అంగన్​వాడీల పోరుబాట

అంగన్​వాడీల పోరుబాట
  • సమస్యలు పరిష్కరించాలని రాష్ట్రవ్యాప్త ఆందోళన
  • ఆదిలాబాద్​కలెక్టరేట్​వద్ద తీవ్ర ఉద్రిక్తత
  • మహిళా ఎస్సైని నెట్టేయడంతో స్వల్ప అస్వస్థత


ముద్ర, తెలంగాణ బ్యూరో : దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్ వాడీ కార్యకర్తలు పోరుబాట పట్టారు.  సీఐటీయూ, ఏఐటీయూసీ పిలుపు మేరకు అన్ని జిల్లా కలెక్టరేట్లను బుధవారం అంగన్ వాడీ కార్యకర్తలు ముట్టడించారు. ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల, వరంగల్, జగిత్యాల, వికారాబాద్ తదితర చోట్ల ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కనీస వేతనం, పెన్షన్ అమలు చేయాలని 11 రోజులుగా అంగన్ వాడీ కార్యకర్తలు సమ్మె చేస్తున్నారు. అయినా తమ ఆవేదనను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సీఐటీయూ, ఏఐటీయూసీ నాయకులతో కలిసి అంగన్ వాడీ కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ఆదిలాబాద్ కలెక్టరేట్ ముట్టడి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిరసనలో భాగంగా బారికేడ్లను దాటుకుని కలెక్టరేట్ ప్రాంగణంలోకి చొచ్చుకెళ్లేందుకు అంగన్​వాడీలు, లీడర్లు ప్రయత్నించారు. దీంతో పోలీసులు, ఆందోళనకారుల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఓ మహిళా ఎస్సైని కొందరు నెట్టేశారు. దీంతో మహిళా ఎస్సై  స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలో అంగన్ వాడీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని ఆదిలాబాద్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. తమ నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ముందు అంగన్ వాడీ కార్యకర్తలు ఆందోళనకు దిగి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అరెస్టులతో ఉద్యమాలను అణిచివేసేందుకు కేసీఆర్ సర్కార్ ప్రయత్నిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.