జ్యోతిబా ఫూలే పాఠశాలలో విద్యార్థి మృతి
- పాఠశాల ఎదుట బంధువుల ఆందోళన
ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని మహాత్మ జ్యోతి బాపూలే పాఠశాలలో విద్యార్ధి మృతి చెందిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. పాఠశాల సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం పాఠశాలలో 9 వ తరగతి చదువుతున్న విద్యార్ధి ఫయాజ్ హుస్సేన్ ప్రతిరోజు లాగానే బేస్ బాల్ ఆడుతూ అస్వస్థతకు గురయ్యాడన్నారు. వెంటనే అప్రమత్తమయిన పాఠశాల సిబ్బంది ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో విద్యార్థి మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతికి గల పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.
బంధువుల ఆందోళన
జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందున్న జాతీయ రహదారిపై మృతుని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. జ్యోతిబాపూలే పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి ఫయాజ్ మృతికి పాఠశాల సిబ్బంది కారణమని ఆరోపిస్తూ జాతీయ రహదారిపై బైఠాయించారు. పాఠశాల సిబ్బందికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కలెక్టర్, పాఠశాల సిబ్బంది వచ్చి సమాధానం చెప్పే వరకు కదిలేది లేదని బైఠాయించారు. దీంతో జాతీయ రహదారిపై ఇరువైపులా వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు ట్రాఫిక్ కు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు. అనంతరం ఆర్డిఓ రత్న కళ్యాణి, డిఇఓ రవీందర్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని కుటుంబ సభ్యులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
మృతుని కుటుంబానికి న్యాయం చేయండి:శ్రీహరి రావు
విషయం తెలుసుకున్న డిసిసి అధ్యక్షులు శ్రీహరి రావు కలెక్టర్ కు ఫోన్ లో సంప్రదించారు. బాధితునికి న్యాయం జరిగేలా చూడాలని కోరారు.