బేరసారాలు!

బేరసారాలు!
  • చేరికలపై దృష్టి సారిస్తున్న ప్రధాన పార్టీలు
  • ఇదే అదనుగా అధిష్టానాలతో నేతల లాబీయింగ్​
  • ఎమ్మెల్యే టిక్కెట్, నామినేటెడ్ పోస్టు, కాంట్రాక్టుల హామీ
  • ఆర్థిక బలం ఉన్న లీడర్లపై పార్టీల దృష్టి
  • సీనియర్ల ముఖ్య అనుచరులు, బలమైన నేతలతో అధినేతల చర్చలు
  • కాంగ్రెస్ లో చిచ్చు రేపుతున్న చేరికలు
  • అసంతృప్తిలో సీనియర్​నేతలు
  • రసవత్తరంగా తెలంగాణ రాజకీయాలు

రాష్ట్ర రాజకీయం రసవత్తరంగా మారింది. ప్రతీసారి అభ్యర్థుల ప్రకటన తర్వాత మొదలయ్యే లాబీయింగ్.. ఇప్పుడు కాస్త తొందరగానే షురూ అయింది. పార్టీలో చేరితే తమకేం లాభమని అగ్ర నేతల ఎదుట బేరసారాలకు దిగుతున్నారు. ముందు ఎమ్మెల్యే టిక్కెట్.. లేదంటే నామినేటెడ్ పోస్టు.. అదీ కుదరకపోతే ఎన్నికల్లో గెలిస్తే కాంట్రాక్టు హామీలు పొందుతున్నారు. రాష్ట్రంలో చేరికల పర్వానికి తెరలేపిన ప్రధాన పార్టీలకు కొత్తగా చేరుతున్న నేతలు ఊహించని షాక్​ ఇస్తున్నారు. దీంతో ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్న ఆయా పార్టీల అధిష్టానాలు.. పార్టీలో చేరే నేతలకు అనాలోచిత హామీలివ్వడం హాట్ టాపిక్ గా మారింది. 

  • అసంతృప్తిలో ఆశావహులు..!

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొత్తగూడెం నుంచి బరిలో దిగుతారనే ప్రచారం జరుగుతుంది. దీంతో ఎన్నో ఏళ్లుగా పార్టీనే నమ్ముకున్న తమ పరిస్థితి ఏంటని ఆ నియోజకవర్గం నుంచి టిక్కెట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వర్​రావు, ఓబీసీ చైర్మన్​ఎడవెల్లి కృష్ణ, టీపీసీసీ సభ్యుడు నాగా సీతారాములు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు జూపల్లి కృష్ణారావుకు కొల్లాపూర్ టిక్కెట్టు ఖరారైనట్టు ప్రచారం జరుగుతుంటే ఇప్పటి వరకు నియోజకవర్గంలో పార్టీ కోసం పని చేసిన జగదీశ్వర్ రావు అయోమయంలో పడ్డారు. కూచుకుల్ల రాజేశ్ రెడ్డి కి నాగర్ కర్నూల్ నుంచి టిక్కెట్​ఖరారైనట్లు ప్రచారం జరుగుతుండగా అక్కడి నుంచి పోటీకి సిద్ధమైన సీనియర్​ నాయకుడు నాగం జనార్ధన్ రెడ్డి సైతం అసంతృప్తితో ఉన్నారు.

ముద్ర, తెలంగాణ బ్యూరో :పార్టీల్లో నేతలను చేర్చుకోవడంలో కాంగ్రెస్ ముందు వరుసలో ఉండగా.. బీఆర్ఎస్ కూడా అదే పంథాను కొనసాగిస్తుంది. మరోవైపు బీజేపీలో ఎవరూ చేరకపోవడంతో కాషాయ నేతలు నిస్తేజంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇతర పార్టీలకు చెందిన పలువురు నేతలతో వారు సంప్రదింపులకే పరిమితమయ్యారు. తెలంగాణలోనూ కర్ణాటక ఎన్నికల ఫలితాలను ఆశిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. చేరికలపై ప్రధానంగా దృష్టి పెట్టింది. 

  • ఆర్థిక బలం ఉన్న నేతలపై హస్తం దృష్టి..

రాష్ట్రంలో బీఆర్ఎస్​అధికారంలో ఉండడం, పైగా ఎమ్మెల్యేలు ఆర్థికంగా బలంగా ఉండడంతో వారిని ఢీకొట్టే నేతలకు టిక్కెట్లు ఇవ్వాలని భావిస్తోంది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ లో బలంగా ఉన్న నేతలను పార్టీలో చేర్పించుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటీ శ్రీనివాస్ రెడ్డిని ఆయన అనుచరులతో సహా పార్టీలో చేర్పించుకుంది. ఇటు కొల్లాపూర్ కు చెందిన జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి తనయుడు రాజేశ్ రెడ్డిని పార్టీలోకి తీసుకొచ్చింది. కాగా వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో పొంగులేటి తన ఐదుగురు అనుచరులకు టిక్కెట్ల డిమాండ్ పెట్టారనే ప్రచారం జరుగుతోంది. ఇటు కొల్లాపూర్ ఎమ్మెల్యే టిక్కెట్టు జూపల్లి కృష్ణారావుకు దాదాపుగా ఖరారైంది. 

  • బీఆర్ఎస్​కొత్త వ్యూహం!

చేరికలపై బీఆర్ఎస్ కొత్త వ్యూహంతో ముందుకెళ్తోంది. కాంగ్రెస్ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ఆ పార్టీని బలహీనపర్చేలా అడుగులేస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్​కు చెందిన పలువురు సీనియర్లపై కన్నేసింది. జులైలో ఖమ్మంలో జరిగిన కాంగ్రెస్ జనగర్జన సభలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న భద్రాచలంకు చెందిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అనుచరుడు తెల్లం వెంకట్రావ్ ను తిరిగి కారెక్కించుకోవడం చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్క బీఆర్ఎస్​అభ్యర్థిని అసెంబ్లీ గేటు తాకనివ్వనంటూ శపథం చేసిన పొంగులేటికి ఝలక్ ఇవ్వడం రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. రానున్న రోజుల్లో ఇంకొందరు ముఖ్య అనుచరులను గులాబీ దళంలో చేర్పించుకునేందుకు పావులు కదుపుతోంది. ఈ క్రమంలో తెల్లం వెంకట్రావ్​ కు భద్రాచలం టిక్కెట్టు ఖాయం చేసిందనే ప్రచారం జరుగుతోంది. ఇటు కాంగ్రెస్ అసంతృప్త నేత సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డితో సీఎం కేసీఆర్​మంతనాలు జరిపినట్టు సమాచారం. జగ్గారెడ్డిని బీఆర్ఎస్ లో చేర్పించుకోవడం ద్వారా ఆ జిల్లాలో తన బలం భారీగా పెంచుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. 

  • కాషాయ దళంలో నిస్తేజం..

చేరికల విషయంలో కాషాయ పార్టీలో ఊహించిన ప్రగతి కనిపించడం లేదు. బీఆర్ఎస్, కాంగ్రెస్​నేతలకు చెందిన చాలా మంది సీనియర్ నేతలు త్వరలోనే బీజేపీలో చేరుతారంటూ ఆ పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, కరీంనగర్​ ఎంపీ బండి సంజయ్ తదితర సీనియర్లు పదే పదే చేస్తున్న ప్రకటనలు కార్యరూపం దాల్చడం లేదు. ఈ విషయంలో ఆ పార్టీ నేతలు పలువురు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలతో సంప్రదింపులు జరిపినా.. తమ పార్టీ నుంచి టిక్కెట్టు రాకపోతే బీజేపీలో చేరుతామని సమాధానం ఇస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. తాజాగా కాంగ్రెస్, బీఆర్ఎస్ లో టిక్కెట్ల పంపకాలు పూర్తయ్యాకే చేరికలపై దృష్టిపెట్టాలని కమలం పార్టీ భావిస్తున్నది.

  • చిచ్చుపెడుతోన్న చేరికలు..

ముఖ్య నేతల చేరికలు కాంగ్రెస్ పార్టీలో చిచ్చురేపుతున్నాయి. ఇతర పార్టీల నుంచి నేతల చేరికలు ఆ పార్టీ నాయకులకు మింగుడుపడడం లేదు. పార్టీలో చేరుతున్న నేతలంతా అధిష్టానం తమకు ఎమ్మెల్యే టిక్కెట్టు ఖరారు చేసిందనే ప్రచారం చేసుకోవడం చర్చనీయాంశమవుతోంది. ఇన్నాళ్లూ పార్టీనే నమ్ముకుని పని చేసిన తమను కాదని ఇతర పార్టీ నుంచి వచ్చిన వారికి టిక్కెట్​ఎలా ఖరారు చేస్తారంటూ ఇప్పటికే పలువురు నేతలు అధిష్టానాన్ని నిలదీస్తున్నారు.