దళితుల జీవితాల్లో వెలుగులు తెచ్చింది బిఆర్ఎస్
- బిఆర్‌ఎస్‌కే టీఎమ్మార్పీఎస్ మద్దతు
- కేసీఆర్‌తోనే ఎస్సీ వర్గీకరణ సాధ్యం
- బిఆర్ఎస్ అభ్యర్ధులను గెలిపించి
సీఎం కేసీఆర్ రుణం తీర్చుకొంటాం - దళితులను బీజేపీ, కాంగ్రెస్‌లు మోసం చేశాయి
- మా సమస్యల పట్ల పోరాడుతున్న సిఎం కేసీఆర్, మంత్రి జగదీష్ రెడ్డి లను గెలిపించుకుంటం
- పేట లో మంత్రి జగదీష్ రెడ్డి కి లక్ష మెజార్టీయే లక్ష్యం గా పనిచేస్తాం
- మంత్రి జగదీష్ రెడ్డి ని కలిసి సంపూర్ణ మద్దతు ప్రకటించిన రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ
ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-మాదిగల చిరకాల ఆకాంక్ష ఎస్సీ వర్గీకరణ సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందని టిఎంఆర్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ అన్నారు. ప్రపంచం లో ఎక్కడా లేనివిధంగా దళిత బంధు పథకాన్ని తీసుకువచ్చి మా దళితుల జీవితాల్లో వెలుగులు తెచ్చింది బిఆర్ఎస్ పార్టీ అని అన్నారు. మా జీవితాల్లో నూతన వెలుగులు నింపిన బిఆర్ఎస్ పార్టీ కే రానున్న ఎన్నికల్లో మా మద్దతు అన్నారు. సూర్యాపేట మంత్రి జగదీశ్ రెడ్డి ని కలిసి తమ సంపూర్ణ మద్దతు తెలిపిన ఎమ్మార్పిఎస్ నాయకులు సూర్యాపేట తో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా బిఆర్ఎస్ అభ్యర్ధులను గెలిపించి కేసీఆర్ రుణం తీర్చుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం లో వంగపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్‌లు 29 ఏండ్లుగా ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తేల్చకుండా మాదిగలను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీలు మాదిగలను ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే వాడుకొంటూ అభివృద్ధిని, ఆర్థిక స్థితిగతులను మార్చే ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. మహాత్మ జ్యోతిరావు పూలే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను సీఎం కేసీఆర్ కొనసాగిస్తున్నారని తెలిపారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కూడా కేసీఆర్ ఎస్సీ వర్గీకరణను సమర్థిస్తూ మద్దతు ప్రకటించారని గుర్తుచేశారు. దళితుల ఆర్థిక అభివృద్ధికి రూ.లక్షలు వెచ్చిస్తున్న సీఎం కేసీఆర్ జాతీయ స్థాయి పార్టీ బీఆర్‌ఎస్ ఏర్పాటుతో దేశంలో సమూల మార్పులు తీసుకురావడం ఖాయమని స్పష్టంచేశారు. బీఆర్‌ఎస్‌కు దళితులు అండగా నిలుస్తారని, అదేసమయంలో కాంగ్రెస్, బీజేపీలకు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
సీఎం కేసీఆర్ దళితుల దారిద్య్రాన్ని పారదోలి, సమాజంలో తలెత్తుకొని జీవించాలనే గొప్ప ఆలోచనతో దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని కొనియాడారు. రానున్న ఎన్నికల్లో మాదిగ సమాజం ఏకమై మన భ్రతుకులను బాగుచేసిన బిఆర్ఎస్ పార్టీ కి అండగా ఉండి, బిఆర్ఎస్ అభ్యర్ధులను భారీమెజార్టీ తో గెలిపించుకోవాలని పిలుపు నిచ్చారు. సూర్యాపేటలో మంత్రి జగదీష్ రెడ్డికి లక్ష ఓట్ల మెజార్టీ నే లక్ష్యం గా పనిచేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ టిఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి చింత బాబు మాదిగ, రాష్ట్ర నాయకులు పల్లేటి లక్ష్మణ్, పట్టణ అధ్యక్షులు ఏర్పుల సాయి మాదిగ, బచ్చలకూరి నాగరాజు ,కడప పెంటయ్య, దుబ్బ రమేష్ ,మేడి నరసింహ ,మామిడి సైదయ్య ,పెడమర్తి విజయ్ పాల్గొన్నారు