పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా దక్షిణ తెలంగాణ ప్రజల దశాబ్దాల కల నెరవేరనుంది రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా దక్షిణ తెలంగాణ ప్రజల దశాబ్దాల కల నెరవేరనుంది రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి

 ముద్ర ప్రతినిధి, వనపర్తి :  పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా దక్షిణ తెలంగాణ ప్రజల దశాబ్దపు కల నెరవేరుతున్నదని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శనివారం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఆదేశాలతో ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శులు స్మిత సబర్వాల్, ఎంపీ రాములుతో కలిసి పరిశీలించారు. 2015 జూన్ 11న 35 వేల కోట్లతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరిగిందని కొన్ని సాంకేతిక కారణాలవల్ల పనులు ఆలస్యమైనాయని మంత్రి తెలిపారు. ఇటీవల నూతన సచివాలయం ప్రారంభోత్సవం అనంతరం సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు. దీంతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని నార్లాపూర్ రిజర్వాయర్ పంపు పనులను పరిశీలించడం జరిగిందన్నారు. కృష్ణానది లోని ఏడు టీఎంసీల నీటితో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ఉమ్మడి పాలమూరు రంగారెడ్డి నల్గొండ జిల్లాలను కలిపి 12 లక్షల 50 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రణాళిక తయారు చేసినట్లు మంత్రి తెలిపారు.

భవిష్యత్తులో నీటి ఇబ్బందులు రాకుండా ఉన్న నిటి కేటాయింపులతో ఈ ప్రాంత ప్రజల అవసరాలు తీర్చేందుకు ఈ పథకం చేపట్టినట్లు మంత్రి తెలిపారు. పనులు పురోగతిలో ఉన్నావని, సంబంధిత ఇంజనీర్ల ద్వారా నార్లాపూర్ రిజర్వాయర్ నుండి దశలవారీగా ఎలక్ట్రికల్ మెకానికల్ పనులు ఇంజనీరింగ్ బృందాలతో ఏజెన్సీల ద్వారా పరిశీలించినట్లు తెలిపారు. ఇక్కడి ప్రాంత ప్రజల దశాబ్దపు కల త్వరలో నెరవేరబోతుందని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభమైతే దక్షిణ తెలంగాణ సస్యశ్యామలం కానున్నదని మంత్రి తెలిపారు. అనంతరం హైదరాబాదు నుండి వచ్చిన ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్ ఏదులలో నీటిపారుదల శాఖ అధికారులతో సాగునీటి ప్రాజెక్టు పై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  నాగర్ కర్నూల్ ఎంపీ రాములు, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్, ఇరిగేషన్ ఈఎన్సి మురళీధర్ రావు,  సలహాదారు పెంటా రెడ్డి, నాగర్ కర్నూల్ ఇరిగేషన్ సి ఈ హమీద్ ఖాన్ , మేఘ కంపెనీ ప్రతినిధి ఉమామహేశ్వర్ రెడ్డి, జిల్లా అధికారులు, నీటి పారుదల శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.