ప్రతిభ పురస్కారాలకు ఎంపికైన విద్యార్థులు

ప్రతిభ పురస్కారాలకు ఎంపికైన విద్యార్థులు

అభినందించిన కలెక్టర్ 

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం చేసే పదవ తరగతి విద్యార్థులకు ప్రతిభా ప్రోత్సాహక పురస్కారాలను కలెక్టర్ సంతోష్ ప్రకటించారు.  ఈమేరకు మంగళవారం కలెక్టర్ కార్యాలయం సమావేశం మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థుల వివరాలను కలెక్టర్ వెల్లడించారు. విద్యార్థుల్లో నిగుడీకృతమై ఉన్న నైపుణ్యాన్ని వెలికితీయడానికి పదవ తరగతి నమూనా పరీక్షలను నిర్వహించగా అందులో పది మంది ఎంపికైనట్టు కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం చేసే విద్యార్థులు ఆర్థికంగా వెనుకబడినప్పటికీ చదువులో మాత్రం బాగా రాణిస్తున్నారని అలాంటి వారిని ప్రోత్సహించాలనే లక్ష్యంతో జిల్లాలో ప్రతిభా ప్రోత్సాహక పురస్కారాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

వార్షిక పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన పది మంది విద్యార్థులకు అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ లో ఉచితంగా అడ్మిషన్లను ఇప్పిస్తామని చెప్పారు. అందులోనే కాకుండా ఇతర కళాశాలలో కూడా విద్యార్థులకు అడ్మిషన్ ఇప్పించడానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ రాహుల్ మాట్లాడుతూ విద్యార్థుల్లో పరీక్షల ముందు నైపుణ్యతను వెలికి తీయాలనే ఉద్దేశంతో విద్యా శాఖ తో కలిసి నమూనా పరీక్షలను నిర్వహించినట్లు తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన పదిమంది విద్యార్థులు ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు తన కళాశాలలో ఉచితంగా అడ్మిషన్ ఇస్తానని కాలేజ్ ఆఫ్ కామర్స్ డైరెక్టర్ అవినాష్ తెలిపారు. తన అన్ని బ్రాంచుల్లో విద్యార్థులకు ఉచితంగా విద్యను అందించేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.