ప్రజాసంక్షేమం లక్ష్యంగా దుద్దిళ్ళ సేవలు - అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్ 

ప్రజాసంక్షేమం లక్ష్యంగా దుద్దిళ్ళ సేవలు - అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్ 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:ప్రజా శ్రేయస్సు కోసం నిరంతరం తపించిన గొప్ప వ్యక్తి దుద్దిళ్ల శ్రీపాదరావు అని అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసన సభ స్పీకర్ దివంగత దుద్దిళ్ల శ్రీపాదరావు 87వ జయంతి వేడుకలను  కలెక్టరేట్ లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, మహనీయుల జయంతి, వర్ధంతి వేడుకలు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు.

శ్రీపాదరావు చేసిన మంచి పనులే ఆయనను జనాల్లో చిరస్థాయిగా గుర్తుండిపోయేలా చేశాయని అన్నారు. నేటి తరానికి ఆయన ఆదర్శమని కొనియాడారు. ఆయన ఆశయాలు, లక్ష్యాల సాధనకు ప్రతి ఒక్కరు పాటుపడాలని సూచించారు. 1935, మార్చి 2 న కాటారం మండలం ధన్వాడ కు చెందిన మౌళి పటేల్ రాధాకిష్టయ్య, కమలా బాయి దంపతులకు జన్మించాడన్నారు. అమ్మమ్మ నివాసముండే నాగపూర్ లో పుట్టిన ఆయన ప్రాధమిక విద్య ధన్వాడ లో, ఎస్ఎస్సి  మంథనిలో చదివారన్నారు. ఇంటర్, డిగ్రీ హైదరాబాద్ లో చేసిన తరువాత ఆదిలాబాద్ జిల్లాలో పంచాయతి ఇన్స్పెక్టర్ గా ఉద్యోగం చేశారని, ఆదిలాబాద్ జిల్లా తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ గంగయ్య, డీవైఎస్ఓ నఫెఖాన్, జిల్లా అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.