా ట్రస్టువారు హార్దికంగా భాగస్వాములై తమవంతుగా పేద మహిళలకు 25 కుట్టుమిషన్లను పేద మహిళలకు అందించి వారికి స్వయం ఉపాధి కల్పించడం చెప్పుకోదగిన విశేషం.

పలువురికి ఉచిత వైద్యం
అరుదైన వ్యాధులతో బాధపడుతూ ట్రస్టును ఆశ్రయించిన పలువురికి శ్రీరామానుజ సేవా ట్రస్టు ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవలు అందించేందుకు కృషి చేశారు. కుషాయిగూడ వాసి అయిన ప్రభుదాస్ అనే దళితుడు రెండు కళ్లు కనిపించని అంధుడు. అతని భార్య కూరగాయల దుకాణం నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తోంది. ప్రభుదాస్ కు శరీరంలోని టెస్టికల్స్ లో గడ్డలాంటిది ఏర్పడి ప్రాణాపాయ స్థితికి దారితీసింది. దీంతో ప్రభుదాస్  భార్య స్థానిక మాజీ కార్పొరేటర్ అయిన కొత్త రామారావుతో తన భర్త సమస్యను చెప్పుకుంది. ఆయన వెంటనే స్పందించి శ్రీరామానుజ సేవా ట్రస్టువారిని సంప్రదించాలని సలహా ఇచ్చారు.  ఆమె రామానుజ సేవా ట్రస్టువారిని సంప్రదించగానే ట్రస్టు చైర్మన్ అయిన డాక్టర్ ధనుంజయ్..  ప్రభుదాస్ ను పరీక్షించి, వెంటనే ప్రఖ్యాత సర్జన్ డాక్టర్ ఎ.వై. చారికి చికిత్స నిమిత్తం సిఫార్సుచేశారు.  డాక్టర్ చారి మానవతా దృక్పధంతో  స్పందించి, దాదాపు లక్ష రూపాయల ఖర్చు అయ్యే ఆపరేషన్ ను ప్రభుదాస్ కు ఉచితంగా చేసి, తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. అలాగే ఖమ్మంజిల్లా నాగులవంచ గ్రామానికి చెందిన శ్రీమాన్ వెంకట రమణాచార్యులు శ్రీ పానకాల నరసింహస్వామివారి ఆలయంలో అర్చకులుగా సేవలందిస్తున్నారు. ఆయన చాలాకాలంగా తన మోకాలి సమస్యతో సతమతమవుతూ తన వృత్తిని కొనసాగించలేకపోతున్నారు. డాక్టర్ ను సంప్రదిస్తే ఆయన మోకాలికి రీప్లేస్ మెంట్ చికిత్స చేయాల్సి ఉంటుందని, అందుకు సుమారు రూ.రెండు లక్షల వరకూ ఖర్చు అవుతుందని చెప్పారు. దీంతో దిక్కుతోచని స్థితిలో ట్రస్టువారిని ఆశ్రయించారు. ట్రస్టువారు ఆ అర్చక కుటుంబం పరిస్థితిని గమనించి, తక్షణం తమకు ఆత్మీయ వైద్య సహోదరులైన నిమ్స్ హాస్సిటల్ స్పెషలిస్టు ప్రొఫెసర్ డాక్టర్ ముడుంబై విజయసారథికి చికిత్సకోసం సిఫార్సుచేస్తూ లేఖ రాశారు.

దీనికి ప్రొఫెసర్ విజయసారథి తక్షణం స్పందించి, నిమ్స్ హాస్పిటల్ లోని ఆర్ధోపెడిక్ ప్రొఫెసర్ డాక్టర్ నగేశ్ సహకారంతో అర్చక ఆచార్యకు ఉచితంగా మోకాలి రీప్లేస్ మెంట్ చికిత్సను విజయవంతంగా చేశారు.  కాగా ఈ ఆపరేషన్ కోసం మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తనవంతుగా ఆర్ధిక సహాయం అందించి, తమ సేవాతత్పరతను చాటుకున్నారు. హుస్నాబాద్ సమీపంలోని ఓ గ్రామానికి చెందిన చంద్రకళ అనే దిగువ మధ్యతరగతి కుటుంబానికి 54 ఏళ్ళ మహిళ కుటుంబ జీవనం భారంగా సాగుతోంది. ఓ రోజు చంద్రకళ తన ఇంటి బాత్ రూమ్ లో తలతిరిగి పడిపోయింది. కుటుంబీకులు వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి, ఆమెకు మెదడుకు సంబంధించిన సెరిబ్రల్ ఎన్యూరిజమ్  సమస్య ఉందని గుర్తించారు. ఆమెకు ఎమర్జెన్సీ ఆపరేషన్ చేయించాలని, ఇందుకు దాదాపు నాలుగైదు లక్షల వరకూ ఖర్చవుతుందని చెప్పారు. ఏం చేయాలో తెలియక చంద్రకళ కుటుంబీకులు తమకు పొరుగున ఉన్న ఎక్సయిజ్ సూపరింటెండెంట్ శ్రీమాన్ ఎస్. శ్రీనివాసమూర్తిని  సంప్రదించారు. ఆయన వెంటనే తమకు చిరపరిచితులైన శ్రీ రామానుజ సేవా ట్రస్టువారికి సమాచారం అందించారు.

దీంతో ట్రస్టువారు నిమ్స్ ఆసుపత్రి న్యూరాలజీ విభాగం అధిపతి డాక్టర్ ఎం. విజయసారథితో మాట్లాడి చంద్రకళకు వైద్యసహాయం అందించాలని కోరారు.  అడగ్గానే డాక్టర్ విజయసారథి తన సహచర వైద్య బృందం అయిన డాక్టర్ రఘురాం, డాక్టర్ మనోజ్ లతో కలసి చంద్రకళకు మెదడుకు సంబంధించిన అత్యవసర చికిత్సను విజయవంతంగా నిర్వహించి ఆ కుటుంబాన్ని ఆదుకున్నారు. గౌరెల్లి గ్రామానికి చెందిన మహేశ్ అనే యువకుడు ఓ సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు. మహేశ్ కు అనుకోకుండా వెన్నెముకకు సంబంధించిన సమస్య ఎదురైంది. అది క్రమంగా తీవ్రమై అతను పూర్తిగా నడవలేని పరిస్థితి వచ్చింది. దీంతో మహేశ్ కుటుంబం చికిత్సకు తగిన ఆర్ధిక స్తోమత లేక శ్రీరామానుజ సేవా ట్రస్టు వారిని సంప్రదించారు. మహేశ్ సమస్యను గుర్తించిన ట్రస్టు చైర్మన్ డాక్టర్ ధనుంజయ వెంటనే నిమ్స్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం. విజయసారథికి  ఈ కేసును సిఫార్సుచేసి, మహేశ్ కు ఎమర్జెన్సీ చికిత్సచేసి ఆదుకోవాలని కోరారు. దీంతో డాక్టర్ విజయసారథి చకచకా పరీక్షను నిర్వహించి, మహేశ్ కు క్లిష్టమైన డిస్క్ సర్జరీని విజయవంతంగా నిర్వహించి ఆ పేద కుటుంబాన్ని ఆదుకున్నారు. గూని వైకల్యంతో బాధపడుతున్న చంద్రిక అనే పదకొండేళ్ళ అమ్మాయి, ఆమెతోపాటు ఆమె కుటుంబీకులు తమ సమస్య పరిష్కారంకోసం శ్రీరామానుజ సేవా ట్రస్టువారిని సంప్రదించారు. దీంతో ట్రస్టు చైర్మన్  డాక్టర్ ధనుంజయ వెంటనే తమ ఆత్మీయ వైద్యమిత్రులు,  స్పైన్ సర్జరీలో విఖ్యాతిగాంచిన డాక్టర్ వోలేటి సూర్యప్రకాశరావును సంప్రదించి, చంద్రికకు గూని వైకల్య శస్ర్త చికిత్స చేయాలని కోరగా, డాక్టర్ సూర్యప్రకాశరావు రూ.8 లక్షలు ఖర్చయ్యే స్పైన్ శస్త్ర చికిత్సను ఉచితంగా చేసి, చంద్రిక భవిష్యత్తుకు భరోసా కల్పించారు.

ఎంబీబీఎస్ విద్యార్థినికి ఆర్థిక సహాయం
గౌరెల్లి గ్రామానికి చెందిన చెంచల మహేందర్ అనే దళిత కుటుంబీకుడికి రాధిక అనే కూతురు ఉంది. తండ్రి మహేందర్ పేదవాడైనా తన కూతురు రాధికను మెడిసిన్ చదివించాలనే పట్టుదలతో ఉన్నాడు. రాధిక మెడిసిన్ లో కన్వీనర్ కోటాలో ఓ ప్రైవేట్ కాలేజీలో సీటు సంపాదించుకుంది. సీటు వచ్చినా కాలేజీ యాజమాన్యానికి రూ.1.75లక్షల ఫీజు కట్టాల్సివచ్చింది.  దీంతో  ఆ పేద దళిత కుటుంబం శ్రీరామానుజ సేవా ట్రస్టువారిని సంప్రదించాడు. దీంతో ట్రస్టువారు సామాజిక సేవా దృక్పధంతో స్పందించి, వెంటనే స్థానికి బీఆర్ఎస్ నాయకులు, సేవాతత్పరులైన బండారి లక్ష్మారెడ్డిని విద్యార్థిని రాధిక కాలేజీ ఫీజుకోసం ఆర్ధిక సహాయాన్ని  కోరారు. అందుకు లక్ష్మారెడ్డి విద్యార్థినికి తనవంతుగా వెంటనే రూ.95 వేల సహాయాన్ని అందించారు. మిగతా రూ.75వేల మొత్తాన్ని శ్రీరామానుజ సేవా ట్రస్టు ముఖ్య సభ్యులు, ఆత్మీయులు ప్రొఫెసర్ డాక్టర్ డాక్టర్ ఈయుణ్ణి రాధేశ్యామ్ (ఆర్ధోపెడిక్) అడిగిన వెంటనే అందించి, తమ వదాన్యతను చాటుకున్నారు.


డాక్టర్ ధనుంజయకు ఎచీవర్స్ హెల్త్ కేర్ పురస్కారం ప్రదానం
ప్రతిష్టాత్మక శ్రీరామానుజ సేవా ట్రస్టు చైర్మన్ గా, స్వయంగా ఓ డాక్టరుగా సమాజానికి వైద్య, విద్య, ఆధ్యాత్మిక సేవా కార్యకలాపాలను అందిస్తూ, జీవితాన్ని సార్థకం చేసుకుంటున్న డాక్టర్ ధనుంజయకు డిజిటల్ హెల్త్ కేర్ రంగంలో ప్రఖ్యాతి గాంచిన మెడెక్స్ సంస్థవారు 2023 సంవత్సరానికిగాను ఎచీవర్స్ అండ్ హెల్త్ కేర్ అవార్డును ప్రదానంచేసి ఘనంగా సత్కరించింది.  జేఆర్ సీ కన్వెన్షన్ లో ఏర్పాటుచేసిన ఐకాన్స్ ఆఫ్ హెల్త్ కేర్ ..2023 అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో డాక్టర్ ధనుంజయకు  అవార్డును ప్రదానం చేసి ప్రశంసాపత్రం అందించారు.

వదాన్యుల సహకారంతో...
మా ట్రస్టు నిర్వహిస్తున్న విద్య, వైద్య, ఆధ్యాత్మిక సేవా కార్యకలాపాలకు ఎంతోమంది సేవాతత్పరులు, విజ్ఞులు, వదాన్యులు, పేరుగాంచిన వైద్యనిపుణుల సహకారం ఉంది. మా ట్రస్టు నిర్వహించే ఆరోగ్య భద్రత, వైద్య సేవల్లో భాగంగా లుకేమియా, తలసేమియా, ఆర్ధోపెడిక్ శస్త్ర చికిత్సలు, బ్రెయిన్ స్ట్రోక్స్, ఆంజియోప్లాస్టీ, బైపాస్ సర్జరీ వంటి ఖరీదైన వైద్య చికిత్సలను పేదలకు ఉచితంగా అందించగలిగాం. దీనికి సహాయం అందించిన వారందరికీ ధన్యవాదాలు.

- డాక్టర్ గోవర్ధన్ కౌశల్, వైస్ చైర్మన్, శ్రీ రామానుజ సేవాట్రస్ట్